West Bengal: ఆపరేషన్ త్రీడీ.. అంటే డిటెక్ట్.. డిలీట్.. డిపోర్ట్.. ప్రస్తుతం బెంగాల్‌లో ఈ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులను గర్తించడం.. వారి గుర్తింపును రద్దు చేయడం.. ఆ తర్వాత వారిని డిపోర్ట్ చేయడం.. ఇదే లక్ష్యంగా పెట్టుకుంది బెంగాల్ సర్కార్. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే కాషాయ జెండా రెపరెపలాడిందో.. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు మారిపోయాయి. తృణమూల్ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో బెంగాల్‌లోకి చొరబాట్లు పెరిగాయని… అక్రమంగా వలసలు వచ్చి సెటిల్ అయిపోయారని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. తాము అధికారంలోకి రాగానే వారందరిని తరిమికొడతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు బెంగాల్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది.
బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పాలి. ఎప్పుడైతే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వాళ్లు తిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు వద్ద అక్రమ వలసదారులు క్యూ కట్టారు. గత రెండు రోజులుగా వేలాది మంది బంగ్లాదేశ్ వలసదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. బెంగాల్‌వ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు కావడం, అధికారుల నిఘా, ఒత్తిడి తీవ్రం కావడంతో వారంతా తమ దేశం బాట పట్టారు. దశాబ్దాలుగా బెంగాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలు తమవంతు కోసం సరిహద్దు వద్ద పడిగాపులు కాస్తున్నాయి.
బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులను అధికారులు డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా రద్దు చేస్తున్నారు. దీనితో ఇక్కడ నివసించడం భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుందనే భయం వలసదారుల్లో మొదలైంది. అక్రమ వలసదారులను గుర్తించి డిటెన్షన్ క్యాంపులకు తరలించడం లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందనే ప్రచారంతో, చాలా కుటుంబాలు తమంతట తామే వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి.
జైలు లాంటి హోల్డింగ్ సెంటర్లలో మగ్గడం కంటే, స్వదేశానికి వెళ్ళిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఒక్కసారిగా సరిహద్దుల వైపు పోటెత్తారు. పరిస్థితిని అదుపు చేయడానికి హకీంపూర్ బోర్డర్ వద్ద పోలీసులు, సరిహద్దు రక్షణ దళాలు ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. ప్రతి ఒక్కరి బంగ్లాదేశ్ గుర్తింపు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వారి బయోమెట్రిక్ వివరాలను సేకరించి ప్రత్యేక డేటాబేస్ రెడీ చేస్తున్నారు.
ఒక్కసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తైతే.. బార్డర్ వద్దకు వచ్చిన వారిని టెంపరరీగా హోల్డింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే వారిని బంగ్లాదేశ్ సరిహద్దు దాటిస్తున్నారు. ఇన్నాళ్లూ భారత్‌లో దొంగచాటుగా ఉపాధి పొందుతూ ఇక్కడి పౌరులుగా చలామణి అయిన వలసదారులు ఇప్పుడు ఒక్కసారిగా చెల్లాచెదురవుతున్నారనే చెప్పాలి. వచ్చినప్పుడు దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చిన వారు కూడా ఇప్పుడు నేరుగా BSF అధికారులను కలిసి, తాము బంగ్లాదేశ్ వెళ్ళిపోతామంటూ స్వచ్ఛందంగా ముందుకు రావడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇన్నాళ్లు అక్రమ వలసదారులకు స్వర్గధామంగా కనిపించిన బెంగాల్.. ఇప్పుడు వారికి అలా కనిపించడం లేదు. దీనికి కారణం సీఎం సువేందు అధికారి అని చెప్పాలి. ఆయన అక్రమవలసదారులకు వరుసగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. బెంగాల్ నుంచి వెళ్లగొట్టకముందే పారిపోవాలని సూచిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రజలు స్వచ్చంధంగా వెళ్లకపోతే.. కఠిన చర్యలు తప్పవంటూ ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే వారిని జైల్లల్లో పెట్టడం లేదని.. కానీ ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని చెబుతున్నారు.
సువేందు అధికారి కేవలం మాటలు మాత్రమే కాదు.. చేతల్లో కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సర్కార్ మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఒక్కసారి అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకుంటే.. 30 రోజుల పాటు హోల్డింగ్ సెంటర్లలో ఉంచుతారు. హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే పైస్థాయి అధికారులకు ఎలాంటి వారెంట్ లేకుండానే అనుమానిత చొరబాటుదారులను అరెస్ట్ చేసే అధికారాన్ని కొత్త చట్టం కల్పించింది. దీంతో అక్రమవలసదారుల్లో ఒక భయం మొదలైంది. పట్టుబడి జైలుకు వెళ్లడం కంటే.. సొంత దేశానికి వెళ్లడం మేలు అనే ఫీల్‌లో ఉన్నారు అక్రమవలసదారులు.
కానీ ఆపరేషన్ త్రీడీ ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు కారణమైంది. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న పేద ముస్లింలను, శరణార్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఈ ఆపరేషన్ చేపట్టారనేది తృణమూల్ వాదన.. చట్టబద్ధమైన భారతీయ పౌరులు కూడా ఇందులో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే దశాబ్ధాలుగా తృణమూల్ సర్కార్ వారికి అన్ని రకాలుగా సహకరించి.. బెంగాల్‌లో జనాభా మార్పిడికి కారణమైందంటూ బీజేపీ కౌంటర్లు వేస్తోంది.
బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ప్రస్తుతం వేలాది సంఖ్యలో అక్రమవలసదారులు ఇంటిదారి పట్టేందుకు రెడీ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. వీరంతా ఇప్పుడు ఎలా వచ్చారు? వీరి చొరబాట్లు అంత ఈజీగా ఎలా జరిగాయి? వీరికి సహకరించింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి.
ఎలాగైనా వెళ్లిపోతున్నాం కదా.. ఇక్కడి గుర్తింపు కార్డులతో తమకేం పని అని చాలా మంది ఆధార్, రేషన్, ఓటర్ గుర్తింపు కార్డులను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇదే సందర్భంగా తాము దేశంలోకి ఎలా చొరబడ్డామో ఓపెన్‌గానే చెబుతున్నారు. కొందరు నదులు దాటి భారత్‌లోకి వస్తే, మరికొందరు మధ్యవర్తుల సాయంతో సరిహద్దులు దాటామని చెప్తున్నారు. 7 నుంచి 8 వేలు ఇస్తే చాలు.. తమని సరిహద్దులను దాటించారని గుర్తు చేసుకుంటున్నారు. కేవలం పది నిమిషాల్లోనే భారత్‌లోకి చొరబడటం చాలా సులువు అని చెప్పేస్తున్నారు. అంతేకాదు మరో 3 వేలు ఖర్చు చేసి ఆధార్ కార్డు సంపాదించి, రైలులో బెంగళూరు చేరుకున్నామని గుర్తు చేసుకుంటున్నారు.
అంతేకాదు గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా వలసదారులను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. స్థానిక రాజకీయ నాయకులు తనకు ఓటరు కార్డు, రేషన్ కార్డు ఇప్పించారని, అలాగే తాము రెండేళ్లుగా లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా నగదు ప్రయోజనాలు సైతం పొందామని ఓ వలసదారు చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల మాటలను బట్టి చూస్తే.. ఇది కేవలం సరిహద్దు భద్రతకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. దీని వెనుక మధ్యవర్తులు, నకిలీ పత్రాల తయారీదారులు, రాజకీయ శక్తులతో కూడిన ఒక పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్థమవుతోంది.
అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అక్రమవలసదారుల మాటలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు అధికారులు, పోలీసులు తమ వెంట పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ప్రజలకు ఇళ్లు అద్దెకు ఇస్తే 2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందనే ప్రచారం మొదలైంది. దీంతో ఓనర్లు కూడా వారిని వెంటనే పంపించే పనిలో ఉన్నారు.
ఈ చోరబాట్లు ఈ స్థాయిలో ఉండటానికి మరో కారణం.. సరిహద్దుల్లో ఎలాంటి కంచె లేకపోవడం. భారత్-బంగ్లాదేశ్ మధ్య 4 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో చాలా వరకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు లేవు. ఇది చొరబాటుదారులకు ఓ అనుకూలమైన అంశంగా మారింది. అందుకే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే BSF దళాలకు భూమిని అప్పగించే పనిని ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 600 హెక్టార్ల భూమిని కేంద్ర హోంశాఖకు బదిలీ చేశారు. ఇది కాకుండా అవుట్‌పోస్టులు, ఫెన్సింగ్ కోసం బీఎస్‌ఎఫ్‌కు 142.79 ఎకరాల భూమిని అప్పగించింది బెంగాల్ ప్రభుత్వం. రాష్ట్రంలోని 9 కీలక సరిహద్దు జిల్లాల్లో ఈ భూమిని పంపిణీ చేశారు. సిలిగురి సబ్ డివిజన్‌లోని ఫాన్సీదేవా ప్రాంతంలో ఇప్పటికే 27 కిలోమీటర్ల మేర భూమిని బీఎస్‌ఎఫ్‌కు అప్పగించడంతో, అక్కడ సరిహద్దు కంచె నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.
ముర్షిదాబాద్ జిల్లాలో అత్యధికంగా 38.805 ఎకరాలు, జల్‌పైగురిలో 35.165 ఎకరాలు, కూచ్ బెహార్‌లో 22.95 ఎకరాలు.. దక్షిణ దినాజ్‌పూర్‌లో 20.17 ఎకరాలు.. మాల్దాలో 10.90 ఎకరాలు, డార్జిలింగ్‌లో 8.815 ఎకరాలు, ఉత్తర దినాజ్‌పూర్‌లో 2.84 ఎకరాలు, నార్త్ 24 పరగణాస్‌లో 2.6 ఎకరాలు, నదియాలో 0.55 ఎకరాల భూమిని ప్రభుత్వం BSFకి అప్పగించింది. ఈ భూమిని అప్పగించడానికి స్థానికులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇరుదేశాల ఆర్మీ అధికారుల మధ్య డైలాగ్ వార్ జరిగిన ఘటనలు కనిపించాయి.
బంగ్లాదేశ్‌తో 4 వేల 97 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు 3 వేల 240 కిలోమీటర్ల మేర ఇప్పటికే కంచె వేసి ఉంది. కాగా దాదాపు 850 కిలోమీటర్ల మేర కంచె వేయకుండా ఉంది. 175 కిలోమీటర్ల మేర కంచె వేయడం అత్యంత కష్టమైందిగా భావిస్తున్నారు. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనేక నదులు ప్రవవిస్తుండటం, నేల చిత్తడి ఉండటం కంచె నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పుడు 850 కిలోమీటర్ల మేర కంచె వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మొత్తానికైతే అక్రమవలసదారులను పంపించే పని మాత్రం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే వారు పొందుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని నిలిపివేస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. వందలాది మంది ఇలా స్వదేశానికి తిరిగి వెళ్తుండటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రియాక్ట్ అయ్యారు. చొరబాటుదారులు తమంతట తామే తిరిగి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మొత్తానికైతే సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తూ వ్యూహాన్ని రచిస్తోంది బెంగాల్ ప్రభుత్వం. నేరుగా యాక్షన్ తీసుకోవడం కంటే.. ఓ భయాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు వలసదారులను పరిగెత్తించే పనిలో ఉంది అనేది మాత్రం అర్థమవుతోంది.
Also Read: బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు
Story by: Anup, Big Tv