India – Pakistan: భారత్‌ని ఏదో చేసెయ్యాలి.. ఏదో రకంగా ఇండియాలో కల్లోలం సృష్టించాలి అనుకున్న పాక్ ఎత్తులన్నీ.. చిత్తయిపోయాయి. మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే క్రమంలో.. పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. ఉగ్రదాడితో తాము ఊహించింది జరుగుతుందనుకున్న దాయాది దేశానికి.. భారతీయుల నుంచి అదే స్థాయిలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ స్వరం మారింది. ముస్లింల ఆలోచన మారింది. ఈ మార్పులతో పాకిస్థాన్ లెక్క తప్పింది.
భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య విభజనకు ప్లాన్!
మత కల్లోలం సృష్టించాలనే పాక్ లెక్క తప్పిందా?
ఉగ్రదాడితో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్థాన్!
ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది.. ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోసేది పాకిస్థానేనని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇటీవల పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేది కూడా బహిరంగ సత్యమే. ఈ ఘోరమైన టెర్రరిస్ట్ ఎటాక్‌తో.. భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మతపరమైన విభజన తెచ్చేందుకు ప్రయత్నించింది పాకిస్థాన్. మన దేశంలో రెండు మతాల గ్రూపుల మధ్య ఘర్షణలను సృష్టించడమే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. అయితే.. భారతదేశంలో మత కల్లోలాలను రెచ్చగొట్టాలనే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరలేదు.
ఉద్దేశపూర్వకంగానే హిందూ టూరిస్టులు టార్గెట్
పహల్గామ్ ఉగ్రదాడిలో.. టెర్రరిస్టులు ఉద్దేశపూర్వకంగానే హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. బాధితులను మతం ఆధారంగా గుర్తించి మరీ చంపారు. పేర్లు అడగటం, కల్మా చదవమని చెప్పడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను మాత్రమే ఎంపిక చేసి మరీ చంపేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువుల్ని కాఫిర్‌లుగా టార్గెట్ చేసినట్లుగా సూచిస్తోంది. ఇదంతా.. భారత్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు చేసిన చర్యగా కనిపిస్తోంది. హిందూ-ముస్లింల మధ్య సంఘర్షణలను సృష్టించడం ద్వారా.. స్థానిక సమాజంలో విభజన తీసుకురావడానిక చేసిన కుట్రే ఇది.
మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఉగ్రదాడి
ఎందుకంటే.. పహల్గామ్‌లో ఘోరమైన దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. ఎప్పుడూ లేని విధంగా బైసరన్ వ్యాలీలో ఉన్న పర్యాటకులను హిందువులు, ముస్లింలుగా విభజించారు. మతం అడిగారు. మతాన్ని నిర్ధారించుకున్నారు. కేవలం.. మగాళ్లను మాత్రమే చంపారు. వాళ్ల భార్యల కళ్ల ముందే అతి దారుణంగా తుపాకీ తూటాలను దించారు. తమను కూడా చంపమని ప్రాధేయపడితే.. మిమ్మల్ని చంపం. వెళ్లి.. మోడీకి చెప్పుకోండి అని చెప్పడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది విన్నాక అందరికీ అర్థమైంది ఒకటే. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని! అది.. మరో మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని చంపుతుందని!
హిందూ- ముస్లింల మధ్య విభజన తేవడమే లక్ష్యం
బైసరన్ వ్యాలీలో జరిగిన మారణహోమం వెనకున్న టార్గెట్ వెరీ క్లియర్. భారత్‌లోని హిందూ-ముస్లింల మధ్య విభజన తీసుకురావాలనేదే వారి లక్ష్యం. ముందుగా కశ్మీర్‌లో హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా భారత్ మొత్తం రెండు మతాల ప్రజల మధ్య విభజన తేవాలనేదే పాకిస్థాన్, ఉగ్రవాదుల ఆలోచన. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భారత పాలనను.. పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదులు కూడా ఈ మార్పుని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు.. భారత ప్రభుత్వం అనుమతించిన బయటి వలసలను నిరోధించడమే లక్ష్యంగా.. ఈ ఉగ్రదాడి జరిపినట్లు దాడికి తెగబడిన ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఇండియా మొత్తం మత కల్లోలాలు సృష్టించి.. హిందూ – ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఉగ్రదాడికి తెగబడ్డారు. పర్యాటకులపై ఎటాక్ జరిగితే.. ముందుగా కశ్మీర్‌లో టూరిజం ఆగిపోతుందనుకున్నారు.
మత విద్వేషాలతో దేశం మొత్తం కల్లోలం రేగుతుందన్ ప్లాన్
హిందువులనే లక్ష్యంగా చేసుకొని చంపేశారు కాబట్టి.. భారత్‌లో మతపరమైన విద్వేషాలు చెలరేగి.. దేశం మొత్తం కల్లోలం రేగుతుందనుకున్నారు. కానీ.. అవేవీ జరగకపోగా.. దేశం మొత్తం ముక్తకంఠంతో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది. ప్రతి ఒక్కరూ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ప్రతి హిందూ, ప్రతి ముస్లిం.. దొంగ దెబ్బ తీసిన పాకిస్థాన్‌పై ప్రతీకారం తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉగ్రదాడి తర్వాత ఇండియాలో పెద్దఎత్తున మతపరమైన ఉద్రిక్తతలు రేగుతున్నాయనుకున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఇండియా మొత్తం ఒక్కటై.. పాకిస్థాన్‌కి గట్టి బుద్ధి చెప్పాలని నినదించడం చూసి.. దాయాది దేశానికి మైండ్ బ్లాంక్ అయింది.
ఉగ్రదాడి తర్వాత భారత్‌లో పెరిగిన జాతీయ ఐక్యత
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి.. భారత్‌లోని ప్రతి ఒక్కరిలో ఆగ్రహావేశాలను రగిలించింది. కానీ.. పాకిస్థాన్ కోరుకున్నట్లుగా హిందూ-ముస్లింల మధ్య విస్తృతమైన మత కల్లోలాలకు దారితీయలేదు. పైగా.. ఈ దాడితో దేశం అంతా ఒకే తాటిమీదికి వచ్చింది. ఈ దాడి.. భారత్‌లో జాతీయ ఐక్యతను పెంచి.. పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని తీవ్రతరం చేసింది. దేశంలో మతపరమైన విభజన సృష్టించాలన్న పాక్‌కు గట్టి షాక్ తగిలింది.
ఇప్పడు దేశ ప్రజలంతా ఒక్కటే! అంతా భారతీయులే!
భారత్‌పై పాకిస్థాన్ కుట్రలు చేయడం, అవి భగ్నమవడం కొత్తేం కాదు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అయితే.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఈ దేశ ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కశ్మీర్‌లోని స్థానికులు, అక్కడి ముస్లింలు కూడా టెర్రరిస్ట్ ఎటాక్‌ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ దేశంలోని ముస్లింలు కూడా పాకిస్థాన్ కుట్రలను గ్రహించారు. పాక్‌కు వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. పాకిస్థాన్ విషయంలో హిందూ-ముస్లిం అనే తేడాలేమీ లేవు. ఇప్పడు దేశ ప్రజలంతా ఒక్కటే! అంతా భారతీయులే!
ఉగ్రదాడిని వ్యతిరేకించిన కశ్మీర్ ప్రజలు
ఒక్క ఉగ్రదాడితో భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య విభజన తీసుకురావడం, మత కల్లోలాలు సృష్టించాలనే ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరలేదు. కశ్మీరీ ముస్లింల కోసం, కశ్మీర్‌ని ముస్లిం రాజ్యంగా మార్చడం కోసమే.. తాము ఈ విధమైన దాడులు చేస్తున్నామనే సంకేతాలను ఉగ్ర సంస్థలు చెబుతూ ఉంటాయ్. కానీ.. ఈసారి కశ్మీర్‌లోని స్థానిక ప్రజలే ఉగ్రదాడిని వ్యతిరేకించారు. నిరసన ర్యాలీలు చేపట్టారు. అమాయకులను చంపొద్దంటూ నినదించారు. అంతేకాదు.. జాతీయ స్థాయిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత పెరిగింది.
పాకిస్థాన్ పేరు వింటేనే రగిలిపోతున్న కశ్మీరీలు, ముస్లింలు
దేశంలోని హిందువులు, ముస్లింలంతా.. పాకిస్థాన్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. దాంతో.. పాక్ పన్నిన కుట్ర చిత్తయిపోయింది. కశ్మీర్‌కు టూరిజమే ప్రాణమని.. అలాంటిది టూరిస్టులపైనే ఉగ్రదాడి జరగడాన్ని కశ్మీరీలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ పేరు వింటేనే.. కశ్మీరీలు, అక్కడి ముస్లింలు రగిలిపోతున్నారు. ఉగ్రదాడితో.. తమ బతుకుదెరువు మీద కొట్టారని చెబుతున్నారు.
ఉగ్రదాడిని ఖండించిన మెహబూబా ముస్తీ
కశ్మీర్ మహిళా నేత మెహబూబా ముఫ్తీ కూడా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఇది కశ్మీర్ సాంస్కృతిక గుర్తింపుపై జరిగిన దాడిగా వర్ణించారు. ఇది కశ్మీర్‌కు సిగ్గుచేటని చెప్పడమే కాదు.. దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. అంతేకాదు.. పీడీపీ కార్యకర్తలతో కలిసి శ్రీనగర్‌లో నిరసన ర్యాలీ కూడా చేపట్టారు ముఫ్తీ. ఇది మనందరిపై జరిగిన దాడి అని.. అమాయకుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వాస్తవానికి.. మొన్నటిదాకా మెహబూబా ముఫ్తీ, ఆమె పార్టీ పీడీపీ పాకిస్థాన్‌ను అనుకూలం అనే ముద్ర ఉండేది. కానీ.. పహల్గామ్ అటాక్‌పై వాళ్లు స్పందించిన తీరు, చేసిన నిరసన ర్యాలీలు చూశాక.. పాక్ కుట్రలు అందరికీ అర్థమైపోయాయనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ లోనూ ఉగ్రదాడిపై మిన్నంటిన నిరసనలు
ఇక.. హైదరాబాద్‌లోనూ ఉగ్రదాడిపై నిరసనలు మిన్నంటాయ్. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పాకిస్థాన్‌పై రగిలిపోతున్నారు. ఉగ్రదాడిని ఖండించడమే కాదు.. పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి మానవత్వాన్ని మంటగలిపే చర్యగా ఖండించారు. పాకిస్థాన్ భారత్ కంటే అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని విమర్శించారు. ఇండియా రక్షణ బడ్జెట్ అంత కూడా పాకిస్థాన్ బడ్జెట్ లేదన్నారు.
ఉగ్రదాడితో మత కల్లోలాలు రేపాలని పాకిస్థాన్ కు
పహల్గామ్ ఉగ్రదాడితో ఈ దేశంలో హిందూ-ముస్లింల మధ్య విభజన సృష్టించాలని, మత కల్లోలాలు రేపాలని.. పాకిస్థాన్ కుట్ర చేసింది. కానీ.. పాకిస్థాన్ కుట్రల గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక.. పాకిస్థాన్‌ని ముస్లింలే కాదు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా.. కశ్మీర్ ప్రజలు. ఒకప్పుడు ఉగ్రదాడులు, అల్లర్లతో.. కశ్మీర్ నిత్యం రగిలిపోయేది. కానీ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ పరిస్థితులు లేవు. టూరిజం పెరిగింది. కశ్మీరీలకు ఉపాధి దొరుకుతోంది. అంతా బాగుందనుకున్న సమయంలో.. ఈ ఉగ్రదాడి జరగడం అలజడి సృష్టించింది. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడే తామంతా బాగున్నామని కశ్మీరీలు గ్రహించారు.
మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడంతో పాక్ ఫెయిల్
అక్కడి వ్యాపారులు, స్థానికులు, టూరిస్ట్ గైడ్‌లతో పాటు స్థానిక ముస్లింలు కూడా పాక్ ఎలాంటి కుట్రలకు పాల్పడుతోందనే విషయాన్ని తెలుసుకున్నారు. అందుకోసమే.. ముక్తకంఠంతో ఉగ్రదాడిని ఖండించారు. దాంతో.. పాక్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకపై.. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలు కూడా తగ్గిపోయాయి. ముఖ్యంగా.. పహల్గామ్ టెర్రర్ ఎటాక్.. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడంలో ఫెయిలైంది. అందుకు బదులుగా.. స్థానికులు శాంతి కోరుకుంటున్నారనే సంకేతాన్నిచ్చింది.
పాకిస్థాన్ ఒంటరి చేసేందుకు ప్రపంచ దేశాల మద్ధతు
ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై తీసుకున్న కఠిన చర్యలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీ-వాఘా సరిహద్దును మూసేయడం, పాకిస్థాన్ రాయబారుల్ని బహిష్కరించడం లాంటివి చేసింది. అంతర్జాతీయంగానూ.. పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు.. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టింది. జీ20 దేశాల రాయబారులతో సమావేశమై.. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న మద్దతుని బహిర్గతం చేసింది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్.. భారత్ – పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చింది. సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఏదేమైనా.. ఈ దేశం మొత్తం ఒక్కటిగా నిలిచి.. పాకిస్థాన్ కుట్రలను భగ్నం చేసేందుకు ఎదురొడ్డి నిలవడం గొప్పగా కనిపిస్తోంది.