Kalvakuntla Family Issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ అని సంబోధిస్తూనే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి ఆయనే కారణమని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శల వెనుక బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర ఉందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించినవని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది… అసలు కల్వకుంట్ట ఫ్యామిలీలో అన్నాచెల్లెల్ల లెక్కలేంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది…
అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న కేసీఆర్ టీమ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అవినీతి ఆరోపణలు, వాటిపై విచారణలతో సతమతమవుతున్నారు. గ్యారంటీగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాపోయిన గులాబీ పార్టీకి పెద్ద కుదుపే అని చెప్పాలి. ఇది చాలదన్నట్లు బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాజీ సీఎంకు అసలు మింగుడుపడటం లేదంట… ఇప్పటికే పార్టీలో నెలకొన్నపరిస్థితులపై కేసీఆర్ కుమార్తె కవిత బహిరంగ లేఖరాశారు. ఫాంహౌస్‌లో కేసీఆర్ చుట్టు కోవర్టుతున్నారని, దెయ్యాలు తిరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పార్టీకి, కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది
తనపై ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదని కవిత ఆవేదన
తాజాగా బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత బీఆర్ఎస్ నేతలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది . ఒక ఆడబిడ్డపై పలువురు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. తన మీద ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని ఒక పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించింది. అంతేకాకుండా నల్గొండలో ఉండే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నాడని, నల్గొండలో ఆయన ఒక్కడు మాత్రమే గెలిచి మిగతా సీట్ల ఓటమికి కారకుడు అయ్యాడని ఫైర్ అయ్యారు. పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిని లిల్లీ పుట్ నాయకుడని వ్యాఖ్యానించిన కవిత ఆయన కూడా తన గురించి మాట్లాడడం ఏంటంటూ సీరియస్ అయ్యారు.
జగదీష్ వల్లే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యలు
నిజానికి కవిత లిల్లీపుట్ అన్నది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అని ఓపెన్ అవుతోంది. ఆ క్రమంలో కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. జగదీశ్‌రెడ్డి వల్లే నల్లగొండలో పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందని, ఆయన చావుతప్పి కన్నులొట్టపడ్డ చందంగా గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశ్‌రెడ్డి వెనుక ఓ పెద్ద నేత ఉండి, ఇటువంటి కామెంట్స్ చేయిస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు పార్టీ నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ నేతలంతా ఆ పెద్ద నేత ఎవరంటూ చర్చించడం కనిపించింది. అది కేటీఆర్ అనే కవిత ఉద్దేశమని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేదానిపై పలువులు మాట్లాడుకుంటున్నారు.
ఎమ్మెల్సీ కవితపై జగదీష్‌రెడ్డి విమర్శలు
అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే విధంగా కవిత మాటలు ఉన్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. కవిత చేసిన వ్యాఖ్యల్లో పెద్ద నాయకుడు అని పేర్కొన్నది కేటీఆర్ అని రాజకీయ విశ్లేషకులు మాట. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేందుకే ఇటీవల జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి.
పార్టీలో ఏం జరుగుతుందో తెలుసు అంటున్న కవిత
పార్టీలో కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కేటీఆర్ మధ్య ముందునుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ కంటే జగదీష్ రెడ్డి తనదైన రాజకీయం కేటీఆర్‌తోనే చేస్తున్నారంట. పలు సందర్భాల్లో జగదీశ్ రెడ్డి కేటీఆర్‌కు మద్దతుగా మాట్లాడటం కూడా కవిత ప్రస్తుత లిల్లీపుట్ వ్యాఖ్యలకు అద్దపడుతున్నాయనేది టాక్. జగదీష్,కేటీఆర్‌లు తెలంగాణ జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నారని ఆరోపించారు కవిత. అయితే తనకు కూడా పార్టీలోని విషయాలపై సమాచారం అందుతుందని హెచ్చరికలు పంపారు.
Also Read: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు
కేసీఆర్‌ని పరోక్షంగా టార్గెట్ చేసుకున్న కవిత
కేటీఆర్, కవిత మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు బీఆర్ఎస్ గద్దె దిగినప్పటి నుంచి వినిపిస్తున్నాయి. నాయకత్వ బాధ్యతలు, పార్టీలో ప్రాధాన్యత విషయాల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత పరోక్షంగా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకోవడం ద్వారా పార్టీలో ఐక్యత లేదని తేటతెల్లమవుతుందని మాట్లాడుకుంటున్న పరిస్ధితి. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఏదేమైనా కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. జగదీశ్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత వ్యాఖ్యానించడంతో ఈ వివాదం పార్టీలో గ్రూప్ రాజకీయాలను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. మరి చెల్లెలి రియాక్షన్‌పై అన్న ఎలా స్పందిస్తారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv