AI Health Advice Danger| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లపై ఆరోగ్య సలహాల కోసం ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరం కావచ్చని ఒక అధ్యయనంలో తేలింది. AI సాధనాలతో సరిగ్గా ఇంటరాక్ట్ చేయడం (సంభాషించడం) కష్టంగా ఉండటం వల్ల, వైద్య సలహాలు తీసుకునేటప్పుడు తీవ్రమైన పరిణామాలు ఏర్పడవచ్చని ఈ అధ్యయనం తెలిపింది. ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్, మెటా, X కార్ప్ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన అత్యంత అధునాతనమైన అయిదు AI సిస్టమ్‌లను పరిశీలించిన గ్లోబల్ రీసెర్చ్ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. AI సాధనాలు తప్పుడు సమాధానాలు ఇవ్వగలవని స్పష్టం చేసింది. చాట్‌బాట్‌లు నమ్మదగినట్లు కనిపించే సమాచారాన్ని ఇస్తాయి, కానీ అవి తప్పుగా ఉండవచ్చని పరిశోధకులు గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు చెందిన నటన్ష్ మోడీ అనే పరిశోధకుడు ఈ విషయంపై మాట్లాడుతూ.. “మొత్తం 88 శాతం సమాధానాలు తప్పుగా ఉన్నాయి. అయినప్పటికీ.. అవి శాస్త్రీయ పదజాలం, సరైన భాష, నకిలీ రిఫరెన్స్‌లతో నిజమైనవిగా కనిపిస్తాయి,” అని అన్నారు.
ఐదు చాట్‌బాట్‌లలో నాలుగు.. 100 శాతం సమాధానాలలో.. తప్పుడు సమాచారం ఇచ్చాయి, అయితే ఐదవ చాట్‌బాట్ 40 శాతం సమాధానాలలో తప్పుడు సమాచారం ఇచ్చింది. ఈ రోజుల్లో, ప్రజలు దాదాపు అన్నింటికీ AI సాధనాలపై ఆధారపడుతున్నారు. కానీ ఆరోగ్య సమస్యల స్వీయ-నిర్ధారణ కోసం ఈ సాధనాలను ఉపయోగించడం వల్ల కీలకమైన ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో విఫలమవ్వచ్చు లేదా వాటి తీవ్రతను తక్కువగా అంచనా వేయవచ్చు. ఇది తప్పుడు నిర్ధారణలకు దారితీయవచ్చు, ఫలితంగా చికిత్సలో ఆలస్యం లేదా చికిత్సలో తప్పులు జరిగే ప్రమాదకరంగా మారవచ్చు.
డాక్టర్ మోడీ మాట్లాడుతూ.. “మేము చేసిన అధ్యయనంలో ప్రముఖ AI కంపెనీల సిస్టమ్‌లు, డెవలపర్ సాధనాలు లేదా పబ్లిక్‌కు అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా తప్పుడు సమాచారాన్ని చాట్‌బాట్‌లు అందిస్తాయని మొదటిసారిగా చూపించింది. ఇది ఆరోగ్య రంగంలో గతంలో గుర్తించని ప్రమాదాన్ని వెల్లడిస్తుంది,” అని అన్నారు.
AIతో జరిపే సంభాషణ.. “రెండు-విధాలుగాను సమాచార వైఫల్యం చెందిందని” అధ్యయనంలో తేలింది. వినియోగదారులు సరైన సమాచారాన్ని అందించడంలో ఇబ్బంది పడతారు, దీంతో.. చాట్‌బాట్‌లు తరచూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉండే లేదా తప్పుడు సమాధానాలు ఇస్తాయి. దీని వల్ల ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను సరిగ్గా అర్థం చేసుకోలేరు లేదా తప్పుడు చికిత్సలు పొందవచ్చు.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
ఆరోగ్య రంగంలో ఉపయోగించే AI సిస్టమ్‌లు విస్తృతంగా అమలు చేయడానికి ముందు వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో పూర్తిగా పరీక్షించబడాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. “లక్షలాది మంది ఆరోగ్య సంబంధిత ప్రశ్నల కోసం AI సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే ప్రమాదం కాదు, ఇప్పటికే జరుగుతోంది,” అని డాక్టర్ మోడీ హెచ్చరించారు.
అయినప్పటికీ, AI ఆరోగ్య రంగంలో పూర్తిగా ప్రమాదకరమని చెప్పలేము. ఇది వైద్య నిపుణులకు 24/7 సహాయం అందించడం. అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, ప్రాథమిక నిర్ధారణలు అందించడం వంటి వాటిలో సహాయపడగలదు. కానీ, స్వీయ-నిర్ధారణ కోసం AIపై పూర్తిగా ఆధారపడటం మాత్రం సురక్షితం కాదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది.