గుంటూరు జిల్లాలో వైసీపీ తొత్తుల్లా పనిచేస్తున్న కొందరు అధికారులు
అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు తాము ప్రతిపక్షంలో ఉన్న ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదుర్కొన్న కేసుల నుంచి బయటపడతామని ధీమాగా కనిపిస్తారు. విపక్షంలో ఉన్నప్పుడు పెండింగులో పడిపోయిన సెటిల్‌మెంట్లు, తకు సంబంధించిన అనేక పనులు ఎంతో సులువుగా జరుగుతాయన్న ఆలోచనలో ఉంటారు. తమ ఎమ్మెల్యే అండతో అంతా సవ్యంగా జరుగుతుందని లెక్కలు వేసుకుంటారు. అయితే గుంటూరు జిల్లాలో అంత సీన్ లేకుండా పోయిందంట. ఇప్పటికీ అక్కడ కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తుండటంతో.. ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నట్లు తమ పరిస్థితి తయారైందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.
వైసీపీనే అధికారంలో ఉన్నట్లు నడుస్తున్న వ్యవహారాలు
గుంటూరు జిల్లాలో ఇంకా వైసీపీనే అధికారంలో ఉన్నట్లు వ్యవహారాలు నడుస్తున్నాయని తెలుగుదేశం శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల దౌర్జన్యలు, అక్రమాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. పోలీసుల వేధింపులకు గురయ్యాం. ఇక అఖండ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చాం.. అంతా మంచే జరుగుతుందని భావిస్తే.. అంతా రివర్స్‌గా జరుగుతోందని కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా కొందరు వైసీపీ నేతలు తమ హావాని కొనసాగిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు.
పాతపోస్టుల్లోనే కొనసాగుతున్న వివాదాస్పద అధికారులు
గత ప్రభుత్వంలో తమ పని తీరుతో వివాదాస్పదంగా మారిన పలువురు అధికారులు ఇప్పటికీ అదే పోస్టుల్లో కంటిన్యూ అవుతున్నారు. మరి కొందరు కీలక స్థానాల్లో నియమితులయ్యారు. అప్పట్లో నిబంధనల్ని పట్టించుకోకుండా వైసీపీ అజెండాకు తగ్గట్లు వ్యవహరించిన పోలీసు అధికారులకు ముఖ్యమైన స్థానాల్లో పోస్టింగులు ఇచ్చారు..అలాంటి వారిలో పలువురు ఇంకా వైసీపీ స్వామి భక్తే ప్రదర్శిస్తుండటం టీడీపీ నేతలకు కునుకు లేకుండా చేస్తుందంట. అలాంటి వారి అండతో కొందరు వైసీపీ నేతలు.. ప్రభుత్వంలో ఎవరున్నా.. తాము చెప్పిందే నడుస్తుందన్నట్లు వ్యవహరించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
1994 నుంచి పొన్నూరులో 5 సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర
ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి.. 1994 నుంచి పొన్నూరులో ఎదురులేకుండా విజయాలు సాధిస్తూ వచ్చారాయన.. అప్పటికి అయిదు సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర 2019 ఎన్నికల్లో మొదటి సారి పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ధూళిపాళ్లకు కమ్మ కుల సమీకరణలు కలిసి రాక ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు.. అలాంటి ఎమ్మెల్యే తలుచుకుంటే నియోజకవర్గంలోనే కాదు జిల్లా స్థాయిలోనూ ఏ పనైనా సజావుగా సాగుతుందని అందరూ అనుకుంటారు… అయితే అంత సీన్ కనిపించడం లేదంట.
గుంటూరులో గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న అంబటి మురళి
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అత్యంత విధేయుడు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ గుంటూరులో వివాదాస్పద గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్‌ను నిర్మిస్తున్నారు. పేరులో గ్రీన్ ఉంది తప్పించి.. ఆ మల్టీ ఫ్లోర్స్ అపార్ట్‌మెంట్‌పై అన్ని రెడ్ మార్కులే.. ఆ కట్టడానికి గుంటూరు నగరపాలక సంస్థ.. రైల్వే.. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయాన్ని గుర్తించిన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ఫిర్యాదుతో గుంటూరు కార్పొరేషన్ అధికారులు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని పేర్కొంటూ.. స్టాప్ ఆర్డర్ ను ఇష్యూ చేశారు.
వివాదాస్పద అపార్ట్‌మెంట్లో తాజాగా గృహ ప్రవేశం
ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ స్పాప్ ఆర్డర్‌తో పాటు.. కాలుష్య మండలి, రైల్వే శాఖ సైతం తాము ఇచ్చిన ఎన్వోసీలని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించి.. జీఎంసీ షోకాజ్ నోటీసుపైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా ఒక బ్లాక్ లో ప్లాట్ల నిర్మాణం పూర్తి చేసి.. తాజాగా గృహప్రవేశం చేయటం సంచలనంగా మారింది. పలు ప్రభుత్వ సంస్థల ఉత్తర్వుల్ని ధిక్కరించి మరీ గృహప్రవేశం ఎలా చేస్తారన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.
గృహ ప్రవేశంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ధూళ్లిపాళ్ల నరేంద్ర
ధూళిపాళ్ల నరేంద్ర సైతం దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వారు పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతలా అధికారులను వైసీపీ నాయకులు మేనేజ్ చేస్తున్నారంట. ఆ క్రమంలో అధికారుల ఏకపక్ష వైఖరిపై తెలుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంబటికి మద్దతుగా కొందరు టిడిపి నేతలే అధికారుల వెనకాల ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి ప్రలోభాలకు లొంగిన కొందరు టీడీపీ నేతల మంత్రాంగమే కారణమంటున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కూడా తనకు అత్యంత సన్నిహితులు దగ్గర అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారంట.
పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితిపై తమ్ముళ్ల ఆశ్చర్యం
ఆ క్రమంగా నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్ విషయంలో అధికార పార్టీ నేతల అండదండలు ఉండబట్టే.. అనుమతులు లేకపోయినా.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా గృహప్రవేశాలు జరిగిపోతున్నాయన్న అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది .. ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక ధూళిపాళ్ల నరేంద్ర న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారంట. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీలో ప్రస్తుతం గ్రీన్ గ్రేస్ రచ్చ మాత్రం గట్టిగానే నడుస్తుంది.. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితే అలా ఉంటే… ఇక తమ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు నోళ్లు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారంట.