Rayalaseema Politics: రాయలసీమ పోరాటాలకు చిరునామా కానీ ఈ పోరాటాల టైమింగ్‌పైనే ఇప్పుడు ప్రశ్నలు మెదులుతున్నాయి.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేరాయలసీమ ఉద్యమ నాయకులు రోడ్డెక్కుతుండటం…కాంగ్రెస్, వైసీపీ పాలనలో మాత్రం నోరెత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలం నుంచి మొదలైన సదరు ఉద్యమాల వెనుక నిజంగా ప్రజల ప్రయోజనాలున్నాయా? లేక రాజకీయ లక్ష్యాలతో, వైసీపీ గైడెన్స్‌లో చేస్తున్న హడావుడా?
రాయలసీమ వెనుకబాటుతనం కొత్త విషయం కాదు. నీటి కొరత, పరిశ్రమల లేమి, వలసలు… ఏ ప్రభుత్వంలోనైనా సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ ఉద్యమాల జోరు మాత్రం అధికార పార్టీని బట్టి మారుతున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమ హక్కులు సమస్యలు గురించి మాట్లాడే స్వయం ప్రకటిత మేధావులు, నాయకులు ఎందుకో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటారు. తమకు అవసరం అయినప్పడు లేక వేరేవారికి అవసరం అయినప్పుడు మాత్రమే బయటకు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు సైలెంట్ గా ఉన్న వీరు ఇప్పుడు పోరాటానికి సిద్దం కావాలంటున్నారు. దీనికితోడు విదేశాలలో సైతం రాయలసీమకు అన్యాయం జరిగిపోతుందనే ప్రచారం మొదలు పెట్టారు..
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాయలసీమలో ఉద్యమాల పేరు పెద్దగా వినిపించడం మొదలైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ‘సీమకు అన్యాయం’ అనే నినాదాలు ఊపందుకుంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘపాలనలో సీమకు జరిగిన న్యాయం ఏంటో మాత్రం ఆ స్వయం ప్రకటిత మేధావులు చెప్పరు. వాస్తవానికి కాంగ్రెస్ ఏలికలో .. అంటే టీడీపీ ఆవిర్భానికి ముందు రాయలసీమలో కృష్ణా జలాల వినియోగం పూర్తి స్థాయిలో ఉండేది కాదు.
ఎన్టీఆర్ అంకురార్పణ చేయించిన తెలుగు గంగ వల్లే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలోసాగు పెరిగిందనేది వాస్తవం .. తిరుపతి సమగ్ర అభివృద్ది సైతం ఎన్టీఆర్ హాయంలోనే ప్రారంభమైంది… ముఖ్యంగా స్వీమ్స్, బర్డ్స్ లాంటి అసుపత్రులు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు తిరుమలలో అనేక సంస్కరణలు అయన చేపట్టారు. దాంతో పాటు ద్రవిడ యూనివర్సిటి కుప్పంలో రావడానికి కూడా అయనే కారణం.
చంద్రబాబు నాయడు ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీమలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ తో, పాటు పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ ల నిర్మాణం జరిగింది. దాంతో పాటు రైతుల ఉపాధికి డెయిరీల వైపు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. అయితే దానిని అయన ఎక్స్ పోజ్ చేయలేక పోయారు. ఆయన హయాంలో హాంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేసినా పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టలేదు.. వైఎస్ అధికారంలోకి వచ్చినతర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది. కాల్వల తవ్వకం ప్రారంభించారు కానీ పనులు పూర్తిగా జరగలేదు..
ప్రస్తుతం మూడు జిల్లాలకు వర ప్రసాదినిగా మారిన హంద్రీనీవా మొదటి దశ పనులను యుద్ద ప్రాతిపాదికగా పూర్తి చేసి నీటిని పారించిన సీఎం మాత్రం కిరణ్ కూమార్ రెడ్డి. అయన శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడి పల్లి వరకు తీసుకు వచ్చారు.అయితే తర్వాత దశ పనులను మాత్రం చంద్రబాబు నాయుడు విభజిత రాష్ట సిఎంగా భాద్యతలు తీసుకున్న తర్వాత వేగవంతం చేయించారు. అయితే కుప్పం వరకు కాలువల నిర్మాణం చేయించారు. జీడిపల్లి నుంచి అనంతపురం,చిత్తూరు జిల్లాల వరకు జలాలు తీసుకొచ్చారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం సీమ నీటి ప్రయోజనాలను పెద్దగా పట్టించుకోలేదు..
అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమలో ఉద్యమాల జోరు పెరిగింది. రాజధాని, పరిశ్రమలు, అభివృద్ధి అంటూ నిరసనలు, సమావేశాలు జరిగాయి. అదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు మొదలై పనులు సాగినా ఉద్యమాలు మాత్రం తగ్గలేదు. అమరావతి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారిలో రాయలసీమ మేధావులు కీలకం. సోషల్ మీడియలో వారు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు.
ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు, చిత్తూరు జిల్లా వారు కీలక పాత్ర వహించారు. అదే ఉద్యమకారులు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు..ఎక్కడా నోరు మొదపలేదు .చివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి జగన్ కుప్పంకు నీరు వదిలానని హాడావుడి చేసినప్పుడు కూడా కనీసం నోరు మెదపలేదు. అలాంటివారు సోషల్ మీడియలో కవితా సంకలనాలపై చర్చల్లో పాల్గొనేవారనే అపవాదు ఉంది. మరో వైపు ప్రాజెక్టుల పేరుతో రైతులకు అన్యాయం జరిగినప్పుడు కనీసం స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో తిరుపతిలో రాయలసీమ మేధావుల సమావేశం మరోసారి పోరాటం అంటోంది. ఇదే పిలుపు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎందుకు రాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ఉద్యమం ప్రజల పోరాటమా?లేక రాజకీయ ఆయుధమా? అనే సందేహాలు బలపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మౌనం…విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం… అన్న ఆరోపణలే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో సీమకు అన్యాయం అంటూ రెండు సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పోరాటానికి సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సోదరుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి .
భూమన సుబ్రమణ్యంరెడ్డితో పాటు సమావేశంలో పాల్గొన్న వారంతా వైసీపీ అనుకూలురేనంట. అయితే వారి హడావుడిని మాత్రం అధికార పక్షాలు పట్టించుకోవడంలేదు. రాయలసీమకు కావాల్సింది పార్టీలకతీతమైన నిజమైన అభివృద్ధి. కానీ ఉద్యమాలే రాజకీయాలకి లోబడి పోతే ప్రజల సమస్యలు మళ్లీ వెనకబడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Story by: Apparao, Big Tv