Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన వ్యవహారశైలితో అలకకి అంబాసిడర్ అన్న అపవాదు మూటగట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో ఈ పెద్దాయన ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చినా గట్టెక్కలేకపోయారు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసినా రెన్యూవల్ చేయకపోవడం, జగిత్యాలలో తనను ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ సీనియర్ మోస్ట్ నేతలో అసంతృప్తి పెరిగిపోతూ వచ్చింది. తనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతూ వచ్చారు. ఆ క్రమంలో ఆయన తన పొలిటికల్ కెరీర్ చివరాంకంటో కాంగ్రెస్‌తో తెగతెంపులకు సిద్దమవ్వడం ఆశ్చర్యకరంగా మారింది.
అధికార హస్తం పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే కాస్త ఎక్కువగానే పార్టీని ఇరుకున పెడుతున్నారు పెద్దాయన. అవకాశం దొరికిన ప్రతిసారి సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారు. జగిత్యాలలో మారిన పొలిటికల్ సమీకరణాల్లో భాగంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు. వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్ కాంగ్రెస్ కి చేరువ కావడం జీవన్ రెడ్డికి ముందు నుంచి మింగుడు పడటం లేదు. దీంతో పార్టీపై గత రెండేళ్లుగా అలకల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు.
ప్రారంభంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సీనియార్టీని గౌరవిస్తూ.. కాస్త రియాక్ట్ అయిన కాంగ్రెస్ ముఖ్యలు బుజ్జగించడానికి ప్రయత్నిపించారు. అయితే ఎప్పటికప్పుడు జీవన్‌రెడ్డి అదే ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో పార్టీ పరంగా ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. ఆ క్రమంలో ప్రస్తుతం ఎలాంటి పదవిలో లేని జీవన్‌రెడ్డి, మరింత ఫ్రస్టేట్ అయ్యి పార్టీపై తిరుగుబాటు ప్రకటించి ఇటీవలి ఎన్నికల్లో స్వతంత్రులను బరిలోకి దింపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. అటు సంజయ్ ఇటు జీవన్ రెడ్డిల మధ్య వార్ వల్ల జగిత్యాల నియోజక వర్గంలోని మరో మున్సిపాలిటీ రాయికల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారట.. అయినా జీవన్ డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అసలు రాయికల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు చైర్మన్ పీఠం దక్కేలా ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
1983లో టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ పెద్దాయన జగిత్యాల ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ ను గద్దె దించిన నాదెండ్ల భాస్కరరావు వెంట నడిచి ఒక నెలరోజులు ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ నీడకు చేరి ఆ పార్టీ నుంచి 5 సార్లు అదే జగిత్యాల నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మళ్లీ రెండు సార్లు అమాత్య పదవి నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా ఆఖరి సారి విజయం సాధించారు. 2018లో ఓడిపోయిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం ఇవ్వడంతో ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగారు.
Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వం చర్చించే అతి కీలకమైన అంశాలివే..?
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 73 ఏళ్ల వయస్సు దాటుతున్న జీవన్ రెడ్డి తన వ్యవహారశైలితో కోరి కష్టాలు కొనితెచ్చుకున్నారు. జగిత్యాలలో తనను ఓడించిన సంజయ్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించినా ప్రయోజనం లేకుండా పోయింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన గెలవలేకపోయారు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో రెన్యువల్ చేస్తారని ఎదురు చూసి భంగపడ్డారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఛాన్స్ దొరుకుతుందని ఆశలు పెట్టుకున్నా అవి కూడా నీరుగారి పోయాయి.
ఈ నేపధ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉగాది తర్వాత ఆ పెద్దాయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం బలంగా సాగుతోంది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు వెళ్తే జగిత్యాల అభివృద్ధికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితేనే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని ఆయన అనుచరులతో చెప్తున్నారంట.
పార్టీ మారాలన్న జీవన్ రెడ్డి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా ‘లైట్’ తీసుకుంటోందంట. ఆయన గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ, పీఏసీ మెంబర్ తదితర అనేక అవకాశాలు ఇచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన పదేపదే బహిరంగంగా పార్టీ విధానాలను విమర్శించడం, ఫిరాయింపుల విషయంలో సొంత ప్రభుత్వంపైనే నిలదీయడం పార్టీ పెద్దలకు ఇబ్బందిగా మారింది. అందుకే ఆయన వెళ్తానంటే అడ్డుకోవద్దనే ధోరణిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీవన్ రెడ్డికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ పేరు మార్చడం ఇప్పుడు కొత్త చర్చకి దారితీసింది. గత కొద్దిసంవత్సరాలుగా కాంగ్రెస్ జగిత్యాలగా ఉన్నా వాట్సప్ గ్రూప్ కాస్తా ఇప్పుడు టీం TJRగా మార్చడం వెనుక పార్టీ మార్పు ఖాయమనే చర్చ నడుస్తుంది. ఈనెల 20 తేది లేదా 24 కాకుంటే 27 జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా వదిలేసి కారెక్కుతారన్న ప్రచారం జోరందుకుంది. మరి సదరు సీనియర్ నేత గులాబీ కండువా కప్పుకుంటే, అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ పార్టీలో ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత దక్కుతుందో చూడాలి.
Also Read: BRS Party: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్..!