Duvvada About Lokesh: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు . గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. నీ వలన పార్టీ పరువు పోతుందంటూ.. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు. తన సస్పెన్షన్‌పై దువ్వాడు శ్రీను ఏమంటున్నారు?.. అసలు ఆయన్ని జగన్ వద్దనుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
ప్రత్యర్థులను తిడుతూ జగన్ దగ్గర మార్కులు కొట్టేసిన దువ్వాడ
వైసిపి అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు రాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న దువ్వాడ మాధురి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి … మధ్యలో దివ్వెల మాధురి. వీరి ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. దువ్వాడ వాణి గత కొంత కాలంగా మీడియాకి దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు .అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి మాత్రం చెట్టాపట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహార యాత్రలు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మరో వైపు రీల్స్‌తో సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు.
పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్న దువ్వాడ శ్రీను భార్య వాణి
అయితే మొన్న మధ్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పేదాడ తిలక్ , పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి టెక్కలి వైసిపి జడ్పీటీసీ దువ్వాడ వాణి సడన్‌గా ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ కక్షతో టెక్కలి నియోజక వర్గంలోని నాలుగు మండలాల పరిధిలో స్థానిక సంస్థల నిధులు వినియోగించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని దానివల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని లేకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి దువ్వాడ వాణి పొలిటికల్ గా తిరిగి యాక్టివ్ అవ్వటం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది పొలిటికల్ గా దువ్వాడ శ్రీను లూప్‌లైన్లోకి వెళ్లిపోతుంటే … దువ్వాడ వాణి మెయిన్ లైన్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఆ క్రమంలో దువ్వాడ వాణి , తిలక్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటున్నారు
టెక్కలి జడ్పీటీసీగా కొనసాగుతున్న దువ్వాడ వాణి
దువ్వాడ వాణిది ముందు నుండి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి సంపతరావు రాఘవరావు కాంగ్రెస్ నుంచి టెక్కలి ఎంపీపీ గా గెలవగా, వాణి ప్రస్తుతం టెక్కలి వైసిపి జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశాడు.
2009 నుంచి ఒక్క ఎన్నికల్లోనూ గెలవని దువ్వాడ
దువ్వాడ శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన దువ్వాడ చివరికి జగన్ చలవతో 2021లో ఎమ్మెల్సీ అయి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతూ… దివ్వెల మాధురితో కలిసి సోషల్ మీడియాలో అలా కానిచ్చేస్తున్నారు.
మాధురితో కలిసి హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం
మాధురితో కలిసి హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామమని కొత్త అర్థం
తాను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని.. సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని దువ్వాడ అంటున్నారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామమని కొత్త అర్థం చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహానుభావుడు గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేస్తూ.. బోల్డు ధైర్యం ప్రదర్శించేశారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నాంటున్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ శ్రీనివాస్ వ్యఖ్యానించారు.
దువ్వాడ వ్యవహారం రచ్చకెక్కినప్పుడు పట్టించుకోని జగన్
దువ్వాడ శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా క్రమశిక్షణ చర్యలైతే అప్పుడే సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇన్‌స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫొటోషూట్, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ… జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.
Also Read: కవితకు ఉద్యమకారుల షాక్.. గ్యాప్ పెరుగుతోందా?
సోషల్ మీడియా ఇంటర్వ్యూలో లోకేష్‌ను పొగిడిన దువ్వాడ
అలాంటిది… ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికరవిషయం తెలిసింది. మంత్రి లోకేష్‌ను పొగడటమే దానికి కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరుఅని అడిగిన ప్రశ్నకు… లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్‌ను అంతగా పొడిగితే జగన్ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట. మొత్తానికి వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న దువ్వాడ పదవీ కాలం తర్వాత.. ఆయన రాజకీయ ప్రస్థానానికి అలా ఎండ్ కార్ట్ పడే పరిస్థితి కనిపిస్తోంది.