Telangana politics: అసలే అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్‌కు..ఎమ్మెల్సీ కవిత పర్యటనతో ఖమ్మం జిల్లాలో మంచిరోజులు వస్తాయని గులాబీ శ్రేణులు భావించాయి. కారు జోరు పెంచేందుకు అడుగులు పడతాయని అనుకున్న తరుణంలో ఆదిలోనే హంసపాదులా తయారైందట పరిస్ధితి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటుంచితే ఉద్యమకారుల రూపంలో కారు పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయట. పదేళ్లు అధికారం ఉన్న కాలంలో ఉద్యమకారులను అణచివేసారని…ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఎత్తివేయకపోవడంపై ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులు ఎమ్మెల్సీ కవిత ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ పదవులు ఇచ్చిన నేతలు ముందు నుంచి ఉన్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారంట. అసలు కవిత ఈ టూర్‌లో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది?
బైపోల్స్ మంత్రం జపిస్తున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరహాలోనే ఆమె కూడా బైపోల్స్ మంత్రం పటిస్తూ గులాబీ క్యాడర్, తన జాగృతి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఇటీవల కాలంలో వరుసగా జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్న కవిత తాజాగా ఖమ్మం జిల్లాలో చేసిన పర్యటన రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం జిల్లా పర్యటనలో పలువురు బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఓ నేత ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన తర్వాత కవిత తెలంగాణ ఉద్యమకారులతోనూ సమావేశం నిర్వహించారు. అంత బానే ఉందనుకుంటున్న తరుణలో కవితకు ఉద్యమకారుల రూపంలో ఉహించని షాక్ తగిలిందట. మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లపాటు తమ హవా కొనసాగించారు. కానీ ఎన్నడూ కూడా మలి, తొలి దశ ఉద్యమకారులను ఆయన పాలనలో పట్టించుకోలేదనేది ఆరోపణలు ఉన్నాయి.
కవిత సమక్షంలోనే పార్టీ వైఖరిపై ధ్వజమెత్తుతున్న నేతలు
ఉద్యమంలో లేని నేతలను పార్టీలో పదవులు కట్టబెట్టి తమను అన్ని విధాలుగా నష్టపోయేలా చేశారని ఉద్యమకారులు కేసీఆర్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తన తండ్రి అలా చేస్తే ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశం అంటూ కవిత ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారట. ఏ మొహం పెట్టుకొని జిల్లాలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేశారని ఆమె ముందే పార్టీ నేతలపై ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమ కారులు, పార్టీ కార్యకర్తలతో కవిత సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా తెలంగాణ ఉద్యమ కారులు కవిత ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
ఉద్యమంలో పనిచేసిన నేతలను గుర్తించకపోవడంపై ఆసహనం
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ విలువైన జీవితాలను పణంగా పెట్టుకున్నామని.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలతో పాటు యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించామని.. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో, ఉద్యమంలో పనిచేసిన నేతలను గుర్తించకపోవడంతో పాటు.. కనీసం జిల్లాలలో గౌరవం లేకుండా చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో లేని వ్యక్తులను అందలమెక్కించి పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్‌లో కోలుకోలేని విధంగా కేసులు పెట్టించారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
రేగ కాంతారావుకి ఉద్యమకారులు ఎవరో తెలియదని విమర్శలు
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావుకి ఉద్యమకారులు ఎవరు, పార్టీకి పనిచేసిన వాళ్లు ఎవరో కూడా తెలవదని వారు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు పదవులు అనుభవించిన నేతలు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారంటూ ఉద్యమ కారులు కవిత సమక్షంలోనే ఆక్రోశం వెల్లగక్కారు. ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతున్నా ఎవరు పట్టించుకోలేదని.. పదేళ్లు పదవులను అనుభవించి తర్వాత అధికారం దూరమైన తర్వాత.. మళ్ళీ ఉద్యమకారులు అవసరం పడిందా.. అని ప్రశ్నిస్తున్నారు . అదే సమయంలో వారు కేసీఆర్‌కు జై కొడుతూ ఆయన పదవులు కట్టబెట్టిన వారిని ఏకి పారేయడం గమనార్హం
కవిత టూర్లో కనిపించని మాజీ మంత్రి పువ్వాడ అజయ్
మరో వైపు కవిత జిల్లా పర్యటన బీఆర్ఎస్‌లో వర్గపోరును మరోసారి బహిర్గతం చేసింది. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కవిత పర్యటనలో పాల్గొన లేదు. మొదటగా ఆమె ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చినా ఆమె వెంట అజయ్ కనిపించలేదు. అయితే అజయ్ తల్లి అనారోగ్యంతో ఉన్నారన్న సమాచారంతో కవితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు మాత్రమే కవితాను అజయ్ విష్ చేసారట. అయితే తర్వాత రెండు రోజుల కవిత పర్యటనలో అజయ్ ఎక్కడా పాల్గొనలేదు.
పాల్గొన్న తాతా మధు, సండ్ర వెంకట వీరయ్య, వద్దిరాజు రవిచంద్ర..
మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ , మాజీ మంత్రి హోదాలో జిల్లాలో ఎక్కడైనా పర్యటించవచ్చు. కానీ ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకే అంతుపట్టడం లేదంట. ఆ క్రమంలోజిల్లాలో పలువురు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కవితా టూర్ లో పాల్గొన్నా మరి కొంతమంది కనిపించక పోవడం చర్చల్లో నలుగుతోంది
బీఆర్ఎస్‌లో యాక్టివ్‌రోల్ పోషిస్తున్న కేటీఆర్, కవిత
పువ్వాడ అజయ్ బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుండి కేటీఆరే సర్వం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి కూడా కేటీఆర్ కోటాలోనే వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో అటు కేటీఆర్, ఇటు కవిత యాక్టివ్ రూల్ పోషిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని చేజిక్కించుకోవాలని ఎవరి వ్యూహం వారికి ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకే కవితా ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ తన కంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారంట.
Also Read: పహెల్గామ్ ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దాల్ సరస్సు
కేటీఆర్ మనిషిగా పేరున్న పువ్వాడ అజయ్
ఆ క్రమంలోనే కేటీఆర్ మనిషిగా పేరున్న అజయ్ కవితా పర్యటనలో కనిపించలేదని గుసగుసలు వినిస్తున్నాయి. కేటీఆర్ ఆదేశాలతో అజయ్ సైలెంట్ గా ఉన్నారా..? లేదంటే జిల్లా పార్టీలో వర్గపోరుతో కనిపించలేదా? అనేది అంతుపట్టకుండా తయారైంది. అసలే అధికారం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇంటిపోరుతో కొత్త సమస్య వచ్చిపడిందని ఆపార్టీ నాయకులే చర్చించుకోవడం కనిపిస్తోంది..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టమే అంటున్న క్యాడర్
మొత్తానికి కవితా పర్యటనతో పార్టీలో వర్గపోరు స్పష్టంగా కనిపించిందని, ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్‌కు జిల్లాలో గడ్డుకాలమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఎమైనా పార్టీలో జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దకుంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. మరి పార్టీ ఉన్నంత కాలం కర్ర పెత్తనం చేసిన కేసీఆర్.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎలా చక్కబెడతారో చూడాలి.