BigTV English

Kovvur Janasena Incharge: కొవ్వూరులో జనసేనాని తొందరపడ్డారా?

Kovvur Janasena Incharge: కొవ్వూరులో జనసేనాని తొందరపడ్డారా?

Kovvur Janasena Incharge: నాయకుడంటే కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి.. కార్యకర్తలు చెప్పిందే వేదం కార్యకర్తల కోసమే నా పదవి అంటూ తిరిగే నాయకులు లేకపోలేదు.. కార్యకర్తల కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టి నాయకులను చూసాం .. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే జనసేన నాయకుడు కార్యకర్తల మాట విని తన పదవి పోగొట్టుకున్నాడు.. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అంటూ వారు చెప్పింది చేసి ఇప్పుడు పదవి లేక పార్టీ నుండి సస్పెండ్ అయ్యేదాకా తెచ్చుకున్నాడు.. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా కదా ?


ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరులో సామాజిక సమీకరణలే కీలకం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పొలిటికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉండే నియోజకవర్గం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కొవ్వూరు నియోజకవర్గం మరొక ఎత్తని చెప్పుకోవచ్చు.. కొవ్వూరు నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా టిడిపి చాలా బలంగా ఉంటూవస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం పొలిటికల్గా ఎస్సీ రిజర్వ్‌డ్ క్యాటగిరిలో ఉండటంతో అక్కడ ఆర్థికంగా సామాజికంగా బలమైన వర్గం ఎటువైపు మొగ్గుచూపితే వారే ఎమ్మెల్యేగా గెలుస్తుంటారు.


కొవ్వూరులో సుదీర్ఘకాలంగా బలం చాటుకుంటున్న టీడీపీ

కొవ్వూరు నియోజకవర్గంలో కింగ్‌గా ఎమ్మెల్యే ఉన్నా కింగ్ మేకర్లు వేరే ఉంటారు అనటంలో సందేహమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అటువంటి కొవ్వూరు నియోజకవర్గం సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ తన బలాన్ని చూపిస్తూ వస్తోంది.. కొవ్వూరులో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు 2014 నుండి జనసైనికులు తీవ్రంగా శ్రమిస్తూ వస్తున్నారు.. సామాజిక సమీకరణాలు ఒకవైపు, ఆర్థింగా బలంగా ఉండే వర్గాలు ఒకవైపు ఉండటంతో జనసైనికులు సైతం గ్రూపులుగా విడిపోయారు.. అధికారంలోకి రాకముందే కొవ్వూరు నియోజకవర్గం లో జనసేనలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయంటే అక్కడ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

2019 ఎన్నికల్లో పోటీ చేసి కనిపించకుండా పోయిన జనసేన అభ్యర్థి

2019 ఎన్నికల్లో కొవ్వూరులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ప్రస్తుతం పార్టీకి ఏ రకంగాను సహాయ సహకారాలు అందించకపోగా, ఆ తర్వాత జనసైనికులకు కనీసం కనపడలేదని చెప్తున్నారు.. అటువంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని అవకాశం ఇస్తే జనసేన పార్టీ అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గం లో పోటీ చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌ ముందు ప్రతిపాదన పెట్టారంట. కానీ 2024 రాజకీయ పరిణామాలతో కూటమి ఏర్పడటంతో ఎన్నో నియోజకవర్గాల్లో జరిగినట్లుగానే కొవ్వూరులోనూ టీవీ రామారావు ఆశలు అవిరయ్యాయి.

కొవ్వూరు జనసేనలో కనిపించని ఐక్యత

అయినా మాజీ ఎమ్మెల్యే రామారావు జనసేన పార్టీని అంటిపెట్టుకొని ఉండి కూటమి తరపున పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్ధి గెలుపునకు తనవంతు కృషి చేశారు.. రాజకీయ పార్టీలో విభేదాలు ఉండటం సహజమే కాబట్టి జనసేన పార్టీలో ఉన్న వర్గాలను కలపడానికి ఆయన చాలా కష్టాలు పడాల్సి వచ్చిందంట. అయితే జనసైనికులలో జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్నామని ఒక వర్గం, నియోజకవర్గంలో జనసేన జెండా పట్టుకు తిరిగింది మేమే అంటూ మరొక వర్గం ఆధిపత్యం కోసం పోటీ పడటంతో జనసేన పార్టీ లో జన సైనికుల ఐక్యత కొంత తగ్గిందనే అంటున్నారు..

కలిసి సాగుతున్న రామరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు

2024లో కూటమి విజయం సాధించడంతో కొవ్వూరు నియోజకవర్గం జనసైనికులు తాము పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిందని భావించారు.. ఇక అప్పటినుండి మొదలైంది పొలిటికల్ సినిమా.. కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల సెగలలో పదవుల పంపకాలు మరింత ఆజ్యం పోశాయంట. కొవ్వూరు జనసేన పార్టీ ఇన్చార్జిగా ఉన్న రామారావు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇద్దరు బిజెపి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.. అటువంటి సమయంలో కొవ్వూరు నియోజకవర్గం లో పదవుల కేటాయింపులు జనసేన పార్టీకి సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు జనసేన పార్టీ ఇంచార్జ్ రామారావు..

ఒక్క సొసైటీనే కేటాయించడంపై జనసైనికుల ఆగ్రహం

జనసేనలో మొదట నుండి కష్టపడిన యువతకు పదవులు కేటాయించాలని అటు టిడిపి ఇటు జనసేన పార్టీ జిల్లా నేతలకు రామారావు విజ్ఞప్తి చేశారంట . టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సైతం జనసేన పార్టీ ఇంచార్జ్ రామారావు చెప్పినట్లుగా అవకాశాన్ని బట్టి చేయడానికి సానుకూలంగా ప్రయత్నాలు కొనసాగించారంట. అయితే కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉంటే కేవలం ఒక్కటే మాత్రమే జనసేన పార్టీకి కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావు విజ్ఞప్తి చేసిన టిడిపి నేతలు పట్టించుకోకపోవడంపై జనసైనికుల ఆగ్రహం ఒక్కసారిగా బహిర్గతమైంది

జనసేనకు అన్యాయం జరుగుతోందని రామారావు విమర్శ

జనసేనకు పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ ఇంచార్జ్ రామారావు ఇంటికి చేరుకున్నారు జనసైనికులు.. అధిష్టానం తమ మాట వినాలంటే నిరసన ఒకటే మార్గం అని భావించిన జనసేన సైనికులు నిరసన తెలపాలంటూ నియోజకవర్గం ఇంచార్జ్ రామారావుపై ఒత్తిడి చేయడంతో పాటుగా అప్పటికప్పుడే రహదారిపైకి చేరుకుని బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు.. తప్పనిసరి పరిస్థితిలో జనసైనికులకు మద్దతు తెలపాల్సి వచ్చింది అంటున్నారు జనసేన పార్టీ ఇంచార్జ్ రామారావు.. పదవుల్లో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందని నిరసన కార్యక్రమంలో రామారావు వ్యాఖ్యానించారు…

మీడియా ముందు భోరుమని ఏడ్చిన రామారావు

ఆ వెనువెంటనే మీడియాలో కూటమిలో విభేదాలు అంటూ వార్తలు రావడం అవన్నీ జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ అధిష్టానం కనీసం టీవీ రామారావును సంప్రదించకుండా జనసేన పార్టీ ఇన్చార్జి పదవి నుండి తొలగిస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.. పార్టీ గురించి తీవ్రంగా శ్రమిస్తుంటే కనీస గుర్తింపు లేకపోగా ఇన్చార్జ్ పదవి తీసేయడంతో బాధ దిగమింగుకోలేక మీడియా ముందే గొల్లుమని ఏడ్చారు జనసేన పార్టీ నేత రామారావు.. ఏ నాయకుడైనా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాడు అనే విషయం జనసేన పార్టీ అధిష్టానానికి తెలియదా అంటూ రామారావు ప్రశ్నిస్తున్నారు..

ఇన్చార్జ్ పదవి తొలగింపుపై పునరాలోచించాలని విజ్ఞప్తి

జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యం అంటూనే ఇన్చార్జ్ తొలగింపు పై పునరాలోచించాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.. మరోపక్క జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కన్నీరు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జనసేన పార్టీ అధిష్టానం సైతం పునరా ఆలోచనలో పడినట్లే కనిపిస్తుంది.. జనసేన పార్టీ టీవీ రామారావు పై తీసుకున్న చర్యల పై సోషల్ మీడియాలో గాని మీడియాతో గాని జనసైనికులు ఎవరు మాట్లాడవద్దు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పాటు టీవీ రామారావుకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారట జనసేన పార్టీ నేతలు.. కొవ్వూరు నియోజకవర్గం ఇన్చార్జి రామారావును తొలగించడంపై జనసేనకుల నుండే తీవ్ర వ్యతిరేకత వస్తుంది…

రామారావుతో సత్సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే ప్రకటన

కూటమిలో విభేదాలు లేవని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బహిరంగంగా చెప్పడంతో పాటు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గతంలో టిడిపిలో పనిచేశారని ఆయనతో టిడిపి నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.. ఒక ఇంటిలోనే ఎన్నో మనస్పర్ధలు ఉండగా లేనిది రాజకీయ పార్టీల మధ్య ఉండటం సహజమంటున్నారు.. కూటమినేతల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న 14 సొసైటీల్లో 10 డైరెక్టర్లు, ఒక చైర్మన్ జనసేన పార్టీకి, మరో ఐదు డైరెక్టర్లు బిజెపికి కేటాయించమన్నారు.. జనసేన పార్టీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు రామారావు అడిగిన కాపవరం సొసైటీని సైతం జనసేన పార్టీకి ఇవ్వడం జరిగిందన్నారు.. ఏ పదవులు ఇచ్చినా పదవుల పక్కన పేర్లు, పార్టీ పేరు రాసి హై కమాండ్‌కు పంపిస్తున్నామని, అక్కనుండి వచ్చిన ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నామన్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ పదవుల్లో సైతం జనసేన పార్టీకి రెండు డైరెక్టర్లు, బిజెపికి ఒక డైరెక్టర్ పదవి కేటాయించినట్లు గుర్తు చేస్తున్నారు. రాబోయే ఆలయ కమిటీల్లో సైతం జనసేన పార్టీకి తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందన్నారు

కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకున్నారంటున్న జనసైనికులు

కాపవరం సొసైటీ కి సంబంధించి జనసేన పార్టీలో వర్గాలు ఉండటం, టివి రామారావు ఒక వర్గాన్ని సపోర్ట్ చేసి పేరు పంపించడం, జనసేన అధిష్టానం మరొక వ్యక్తి పేరు సూచించడంతోనే గందరగోళం నెలకొందని సమాచారం.. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేనకుల అభీష్టం మేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తప్ప తన పదవుల కోసం తన పేరు కోసమో టీవీ రామారావు నిరసన చేయలేదని అధిష్టానం గుర్తుంచుకోవాలంటున్నారు జనసైనికులు..

Also Read: వరంగల్ జిల్లాలో పదవుల భర్తీకి నో..

సోషల్ మీడియాలో రామారావు ఆవేదన వైరల్ అవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో జనసేన పార్టీ అధిష్టానం నిజాలను తెలుసుకునే ప్రయత్నం లో భాగంగా జనసేన పార్టీ కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ రావును నిజనిర్ధారణకు నియమించింది. ఆయన కొవ్వూరు చేరుకుని నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.. జనసేన పార్టీ అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కొవ్వూరు జనసేన పార్టీ ఇన్చార్జి పదవి మరల టీవీ రామారావుకు కట్ట పెట్టాలని విజ్ఞప్తి చేశారట జన సైనికులు.. శివశంకర్ రావు నివేదిక అధిష్టానానికి ఇస్తానని అధిష్టానం నిర్ణయం కోసం వేచి ఉండాలని అప్పటివరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు బహిరంగ విమర్శలు చేయొద్దని చెప్పారట… మరి రామారావు విషయంలో జనసేన అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×