తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన.. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో రోజుకో కీలక విషయం చోటు చేసుకుంటుంది. ఓ వైపు విచారణ, అరెస్టుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు లగచర్లలో జాతీయ ST కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ పై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేశారని ఫిర్యాదులు వెళ్లడంతో ST కమిషన్ లగచర్లలో పర్యటిస్తోంది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు అంతకుముందు రోటిబండ తండాలో పర్యటించారు. గిరిజన సంఘాలు, గ్రామస్థులతో సమావేశమై వారి వెర్షన్ వింటున్నారు అధికారులు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే.. ఫిర్యాదు మేరకు పర్యటన చేపట్టారు. ఇకపై ఎలాంటి అరెస్టు చేయొద్దని కమిషన్ సభ్యులు చెప్పగా.. దాడిలో పాల్గొన్నవారినే అరెస్టు చేస్తున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
ఈ కేసులో పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డిపై వేటు పడింది. ఆయనను డీజీపీ ఆఫీసుకి అటాచ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఈ వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్టు ఆధారాలు దొరికాయి. లగచర్లకు చెందిన ఆయన… సంగయ్యపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. గ్రామస్తులను, రైతులను రెచ్చగొట్టాడని.. అధికారులపై దాడికి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించినట్టు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రాఘవేందర్‌పై మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే లగచర్ల ఘటనలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ దాడి ఘటనలో.. గ్రామస్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు రాసిన లేఖ బయటపడింది. ఆ లేఖలో చర్చల కోసం అధికారులు వచ్చిన తరుణంలో.. అప్పటివరకు తమతో లేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ.. వారిని కొట్టండి అంటూ అరుస్తూ అధికారుల వైపు పరుగెత్తారని రాసుకొచ్చారు. కొందరు కావాలనే చేస్తున్నట్టుగా అనిపించిందని.. ఆ దాడికి గత పదినెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్లుగా.. సొంత లాభం కోసం చేసినట్లుగా అనిపించిందన్నారు.
Also Read: కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక.. లోగుట్టు బయటకు
డిసెంబర్ 2023 నుంచి అందరం కలిసి శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు గ్రామస్థులు. ఏ రోజు అధికారులపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. అధికారులు కూడా తమని ఎక్కడా బెదిరించలేదన్నారు. కలెక్టర్ కూడా ఒకసారి అందరితో మాట్లాడారు.. అందరి అభిప్రాయాలను సావధానంగా విని మళ్లీ మాట్లాడదామని చెప్పారని తెలిపారు. మళ్లీ లగచర్లలో సమావేశం పెట్టడానికి అధికారులు వస్తున్నట్టు తెలియగా.. తామంతా సమావేశం దగ్గరకు వెళ్లవద్దని నిర్ణయించుకొని ఊర్లోనే కూర్చున్నామని రాసుకొచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ సమావేశం వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు లగచర్ల దాడి కుట్రలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కీలక నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఘటన తరవాత సురేష్ పరారీ కాగా.. సహకరించిన వారిపై పోలీసులు ఫోకస్ చేశారు. వారం నుంచి సురేష్ జాడ కనిపించడం లేదని తెలుస్తోంది. పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశ్యంతో సురేష్ ఎప్పటికప్పుడు తన ప్లేస్‌లను మారుస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే 5 ప్రాంతాల నుంచి మకాం మార్చినట్టు భావిస్తున్నారు. సురేష్ దేశం దాటి పోయాడని కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతో ఇప్పటికే సురేష్ కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దేశం విడిచి వెళ్లిపోతే ఎక్కడికి వెళ్లి ఉండొచ్చని ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేయించింది కేటీఆరే అని మంత్రి వ్యాఖ్యానించారు. దాడి చేయించిన వ్యక్తి ఢిల్లీలో ఏం చేస్తున్నాడని మంత్రి ప్రశ్నించారు. అమిత్‌షా రాత్రికి టైం ఇస్తే.. అరెస్టుకు అనుమతి ఇవ్వొద్దని కాళ్లు పట్టుకుంటాడని కోమటిరెడ్డి విమర్శించారు. నిందితుడు సురేష్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు. చట్టప్రకారం ప్రతి ఒకరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక లగచర్లకు బయల్దేరిన బీజేపీ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మొయినాబాద్ వద్ద ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, MLA మహేశ్వర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులకు బీజేపీ కేడర్‌కు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మొత్తానికి పొలిటికల్ గా కాక రేపుతోన్న ఈ విషయంలో రానున్న రోజుల్లో ఏవేరేవరి పేర్లు బయటికి వస్తాయో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.