‘ఓట్‌చోరీ’ వివాదం .. ఎవరు ఎటువైపో తేల్చేస్తున్నది. రహస్య స్నేహితుల అనుబంధాల గుట్టురట్టు చేస్తున్నది. దీన్ని కాంగ్రెస్ చేస్తున్న పోరాటంగానే చూడటం లేదు జనం. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ విధానంతో ఓట్లను గల్లంతు చేస్తున్నదనే అంశమే ప్రధానంగా హైలెట్ అవుతోంది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సర్ విధానంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇతర కమిషనర్లు వ్యతిరేకించిన విషయం బయటకు పొడసూపిన నేపథ్యం తరువాత కేంద్రం పరిస్థితి తేలు కుట్టిన దొంగలా అయ్యింది. దీనిపై జెన్‌జీ కూడా ఉద్యమబాట పట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ మరో జంతర్ మంతర్ ఉద్యమంగా దీన్ని ఎంచుకున్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీ ఎటు వైపు? అనే ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. ఎస్‌ఐఆర్‌పై ఆదిలో బీఆరెస్ కొంత దూకుడుగా ప్రవర్తించింది. ఆ పార్టీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ఆ తరువాత చేతులెత్తేసింది. ఇప్పుడైతే దీనిపై కనీసం మాట్లాడటం లేదు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవహారం ముదురుతూ వస్తున్న తరుణంలో బీఆరెస్ అసలు రూపం బయటపడుతూ వస్తోంది.
కేటీఆర్ దీనిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. ఢిల్లీలో ఓ వైపు జెన్ జీ, మరోవైపు ఇండీ కూటమి ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వాన్ని హడలెత్తిస్తుండగా.. ఇది తమకు పట్టని అంశంగానే చూస్తోంది బీఆర్‌ఎస్. మొన్నటి దాకా జెన్‌జీ ఉద్యమాలను కీర్తించిన కేటీఆర్.. ఈ సర్ విషయంలో, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ అంశంలో కాక్రోచుల దండు విరుచుకు పడుతున్నా కనీసం మద్దతు తెలపలేదు ఇంత వరకు.
బీఆర్ఎస్, బీజేపీ రహస్య దోస్తానా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఎందుకైనా మంచిది.. ఎన్‌డీయేతో ఎందుకు వ్యవహారం చెడగొట్టుకోవాలి? అనే పొలిటికల్ ఈక్వేషనా? లేక లోపాయికారి మద్దతు, పొత్తుల అంశంపై తాడోపేడో తేల్చుకునే ముందు ఈ లొల్లెందుకు? అనే మౌనమా? అనే చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు కేటీఆర్… మళ్లీ థర్డ్ ఫ్రంట్ పేరెత్తాడు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్నారని కామెంట్ చేస్తున్నాడు. మరి జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్న నేత.. జాతీయ స్థాయిలో వివాదమైన సర్‌పై ఎందుకు మాట్లాడటం లేదు? జ్ఞానేశ్ రాజీనామా అంశంలో కేసీఆర్ వైఖరేమిటీ? వీటిపై జవాబులు లేవు. సమస్యలున్నప్పుడు, జనం బాధల్లో ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు బయటకు రాకుండా తనకు అవసరమైనప్పుడు మాత్రమే.. తన రాజకీయ అవసరం కోసమే కేసీఆర్ వస్తారా? అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు ఆ నేతపై .
తెలంగాణ రాజకీయాలపై స్పందించరు. ఇక్కడి జనం గురించి మాట్లాడరు. కానీ నేషనల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తారట. సరే,అదే జరుగుతుందనుకుందాం… కాసేపటి. మరి కేంద్రంలో ఓట్ చోరీ పై ఇంత గగ్గోలు జరుగుతుంటే.. అది కేవలం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాద్దాంతమేనని బీఆరెస్ భావిస్తోందా…? మోడీకి భయపడి.. భవిష్యత్‌లో ‘పొత్తు’ పొడిచే అవకాశాలు చెడగొట్టుకోవద్దనే రాజకీయమా? అనే ప్రశ్నలకు జనాలకు క్లారిటీ ఆన్సర్ తెలిసిపోతున్నది.
నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. బీఆరెస్, బీజేపీ రహస్య దోస్తానా విషయాన్ని ఇలా కాలమే బయటకు లాగుతోందా..? ఎస్‌ఐఆర్ వివాదం ఈ రహస్య దోస్తానా బండారాన్ని బట్టబయలు చేస్తున్నదా? అనే చర్చ జరుగుతోంది. ఇది చాలదంటూ.. మొన్న ఢిల్లీలో ఇండీ కూటమి చేసిన ఆందోళనపై బీఆరెస్ తన నేతలతో పని గట్టుకుని విమర్శలు గుప్పించింది.
రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్‌ను దగ్గర కూర్చోబెట్టుకుని ధర్నా చేస్తున్నారని, ఇక్కడ ఓటుకు నోటు కేసు అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఆందోళన ఏంటీ? మీరు చేస్తున్న ఆరోపణలేంటీ? ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టుగా… తాము మౌనంగా ఉన్నామని తెలియకుండా.. ఎదురుదాడికి ఇలా దిగుతోందన్న మాట బీఆరెస్ పార్టీ.
బహుశా ఇది ఫామ్‌హౌజ్ నుంచి వచ్చిన వ్యూహాత్మక ఎత్తుగడై ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.