E-Paper
Advertisement

వరి కోతల తర్వాత పొలానికి నిప్పు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

వరి కోతల తర్వాత పొలానికి నిప్పు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
Advertisement

Stubble Burning: ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో మాత్రమే కనిపించే వరి కొయ్యల దహనం.. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కామన్‌గా మారుతోంది. ప్రతీ సీజన్‌కు దీని తీవ్రత పెరుగుతూ.. ఇప్పుడు పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. వరి కోతలు పూర్తైన తర్వాత పొలాల్లో మిగిలిపోయే గడ్డిని, కొయ్యను రైతులు తగులబెట్టడం ఇప్పుడు కామన్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది.

వరి కోతలో మార్పులు..

సమస్య మూలాల్లోంచి చూద్దం.. ఒకప్పుడు వరి పంటను రైతు కూలీలు కోసేది. కానీ ఇప్పుడు అలా కాదు. కూలీల కొరత కారణంగా 90శాతానికి పైగా వరి కోతలను కంబైన్డ్ హార్వెస్టర్లతోనే కోయిస్తున్నారు. ఈ మెషిన్లు వరి వెన్నులను మాత్రమే కట్ చేసి, కింద దాదాపు 30 సెంటీమీటర్ల ఎత్తులో కొయ్యలను, వృథా గడ్డిని పొలంలోనే వదిలేస్తాయి. ఇక్కడ మొదలవుతుంది అసలు సమస్య.

పంటల మధ్య తక్కువ గ్యాప్‌

Advertisement

ఇది ఒక సమస్య అయితే.. నెక్ట్స్‌ పంటకు సరైన సమయం ఇవ్వడం లేదు ఇప్పుడు అన్నదాతలు. ఇది రెండో సమస్యగా మారింది. ఒక పంట కోసిన వెంటనే తదుపరి పంటకు అంటే ఉదాహరణకు రబీ తర్వాత ఖరీఫ్ లేదా పప్పుధాన్యాల సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి రైతులకు కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ఆ కొయ్యలను తొలగించడం ఒక పెద్ద టాస్క్. ఇది శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. వీటన్నింటిని తప్పించుకోవాలంటే.. సులువైన పని వ్యర్థాలకు నిప్పు పెట్టడం.

రైతు ముందున్న మరో సవాలు

అంతేకాదు ఈ సమస్యకు మరో కారణం కూలీల కొరత.. పెరుగుతున్న ఖర్చులు. మాములుగా హార్వేస్టర్‌ వరి పంటను కోసిన తర్వాత గడ్డిని కుప్పలుగా వేయాలంటే మరో మెసిన్ కావాలి. గడ్డిని కట్టలుగా కట్టే బేలర్ మిషన్ల వాడకానికి ఎకరాకు వెయ్యి నుంచి 12 వందల వరకు అదనపు ఖర్చు అవుతోంది. చిన్న, సన్నకారు రైతులు ఈ ఖర్చు భరించడం ఎందుకు అనుకుంటున్నారు. ఇది కూడా వ్యర్థాలకు నిప్పు పెట్టడానికి మరో కారణం.

గడ్డి దహనం వెనుక రైతు కనిపెట్టని ప్రమాదం

Advertisement

ఇవన్నీ విన్నప్పుడు పంట వ్యర్థాలను కాల్చడంలో తప్పేముంది.. రైతుకు సమయం, డబ్బు ఆదా అవుతుంది కదా.. అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే నాణానికి మరో వైపు చూడాలి మనం. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల తాత్కాలికంగా పొలం శుభ్రమైనట్లు అనిపించినా, దీర్ఘకాలంలో కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. ఈ చర్యల వల్ల రైతుకు, పర్యావరణానికి నష్టాలే మిగులుతున్నాయి. ముందు రైతుకు జరిగే నష్టాలను చూద్దాం. పంటను తగులబెట్టినప్పుడు మంటల వేడికి భూమి పైపొర పూర్తిగా కాలిపోతుంది. ఇది రైతుకు జరిగే అతి పెద్ద నష్టం.

సాగు ఖర్చు ఎందుకు పెరుగుతోంది?

ఒక టన్ను వరి గడ్డిని కాల్చడం వల్ల నేలలోని 5.5 కిలోల నైట్రోజన్, 2.3 కిలోల ఫాస్ఫరస్, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల సల్ఫర్ వంటి విలువైన పోషకాలు గాల్లో కలిసిపోతాయి. భూమి కోల్పోయిన ఈ పోషకాలను తిరిగి భర్తీ చేయడానికి రైతు తదుపరి పంటకు మార్కెట్ నుండి ఎక్కువ మొత్తంలో యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులను కొనాల్సి వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతేకాదు మంటల వల్ల భూమిలోని తేమ ఆవిరైపోతుంది. నేల గట్టిపడిపోవడం వల్ల తదుపరి పంటకు ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా ఓ రకంగా రైతుకు భారమే.

వ్యవసాయానికి పెను ముప్పు

నిజానికి నేల సారవంతంగా ఉండటానికి సూక్ష్మజీవులు, వానపాములు ఎంతో అవసరం. పొలానికి నిప్పు పెట్టినప్పుడు భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత దాదాపు 50 నుంచి 60 డిగ్రీల వరకు పెరుగుతుంది. ఈ వేడికి పంటకు మేలు చేసే వానపాములు, మేలు చేసే బ్యాక్టీరియా, శీలింధ్రాలు పూర్తిగా చనిపోతాయి. ఫలితంగా భూమి జీవక్రియను కోల్పోయి నిస్సారంగా మారుతుంది.

పొలాల్లో మంటలు.. ఊహించని విషాదాలు

ఇది మాత్రమే కాదు.. పొలాల్లో పెట్టే మంటలు ఒక్కోసారి అదుపు తప్పి ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. లెటెస్ట్‌గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరికొయ్యలకు పెట్టిన మంటల్లో పడి చాగర్ల చంద్రమౌళి అనే రైతు సజీవ దహనమయ్యాడు. ఆయనను కాపాడాలని ప్రయత్నించి ఆయన భార్య భాగ్య కూడా మృతి చెందారు. వరికొయ్యల మంటలు భార్యాభర్తలను బలితీసుకుంది. ఇది మాత్రమే కాదు. మంటలు పెట్టినప్పుడు గాలి వాటం మారి, దట్టమైన పొగ కమ్మేయడం వల్ల రైతులకు ఏం కనిపిస్తుందో తెలియక, ఊపిరాడక అదే మంటల్లో చిక్కుకుని చనిపోయిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉన్నాయి.

చట్టవిరుద్ధ చర్య వెనుక ప్రమాదాలు

అంతేకాదు మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు, పశువుల పాకలకు, లేదా పక్క రైతు చేతికొచ్చిన పంట కు అంటుకుని భారీ నష్టాన్ని చేకూరుస్తాయి. రీసెంట్‌గా నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇలానే జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పొలాల్లో గడ్డిని తగలబెడుతుండగా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.. పొలాల్లో మంటలు విస్తరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసిన కార్లు, బైకులకు అంటుకున్నాయి. దీంతో సగానికిపైగా వాహనాలు కాలిపోయాయి. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే అయినా.. ఇది చట్ట పరంగా నేరమే.

దట్టమైన పొగతో ఆరోగ్యానికి ముప్పు

అంతేకాదు పొలం నుంచి వచ్చే దట్టమైన పొగలో కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5 వంటి ప్రమాదకర కణాలు ఉంటాయి. ఆ పొగను మొదట పీల్చేది పొలంలో ఉండే రైతు, పక్కనే ఉండే వారి కుటుంబ సభ్యులే. దీనివల్ల కళ్ల మంటలు, దగ్గు, ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు వస్తాయి. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.

పెరుగుతున్న గాలి కాలుష్యం

ఇవి రైతుకు కలిగే నష్టాలు.. ఇక పర్యావరణంగా కలిగే నష్టాలను చూసుకుంటే నష్టాలు అనేకం. పంట వ్యర్థాలు కాలినప్పుడు పర్యావరణానికి అత్యంత హానికరమైన వాయువులు, రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. మంటల వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ , నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి వాయువులు భారీగా విడుదలవుతాయి. అంతేకాదు గాలిలో కలిసే సూక్ష్మ ధూళి కణాలు గాలి నాణ్యతను ఘోరంగా పడిపోయేలా చేస్తాయి.

వాతావరణాన్ని మార్చేస్తున్న పొలాల మంటలు

ఇవి ఊపిరితిత్తుల్లోకి నేరుగా ప్రవేశించి మనుషులతో పాటు పశుపక్షాదులను సైతం రోగాల బారిన పడేస్తాయి. వేల ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పర్సంటేజ్ పెరుగుతుంది. ఇవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని వాతావరణంలోనే బంధించి ఉంచుతాయి. ఫలితంగా భూతాపం పెరిగి, రుతుపవనాల్లో మార్పులు రావడం, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు వంటి వాతావరణ సమస్యలు పెరుగుతోంది. నిజానికి పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నష్టాలే తప్ప రూపాయి లాభం లేదు. కానీ కొద్దిగా ప్రణాళిక, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తే.. ఆ వ్యర్థాలనే రైతులకు అదనపు ఆదాయాన్ని ఇస్తాయంటున్నారు నిపుణులు.

ఢిల్లీని కమ్మేస్తున్న పంట గడ్డి పొగ

పంట దహనాలు అనగానే గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు హర్యానా, పంజాబ్. ఈ రెండు రాష్ట్రాల్లో రైతుల పుణ్యమా అని ఢిల్లీలోని ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వాల నిఘా కారణంగా పంజాబ్, హర్యానాలో పంట దహన సంఘటనల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ రాష్ట్రాల్లో వరి కోతలకు, తదుపరి పంట అయిన గోధుమ విత్తనాలను నాటడానికి మధ్య కేవలం 10 నుండి 15 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. దీంతో అక్కడి రైతులు పంటలను దహనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇది ఆ రెండు రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీకి ఓ శాపంగా మారింది.

ఢిల్లీ AQI 500 దాటడానికి కారణాలేమిటి?

అక్టోబర్-నవంబర్ నెలల్లో గాలులు ఢిల్లీ వైపు వీస్తాయి. పంజాబ్, హర్యానా పొలాల నుండి వచ్చే దట్టమైన పొగను ఈ గాలులు నేరుగా ఢిల్లీ మీదికి మోసుకొస్తాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో గాలి చల్లబడి, బరువుగా మారుతుంది. దీనివల్ల పొలాల నుండి వచ్చిన పొగ, ధూళి కణాలు పైకి పోలేక భూమికి దగ్గరగానే ఉండిపోతాయి. ఈ పంట పొగ.. ఢిల్లీలోని స్థానిక వాహనాల కాలుష్యం, ఫ్యాక్టరీల ధూళితో కలిసి దట్టమైన పొగమంచుగా మారుతుంది. దీనివల్ల ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తరచూ 400 నుండి 500 దాటిపోతుంది.

పంట దహనాలపై సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు

ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడిన సమ అంటూ పంట దహనాలను పూర్తిగా అరికట్టే బాధ్యత పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.అంతేకాదు పొలాల్లో మంటలు అదుపు చేయడంలో విఫలమైనందుకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, తహశీల్దార్లు, పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, పంట వ్యర్థాలను కాల్చని రైతులకు క్వింటాల్ వరికి అదనపు బోనస్ ఇవ్వడం లేదా యంత్రాల అద్దెను ప్రభుత్వమే భరించడం వంటి ఇంటెన్సివీలను కూడా అందించాలని సూచించింది.

ప్రభుత్వాల ముందున్న సవాలు

పొలంలోనే పంట వ్యర్థాలను కుళ్ళింపజేసే యంత్రాలపై సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ, చిన్న సన్నకారు రైతులకు అవి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. హర్యానా, పంజాబ్‌లో సమస్య పూర్తిగా తీవ్రతరమై.. ఏకంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం.. ఏకంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నా.. పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లోకి రావడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఈ సమస్య తీవ్రతరమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు సమస్య చేతులు దాటిపోకుండా చూసుకోవాలి. అదే సమయంలో రైతన్నలు కూడా ఈ సమస్యపై అవగాహన పెంచుకోవాలి.

వ్యవసాయ ఖర్చులు తగ్గించే కొత్త సాధనం

ఇందాక చెప్పుకున్నట్టు పంట వ్యర్థాలను కాల్చడం కంటే.. ఆ వ్యర్థాలను పొలంలోనే కుళ్ళింపజేయడం వల్ల ఎరువుల ఖర్చు భారీగా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. వరి కోసిన వెంటనే పొలంలో ఉన్న తేమను వాడుకుని, రోటవేటర్ లేదా మల్చర్ యంత్రాలతో కొయ్యలను చిన్న ముక్కలుగా కట్ చేసి భూమిలోనే కలియదున్నాలని సూచిస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్ క్యాప్సూల్స్ లేదా ద్రవాలను నీటిలో కలిపి పొలంలో చల్లితే, కేవలం 15 నుండి 20 రోజుల్లో వరి గడ్డి పూర్తిగా కుళ్ళిపోయి మేలైన సేంద్రీయ కర్బనంగా మారుతుందని చెబుతున్నారు. ఇలా చేస్తే తదుపరి పంటకు రసాయన ఎరువుల అంటే యూరియా, డీఏపీ వాడకం 25 శాతం వరకు తగ్గుతుంది. ఎకరాకు 2 వేల నుంచి 3 వేల వరకు పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుంది.

విలువైన వనరుగా మారుతున్న కొత్త దశ

అంతేకాదు ప్రస్తుతం గడ్డికి కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. చాలా చోట్ల వరి గడ్డిని కాల్చి విద్యుత్ తయారు చేస్తున్నారు. ఇటుకల బట్టీలు & సిమెంట్ పరిశ్రమలు బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా వరి గడ్డి కట్టలను వాడుతున్నారు.పేపర్, కార్డ్‌బోర్డ్ తయారీలో వరి గడ్డిని ముడిసరుకుగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు వరి గడ్డి అనేది పుట్టగొడుగుల సాగుకు ఉపయోగపడుతోంది.. వరి గడ్డిని సేకరించి, శుద్ధి చేసి బెడ్స్‌గా మార్చి మిల్కీ ముష్రూమ్స్ లేదా ఓయ్‌స్టర్ ముష్రూమ్స్ పెంచుతారు. అంతేకాదు వరి గడ్డిని పశువుల పేడతో కలిపి వానపాముల ఎరువుగా మార్చవచ్చు.

రైతుకు అదనపు ఆదాయ మార్గం

ఈ ఎరువును పండ్ల తోటలకు వాడుకోవచ్చు లేదా మార్కెట్లో కిలో 6 నుండి 10 చొప్పున అమ్ముకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే బయోగ్యాస్ ప్లాంట్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కాకినాడ, కరీంనగర్ వంటి వరి పండే జిల్లాల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీలు రైతుల నుండి నేరుగా వరి గడ్డిని సేకరించి గ్యాస్ తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్లాంట్ల సంఖ్య మరింత పెరగనుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొదలయ్యే స్టేజ్‌లో ఉన్నాయి కాబట్టి.. రైతులకు పూర్తి అవగాహన లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైతే పరిస్థితులు చేజారలేదు. కానీ చేజారే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, రైతులు మేల్కోని ఈ సమస్యపై పూర్తిగా ఫోకస్ చేయకపోతే.. రానున్న రోజుల్లో మరిన్ని తిప్పలు తప్పవనే ప్రమాద సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.

Also Read: లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×