MLAs Defection Case: దేశంలో మరోసారి ప్రజాప్రతినిధుల అనర్హత వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం తాజా తీర్పుతో హాట్ డిబేట్ నడుస్తోంది. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నది. అదే సమయంలో అనర్హత వేటు సుప్రీం కోర్టే వేయాలన్న పిటిషన్ ను తోసిపుచ్చింది. అది స్పీకర్ నిర్ణయమే అన్నది. దీంతో స్పీకర్ ఏం చేయబోతున్నారు? 3 నెలల్లో నిర్ణయం వెలువడుతుందా? ఏం జరగబోతోంది?
ఎమ్మెల్యేల అనర్హత కేసు క్లైమాక్స్ కు వచ్చిందా? వచ్చినట్లే వచ్చి ప్రొలాంగ్ అవుతుందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ ఇలా ఏదైనా రాజ్యాంగం ప్రకారమే ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్థికి విఘాతం కలిగించకుండా చూసుకోవడం అన్ని వ్యవస్థల బాధ్యత కూడా. అక్కడే అసలు సబ్జెక్ట్ ఉంటుంది. చట్టాలు పార్లమెంట్ లో తయారవుతాయ్. పార్టీలు మారిన వారిపై చర్యల కోసం ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. దీనికి చాలా సార్లు సవరణలు జరిగాయ్. అయినా సరే నిర్ణయాలు స్పీడ్ గా జరగలేకపోతున్నాయి.
3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం
ప్రెజెంట్ తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం, తాజాగా సుప్రీం కోర్టు తీర్పు విషయానికొద్దాం. మొత్తానికి ఈ అనర్హత వ్యవహారంలో సుప్రీం నుంచి కీలక తీర్పైతే వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టే అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తీర్పు వెల్లడించే టైంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్న ఫార్ములా వర్తించకూడదన్నది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని ఆలస్యం జరిగే కొద్దీ పార్టీ మారిన వారు బెనిఫిట్ పొందుతారని ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అని సుప్రీం ధర్మాసనం చెప్పడం కీలక మలుపు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంటే ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీం ధర్మాసనం.
టైం తీసుకోవడంపై హైకోర్టు గతంలో క్లారిఫై
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ B ఫాంపై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్‌ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రెటరీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. నాడు పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చన్నది. దీంతో ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పదో షెడ్యూల్ ప్రకారం నిర్ణయం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపూడీ గాంధీ, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. పార్టీ మారే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. కోర్టులో పిటిషన్ వేసింది. అటు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే స్పీకర్‌కు టైమ్ బాండ్ విధించే పరిస్థితి లేదన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలన్నది. అంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న మాట. అంటే ఈ సమయం ఎంత అన్నదానికి ఒక కచ్చితమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. రీజనబుల్ టైమ్ ఫ్రేమ్ లో నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఉంటుంది. అదే విషయంపై సుప్రీం కోర్టు తాజాగా క్లారిటీ ఇవ్వడం, 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనడంతో మ్యాటర్ పూర్తిగా హీటెక్కింది.
అసలు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఏం వివరిస్తోంది.. ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి.. స్పీకర్లు అనర్హత వేటు వేశారా..? పార్టీ మారిన వారిని విచారించడానికి ఎంత టైం సరిపోతుంది? తాజాగా సుప్రీం తీర్పుతో స్పీకర్ ఏం చేయబోతున్నారు? స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఏంటి?
విచారణ చేయడానికి స్పీకర్‌కు టైం
అసలు సమస్య ఏంటంటే.. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలి, ఎంత టైం లోపల యాక్షన్ ఉండాలి అన్న విషయంపై క్లారిటీ లేకపోవడమే ఇవన్ని సమస్యలకు కారణం. అయితే స్పీకర్ పరిస్థితులు స్పీకర్ కు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా పార్టీ మారితే ఎందుకు మారారు.. ఏ పరిస్థితుల్లో మారారు.. బీ ఫాంపై గెలిచిన పార్టీలో ఏం జరిగింది.. ఇబ్బంది పడ్డారా.. స్వతంత్ర ఆలోచనలతోనే పార్టీ మారారా.. ఇలాంటివన్నీ స్పీకర్ సదరు సభ్యులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. వారిని విచారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సహజంగానే టైం పడుతుంది. అందుకే రాజ్యాంగంలోనూ యాంటీ డిఫెక్షన్ లా లోనూ స్పీకర్ పై ఒత్తిడి చేసేలా గైడ్ లైన్స్ ఏవీ లేవు. స్వతంత్ర ప్రతిపత్తితో, విచక్షణాధికారంతో, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరిగింది.
అనర్హత వేటుపై కోర్టులకు లేని నిర్ణయాధికారం
నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్న విషయంపై ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎలాంటి టైం బౌండ్ లేదు. అది కొన్ని వారాలైనా పట్టొచ్చు, కొన్ని నెలలు, ఏళ్లకేళ్లు పట్టొచ్చు. ఫిరాయింపుల సబ్జెక్ట్ కు డెప్త్ ఎక్కువగా ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా లో లూప్ హోల్స్ ను ఎవరికి వారే తమకు అన్వయించుకుంటున్న పరిస్థితి. అటు కోర్టులు కూడా భిన్న సందర్భాల్లో భిన్నమైన తీర్పులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శాసన వ్యవస్థలో, స్పీకర్ నిర్ణయాధికారాల్లో పూర్తిగా, నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉండడంతో కథ మారుతోంది. స్పీకర్ పరిధిలో ఉన్న నిర్ణయాన్ని కోర్టే తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసి ప్రయత్నించి విఫలమైందన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు.
అనర్హత వేటుపై టెన్త్ షెడ్యూల్‌లో వివరణ
రాజ్యాంగంలోని టెన్త్ షెడ్యూల్ ఈ అనర్హత వేటు గురించే వివరిస్తుంది. రాజకీయ అస్థిరతను తగ్గించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ తమ పార్టీలకు విధేయంగా ఉండేలా చేయడం ఈ షెడ్యూల్ ప్రధాన ఉద్దేశ్యం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే, లేదా ఎంపీ తాను ఎన్నికైన రాజకీయ పార్టీ నుంచి బయటకు రావడం, విప్ ధిక్కరించడం, ఓటింగ్ కు గైర్హాజరవడం ఇలా చేస్తే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో స్పీకర్ దగ్గర ఆలస్యమైతే గతంలోనూ కోర్టులకు వెళ్లిన సందర్భాలున్నాయి. మొన్నామధ్య తెలంగాణ హైకోర్టు అనర్హత వేటుపై చెప్పిందేంటో చూద్దాం. స్పీకర్ కార్యాలయానికి ఉన్న రాజ్యాంగ బద్ధత, విస్తృత శాసన అధికారాలను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ కార్యాలయానికి సూచన చేస్తున్నామని మాత్రమే చెప్పింది. అయితే ఇప్పుడు సుప్రీం సీజేఐ ధర్మాసనం మాత్రం 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనడం ఈ కేసులో మరో టర్నింగ్ పాయింట్. నిజానికి ఇది శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య నిర్ణయం. వేటికవే స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యాంగ బద్ధ వ్యవస్థలే ఇవి. వేటి పరిధిలోని నిర్ణయాలు వాటివే. అందుకే అనర్హతపై కోర్టులు స్వయంగా, సొంతంగా నిర్ణయం తీసుకోవు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అనర్హత వేటు అన్నది స్పీకర్ పరిధిలోని అంశం. అది ఎప్పుడు డిసైడ్ చేయాలన్న దానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలో టైం బౌండ్ అంటూ ఏదీ లేదు. విచారణ చేసి స్పీకర్ విచక్షణ అధికారం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ విచక్షణాధికారమే ఫైనల్.
స్పీకర్ నిర్ణయంపై రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం
నిజానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై రాజ్యసభ అయితే ఛైర్మన్ కు, లోక్ సభ అయితే స్పీకర్ కు, అసెంబ్లీల్లో అసెంబ్లీ స్పీకర్ కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. నేరుగా అనర్హత వేటు వేసే అధికారం కోర్టులకు లేదు. అయితే స్పీకర్ కు నిర్ణయాధికారం ఉన్నా.. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కిహోటో హోలాహాన్ వర్సెస్ జచిల్హు కేసులో, అలాగే రవి ఎస్ నాయక్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు గతంలో కామెంట్ చేసిన సందర్భం ఉంది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం.. కుల్ దీప్ నయ్యర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులోనూ రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా పదో షెడ్యూల్ లోని అనర్హత చట్టం వర్తించదని సుప్రీం గతంలో చెప్పిన సందర్భం ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు. సో రెండువైపులా తీర్పులు ఉన్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు సవరణలు చేస్తున్నా… మ్యాటర్ ఎటూ తేలడం లేదు. అయితే తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం ఇచ్చిన తీర్పు గత తీర్పులన్నిటిపై ఓ మైల్ స్టోన్ గా చెప్పొచ్చంటున్నారు న్యాయ నిపుణులు.
Also Read: పొన్నూరులో కూటమి వార్.. ఇద్దరు నేతలు తగ్గేదేలే!
బీఆర్ఎస్ తొలి టర్మ్‌లో 19 మంది ఎమ్మెల్యేల ఆకర్శ
2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రతిపక్షాల నుంచి దఫదఫాలుగా ఎమ్మెల్యేలను చేర్చుకుంది. 2014లో 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. బీఆర్ఎస్ తొలి టర్మ్ లో 3 పార్టీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. 2018 ఎన్నికల్లో గెలిచాక 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని దశలవారీగా చేర్చుకుంది BRS. 2019 జూన్ లో బీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేసేసుకున్నారు. సో ఇదే విషయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాద ప్రతివాదాలైతే నడుస్తున్నాయి. బైపోల్స్ వస్తాయని బీఆర్ఎస్, వస్తే గెలిచేది తామే అని కాంగ్రెస్ అంటోంది. సో ఈ మొత్తం మ్యాటర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారింది. సుప్రీం తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. బైపోల్స్ వస్తాయా.. వస్తే ఎవరి సత్తా ఏంటో తేలుతుందా.. ఇలాంటి చర్చలు పొలిటికల్‌గా హీటెక్కిస్తున్నాయి.
Story By Vidya Sagar, Bigtv