Telangana MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. పోలింగుకు మరో పది రోజులు గడువు మాత్రమే ఉండటంతో.. నేతలంతా హడావుడి మొదలుపెట్టి, ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై.. బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఈ ఎన్నికలు ముగ్గురు బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక కావడంతో ఇది ఆ ముగ్గురికీ కీలకంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని లెక్కలు వేసుకుంటున్న కాషాయపార్టీ తమ అభ్యర్ధుల విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నిక
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ఈ నెల 27న జరగనుంది.. ముఖ్యంగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికను.. అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బిజెపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3 లక్షల 50 వేలకు పైగా ఉన్న పట్టభద్రుల ఓట్లు ఆకర్షించడానికి రెండు పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం మీద ఈ ఎన్నికల ప్రభావం కనినిప్తుంది.
7 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ
గత అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సత్తా చాటుకుంది. గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఈ జిల్లాల్లోనే దక్కించుకుంది. అలాగే 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరున్న ముగ్గురు నేతలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు.. అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్‌పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రతి అంశంపై స్పందిస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ఎంపీలు
ఆ క్రమంలో ఈ ఎన్నికలు ఆ ముగ్గురికి ఎంతో కీలకంగా మారాయి. ఆ ముగ్గురు ఎంపీలు.. ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ బిజెపి నుంచీ అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నట వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎంపీలు ఈ ఎన్నికలకు సరిగ్గా టైం కేటాయించలేకపోయారు. ఇప్పుడు వారు ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు. రాష్ట్రంలో తామే బిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న భావనతో.. ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికలు.. ఎంపిల పని తీరును కూడా ప్రతిబింబిచనున్నాయి.
ఉమ్మడి జిల్లాలోనే లక్ష 70 వేల మంది ఓటర్లు
Also Read: రాజాసింగ్ డెడ్ లైన్.. కమలంలో కొత్త రచ్చ
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి.. ఆ ఒక్క ఉమ్మడి జిల్లాలోనే సుమారు లక్ష 70 వేల మంది ఓటర్లు ఉన్నారు.. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే.. ఆ.. పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్.. ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి .. ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరు పోలింగు బూత్ వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే వి ధంగా.. ధర్మపురి అరవింద్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా.. పట్ట భద్రుల ఓట్లు గణనీయంగా ఉండటంతో ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.
ప్రతి ఓటర్ని కలిసేలా బీజేపీ ప్రణాళికలు
బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి.. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపి రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు.. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో.. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా తయారయ్యాయి. ఇప్పటికే గ్రౌండు లెవల్లో బిజేపి శ్రేణులు ప్రతి ఓటర్ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో నియోజకవర్గం ఇన్చార్జ్‌ని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానానికి పంపుతున్నారు. ఈసారి బిజేపి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని చాల సీరియస్‌గా తీసుకొని ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది … ముగ్గురు ఎంపిలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు జారకుండా శ్రేణులని అలర్ట్ చేస్తూ ఓట్లు రాబట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.