02-05-2026 గిగ్ వర్కర్లకు చట్టబద్ధత
TG CM Progress Report: గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్-2026 బిల్లు అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు చట్టబద్ధత కలగనుంది. ఈ చట్టం అమలుకు అవసరమైన విధివిధానాలు, గైడ్ లైన్స్ రూపకల్పన కోసం ప్రభుత్వం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయనుంది. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో దాదాపు 4 లక్షల మంది గిగ్‌వర్కర్లు ఉన్నారు. వీరందరికి సామాజిక భద్రత, బీమా లాంటి సౌకర్యాలేమీ ఉండట్లేదు. దీంతో వారికి పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు, రియల్ టైమ్ డేటా వెరిఫికేషన్ వ్యవస్థ, పని ప్రదేశాల్లో విశ్రాంతి గదుల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారం, కార్మికుల నమోదు కోసం ఏర్పాటు సహా పలు సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర సర్కారు ఈ చట్టాన్ని రూపొందించింది.
01-05-2026 మెరుగైన విద్యుత్ కు AI టెక్
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 1న ఆదేశించారు. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. సోలార్ పవర్ పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అటు విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు.
01-05-2026 ఆర్టీసీని కాపాడుతాం
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు CM రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో విలీనంపై అన్ని సంఘాల నాయకులు సమావేశమై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి హామీ
సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడంలో కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో ఈనెల 1న కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని, ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సంస్థను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలన్నారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌ను కూడా తగ్గించబోమన్నారు.
30-04-2026 సకాలంలో విద్యా సామాగ్రి
విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందించగలిగితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారని అన్నారు. విద్యా శాఖతో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్‌మెంట్, సరఫరా చేపట్టడంతో సమస్యలు వచ్చేవి.
ముఖ్యమంత్రి హెచ్చరిక
చాలా అక్రమాలు జరిగేవని, వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చామన్నారు సీఎం. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు అందజేసే నోట్ బుక్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ క్వాలిటీతో ఉండాలన్నారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించాలని, ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలన్నారు.
29-04-2026 తుమ్మిడిహెట్టిపై అడుగులు
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టే కార్యాచరణ స్పీడప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 29న ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎంత ఎత్తున నిర్మించాలి, ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందని, 71 కిలోమీటర్ల మేరకు కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.
తక్కువ ఖర్చుతో నీటి తరలింపు
ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలన్నిటినీ ఉపయోగించుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటిని అందించవచ్చని, అలాగే, తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు వీలుంటుందని సీఎం రేవంత్ చెప్పారు. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
28-04-2026 ఫ్యూచర్ హోప్
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ ఏప్రిల్ 28న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అలాగే, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణిస్తుందని చెప్పారు.
ఫ్యూచర్ సిటీపై సీఎం పిలుపు
తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపాలనుకున్న వారు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి కలెక్టర్ కి పంపించాలన్నారు సీఎం. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని ప్రతిపాదించినప్పుడు సాధ్యమవుతాయా అని కొందరు ఆనాడు అవహేళన చేశారని, కానీ అవే నిజమయ్యాయన్నారు. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
28-04-2026 గిరి దర్శకులుగా మాజీ మావోలు
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి మావోయిస్టులను సమాజంలో భాగస్వామ్యం చేయాలన్న వినూత్న ఆలోచనతో 20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువకులను గిరిదర్శకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తొలి విడతగా ఎంపిక చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. వారికి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శిక్షణనిచ్చారు. తొలి విడతగా ఎంపిక చేసిన 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సహాయంగా ఈ గిరిదర్శక్‌లు పనిచేస్తారు. పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతో పాటు పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శక్‌లు సహాయంగా నిలుస్తారు.
27-04-2026 మహిళల రక్షణ కోసం
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన వాహనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 27న జెండా ఊపి ప్రారంభించారు. నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో స్పందన టీమ్‌లను ప్రారంభించారు. మహిళలు, పిల్లల రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం. మహిళలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటు, స్టాండ్ విత్ హర్ లాంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేస్తూ, అదే తరహాలో కొత్తగా స్పందన బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజంపైన కూడా ఉందని సీఎం గుర్తుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు.
27-04-2026 సరికొత్తగా అసెంబ్లీ ప్రాంగణం
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఏప్రిల్ 27న సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు.
వారసత్వ భవనాల రక్షణతో అభివృద్ధి
సభ్యుల గౌరవం పెంచేలా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. సమావేశాలు జరుగుతున్న టైంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని చెప్పారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని సూచనలు చేశారు.
26-04-2026 జనగణనపై అవగాహన
జనగణనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో పాల్గొని ఏప్రిల్ 26న వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027లో భాగంగా తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు సీఎంకు వివరించారు.
26-04-2026 పకడ్బందీగా ప్రజావాణి
రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఏప్రిల్ 26న ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున అంటే 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.
సీఎం కీలక ఆదేశాలు
దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో సీఎస్ సహా సీఎంవో అధికారులను ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని చెప్పారు. తర్వాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
Also Read: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి- జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Story by: Anup, Big Tv