Nalgonda: నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారనున్నాయంటున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. జనాభా ప్రాతిపదికన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్తగా 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మహిళలకు రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడే సెగ్మెంట్లలో మహిళకే పెద్దపీట వేస్తారంట. ఈ నేపధ్యంలో నల్లగొండ జిల్లా రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయనేది అందరిలో ఆసక్తి రేపుతోంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో నియోజకవర్గాల సంఖ్య 294 నుంచి పెరగకపోయినా.. పలు నియోజకవర్గాల రూపురేఖలు మారిపోయి, కొత్త సెగ్మెంట్లు వచ్చి, కొత్త రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత 119 అసెంబ్లీ సెగ్మెంట్లతో తెలంగాణ, 175 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికలు అంటే 2029 నాటికి తిరిగి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగడం ఖాయమంటున్నారు.
ఆ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు 16కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందులో మహిళలకు రిజర్వ్ చేసే సీట్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లో అన్ని పార్టీల్లో పాత కొత్త నేతల సమీకరణలతో వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయింపు తలనొప్పిగా మారుతున్న పరిస్థితి. అందుకే ఆయా పార్టీలకు కూడా నియోజకవర్గాల పెంపు వరంగా మారుతుందని చెప్తున్నారు. సిట్టింగ్ స్థానాలు పదిలంగా ఉండటంతో .. కొత్తగా పెరిగే నియోజవకర్గలతో ఆయా ఆశావహులకు అవకాశం కల్పించడం పార్టీలకు సులభమవుతుంది.
నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నల్లగొండ రూరల్, నేరేడుచర్ల నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది. భువనగిరి పార్లమెంట్ నిమోజకవర్గంలో నూతనంగా చౌటుప్పల్, రామన్న పేట అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశముంది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం రెండుగా మారి అర్బన్, రూరల్ గా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాదులు చాలా మంది పోటీలో ఉన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుల.
గుత్తా అమిత్‌రెడ్డితో పాటు ప్రస్తుతం నల్లగొండ మేయర్ గా ఉన్న బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి , జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి నల్లగొండలో కొత్త స్థానం నుంచి పోటీకి ఉవిళ్లూరుతున్నారంట.. ఎవరికి అవకాశం దక్కాలన్నా ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం కీలకమంటున్నారు. ఒకవేళ అర్బన్,రూరల్ లో ఏదో ఒకటి రిజర్వ్ అయితే ఆశావహుల అవకాశాలకు గండి పడనుంది. ఇక నేరేడు చర్ల నియోజకవర్గం గిరిజన జనాభా ఆధారంగా ఎస్టీ రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీ అయితే ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. జనరల్ అయితే రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
భువనగిరి పార్లమెంట్ నిమోజకవర్గంలో కొత్తగా చౌటుప్పల్, రామన్న పేట నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతం లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు.. లోక్‌సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్ధినిగా చివరి వరకు లక్ష్మి పేరు వినిపించింది. ఆ లెక్కలతో వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌తో నైనా కోమటిరెడ్డి లక్ష్మికి చౌటుప్పల్ టికెట్ దక్కుతుందంటున్నారు.
మరోవైపు రామన్నపేట గతం లో నియోజవర్గం గా ఉండేది. 2009 ఎన్నికల ముందు జరిగిన పునర్విభజనలో అది రద్దైంది. మళ్లీ ఇప్పుడు రామన్నపేట కొత్తగా ఏర్పడి, ఒక వేళ ఎస్సీలకు రిజర్వ్ అయితే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడ నుంచి పోటీ చేస్తారంటున్నారు. అప్పుడు నకిరేకల్ జనరల్ గా మారుతుంది. ఏదేమైనా నియోజకవర్గల పెంపుతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రీపర్ చేసుకుంటున్నారంట. నియోజకవర్గాల పెంపు ఉంటుందో ఉండదో అని సందేహిస్తూ వచ్చిన ఆశావహుల్లో … 2029 ఎన్నికల నాటికి పెంపు పక్కా అని తేలడం తో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఆశతోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్య అనుచరులుగా ఉన్న స్థితిమంతులైన నేతలు పొలిటికల్‌గా మరింత యాక్టివ్ అవుతున్నారంట.
Also Read:మేము ఏం తప్పు చేశాం.. అన్నామలై, రాఘవ్ చద్దా ని సైడ్ చేయడానికి కారణం ఇదేనా?
Story by: Apparao, Big Tv