E-Paper
Advertisement

FSL Fire Accident: ఫోన్ ట్యాపింగ్ నుంచి ఓటుకు నోటు వరకు.. FSL అగ్నిప్రమాదం వెనుక ఉన్న మతలబు ఇదేనా?

FSL Fire Accident: ఫోన్ ట్యాపింగ్ నుంచి ఓటుకు నోటు వరకు.. FSL అగ్నిప్రమాదం వెనుక ఉన్న మతలబు ఇదేనా?
Advertisement

FSL Fire Accident: రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ చుట్టే తిరుగుతోంది. నిజంగా ఇది ప్రమాదమా? మరేదైనా కుట్ర కోణమా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. దాంతో.. తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం.. రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. ఓ ఫైర్ యాక్సిడెంట్‌గా చూడాల్సిన ఘటన.. ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికైంది.

ఈ ప్రమాదం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఒకరు, అది కేవలం సాంకేతిక లోపమని మరొకరు వాదిస్తున్నారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఈ నెల7వ తేదీన ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అందులో కీలకమైన డేటాతో పాటు భౌతిక ఆధారాలు సైతం కాలి బూడిదయ్యాయనే వార్త.. రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రమాదాన్ని.. అత్యంత అనుమానాస్పదంగా చూస్తున్నారు. FSL అగ్ని ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాధారణంగా ఎండాకాలంలో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయని, కానీ, చలికాలంలో అగ్ని ప్రమాదం జరగడం విడ్డూరంగా ఉందన్నారు. చలి ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగిందంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలపై బీఆర్ఎస్ అనుమానం

Advertisement

ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు ఈ ల్యాబ్‌లోనే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయడానికే.. మంటలు అంటించారని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధపు ప్రచారాలేనని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని అంటున్నారు. ఆధునిక ఫోరెన్సిక్ వ్యవస్థలో.. డేటా అంతా ఒకే చోట ఉండదని, క్లౌడ్, ఇతర సర్వర్లలో బ్యాకప్ ఉంటుందని, సాక్ష్యాలు మాయమవడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ లాభం కోసమే.. బీఆర్ఎస్ కట్టుకథలు అల్లుతోందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇక.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఫోన్ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మొత్తం డేటాను కోర్ట్‌కు ఇచ్చామన్నారు. సర్వర్ రూమ్ కాలిపోయిందని, డేటా రికవరీ కోసం నిపుణుల బృదం పనిచేస్తోందని తెలిపారు. FSLలో ఉన్న ఆధారాలన్నీ కోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదంపై తలెత్తుతున్న సందేహాలకు డైరెక్టర్ షికా గోయల్ తెరదించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను సైతం ఖండించారు. ఈ నెల7వ తేదీన ఉదయం 10 గంటల తర్వాత రేగిన మంటలను, అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అదుపులోకి తెచ్చారని తెలిపారు. ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్, శిక్షణ హాల్ దెబ్బతిన్నాయని, అందులోని డేటాను తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.

రాజకీయ ప్రకంపనలు రేపిన అగ్ని ప్రమాదం…

Advertisement

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ ఫైర్ యాక్సిడెంట్.. ఓ ప్రమాదంగా మిగలకుండా.. క్రైమ్ థ్రిల్లర్‌ కథని తలపిస్తోంది. అగ్ని ప్రమాదంపై.. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. మంటల్లో ఏ సెక్షన్లు దెబ్బతిన్నాయి? ఏయే కేసుల ఫైళ్లు కాలిపోయాయి? అనే అంశంపై అధికారిక నివేదిక వస్తే తప్ప ఈ రాజకీయ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడదు. ఓ వైపు కుట్ర అని ప్రతిపక్షం, అలాంటిదేమీ లేదు అది ప్రమాదమేనని ప్రభుత్వం అంటున్న వేళ.. అసలు నిజమేంటో నివేదికల్లోనే తేలాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదంపై.. బీఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. కేటీఆర్ అయితే.. 2015 నాటి ఓటుకు నోటు కేసు తుది దశకు చేరుకున్న తరుణంలో, అందులోని కీలకమైన ఆడియో రికార్డింగ్‌లు, వాయిస్ శాంపిల్స్‌ను ధ్వంసం చేసేందుకే.. కుట్రకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఇక్కడే ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకు.. గులాబీ పార్టీ నేతలే ఏమైనా ప్లాన్ చేశారేమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం మారగానే స్టేట్ ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై అబాండాలు వేయడం ద్వారా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే వ్యవహారంపై.. బీజేపీ మరోలా స్పందించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు కాపాడుకునేందుకు ఇలాంటి అగ్ని ప్రమాదాల నాటకం ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఫైర్ యాక్సిడెంట్‌పై సంచలన వివరణ..

రాజకీయ రచ్చ నడుస్తుండగానే.. ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖాగోయల్ కీలక వివరణ ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారాలకు, సందేహాలకు చెక్ పెట్టారు. ఓటుకు నోటు కేసులోని 16 రకాల ఆధారాలను విశ్లేషించి, వాటి రిపోర్టులను 2021లోనే ఏసీబీ కోర్టుకు తిరిగి పంపించామని, ప్రస్తుతం ల్యాబ్‌లో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు వచ్చిన 132 వస్తువుల్లో.. 125ని ఇప్పటికే విశ్లేషించామన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సర్వర్ రూమ్ దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, చాలా వరకు డేటాని రికవరీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఈ ఫైర్ యాక్సిడెంట్ పొలిటికల్‌ సెన్సేషన్‌గా మారడానికి బలమైన కారణాలున్నాయ్. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో సాధారణంగా ఫోన్ డేటా, హార్డ్ డిస్క్‌లు, డ్రగ్స్ కేసులు, భూ కుంభకోణాలు, రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న వ్యక్తులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఉంటాయి. ఏదైనా కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగితే, అది కచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది.

కోర్టు కేసులపై ప్రభావమా? ల్యాబ్‌లోని ఆధారాలపై చర్చ

సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ లాంటి చోట్ల.. డిజాస్టర్ రికవరీ బ్యాకప్ ఉండాలి. కానీ, బీఆర్ఎస్ లాంటి పార్టీల వాదన ప్రకారం ఆ బ్యాకప్‌ను కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మంటల వల్ల భౌతిక ఆధారాలు నశించిపోతే, కోర్టులో కేసు వీగిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని వివాదాస్పద కేసుల్లో ఫైళ్లు తగలబడటం, డేటా మిస్ అవ్వడం లాంటి ఘటనలు జరిగాయి. ఆ చరిత్రను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే.. విపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చ కేవలం అక్కడ అంటుకున్న మంటల గురించి మాత్రమే కాదు.. ఆ మంటల వెనుక ఉన్న మతలబు గురించి జరుగుతోంది. అధికారులు.. డేటా సేఫ్ అని చెబుతున్నా, విపక్షాలు మాత్రం సాక్ష్యాల చెరిపివేత అనే అస్త్రాన్ని వదలడం లేదు. ప్రభుత్వ వివరణపై నమ్మకం లేదని విపక్షాలు చెబుతున్నాయ్. పోలీసు శాఖాపరమైన విచారణ వల్ల నిజాలు బయటకు రావంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్పెషల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో ఏయే కేసులకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి? వాటిలో ఏవి సురక్షితంగా ఉన్నాయి? అనే విషయాలు కూడా బయటపెట్టాలని కోరుతున్నారు.

Story by:Anup, Big Tv

Related News

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Big Stories

Advertisement
×