GHMC Elections: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అభివృద్ది పనులతో పాటు సుమారు కోటి 40 లక్షల మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నవంబర్ మాసం చివరలో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ అధికారవర్గాల సమాచారం. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దం కావాలని సర్కారు సంకేతాలిచ్చినట్లు జీహెచ్ఎంసీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముఖ్యంగా పీకల దాక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలో నెలకొన్న నిధుల కొరత, విలీన ప్రాంతాల్లోని అరకొర వసతులను మెరుగుపరిచేందుకు కావల్సిన స్థాయిలో సర్కారు వద్ద నిధులు లేకపోవటంతో వీలైనంత త్వరగా మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు పాలక మండలిలను అందుబాటులోకి తీసుకువస్తే వివిధ స్కీమ్ ల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశమున్నందున, వచ్చే నవంబర్ మాసం కల్లా ఎన్నికలు నిర్వహించి, పాలక మండలిలను అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు యోచస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా ఇప్పటికే చివర దశలో ఉన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల రేష్నలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా సర్కారు మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం కావాలని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు సంకేతాలివ్వటంతో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( సర్) ప్రక్రియ తర్వాత చేపట్టాల్సిన ఎన్నికల సంబంధిత ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Alao Read: సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర.. 9 మంది అరెస్ట్, తీగలాగితే డొంక
ప్రస్తుతం క్యూర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాతో పాటు మొత్తం క్యూర్ పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగియనున్నందున, ఆ తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల సంబంధిత ప్రక్రియపై దృష్ట సారించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించే క్రమంలో అధికారులు మొత్తం 300 వార్డులకు వరుసగా సంఖ్యలు కేటాయించారు. ఇందులో మొదటి మున్సిపల్ వార్డు నుంచి 150 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, 151 నుంచి 227 వరకు మొత్తం 76 వార్డులు వరుసగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా, 227 నుంచి 300 వార్డు వరకు 74 వార్డులు మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నాయి.
క్యూర్ పరిధిలోని మొత్తం 300 వార్డులో ఒకటవ వార్డు నుంచి 150 వార్డు వరకు వరుస సంఖ్యను అలాగే కొనసాగించి, 151 నుంచి ఉన్న సైబరాబాద్ పరిధిలోని మున్సిపల్ వార్డులకు వరుస సంఖ్యను కేటాయించనున్నారు. అలాగే ప్రస్తుతం మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలూ 227 నుంచి 300 వరకున్న వార్డులకు ఒకటి నుంచి 74 వరకు వరుస సంఖ్యను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీన సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతమున్న మున్సిపల్ వార్డుల సరిహద్దులను ఏ మాత్రం మార్చకుండా కార్పొరేషన్ల వారీగా కేవలం వాటి నెంబర్లను ఒకటి నుంచి చివరి వరకు కేటాయించనున్నట్లు సమాచారం.
నోటిఫికేషన్ జారీ..
ఆ తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ సీటు రిజర్వేషన్లతో పాటు వార్డు రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిసింది. అక్టోబర్ రెండు లేక మూడో వారంలో సర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టి, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారాన్ని నవంబర్ ఒకటి, లేక రెండో వారంలో పూర్తి చేసి, నవంబర్ చివర వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా సర్కారు వ్యూహాన్ని సిద్దం చేసుకున్నట్లు సమాచారం. క్యూర్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్దం కావాలని సంకేతాలిచ్చిన సర్కారు వీటికి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై మరింత క్లారిటీ రావల్సి ఉంది. తొలుత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించి, వచ్చే ఫలితాలను బట్టి కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన భావిస్తున్నట్లు కూడా అధికార వర్గాల్లో చర్చ లేకపోలేదు.
Also Read: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!