Telangana Govt: తెలంగాణలో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి ముగ్గురు కీలక నేతలను తప్పించారు. ప్రభుత్వంలో సీనియర్ మంత్రులుగా చెలామణి అవుతున్న వారిని కాదని, కొత్తగా మంత్రులు అయిన వారికి భాద్యతలు అప్పగించారు . అసలు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను జిల్లా ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు? ఆ ఇద్దరి విషయమై పార్టీలో జరుగుతున్న చర్చేంటి? జిల్లాలకు కొత్త ఇన్చార్జ్ మంత్రుల నియామకం నేపధ్యంలో కొందరిని భాధ్యతల నుంచి తప్పించడం , మరికొందరిని జిల్లాలు మార్చడంపై జరుగుతున్న చర్చేంటి?
జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను మార్చిన ప్రభుత్వం
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల నియామకంలో మార్పులుచేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం . గతంలో సిఏం , డిప్యూటి సీఏం కలిపుకుని కేబినెట్ లో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. అప్పట్లో సీఏం, డిప్యూటి సీఏంలను మినహాయించి మిగతా 10 మంది మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జీ భాద్యతలు అప్పగించారు .
ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖలకు బాధ్యతల తొలగింపు
క్యాబినెట్ విస్తరణలో భాగంగా మరో ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు సీఏం రేవంత్ రెడ్డి . దీంతో ప్రస్తుతం కేబినెట్ లో మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు. అయితే గతంలో కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న కోమట్ రెడ్డి వెంకటరెడ్డి , మొదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖలను ఇన్చార్జ్ భాధ్యతల నుంచి తప్పించారు. ఈ ముగ్గురు సీనియర్ మంత్రులను జిల్లాల బాధ్యతల నుంచి తప్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సీఎం, డిప్యూటీ సీఎంలకు ఇన్చార్జ్ బాధ్యతలు లేవన్న మంత్రులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డిలను ఇంఛార్జీ బాధ్యతల నుంచి తప్పించడానికి కీలక కారణమే ఉందట . సీఎం, డిప్యూటీ సీఏంలకు ఇన్చార్జు బాధ్యతలు అప్పగించకుండా సీనియర్ మంత్రులు అయిన తమకు ఎందుకు అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర ఈ ఇద్దరు మంత్రులు అన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు వచ్చిన నేపధ్యంలో వారికి అవకాశం కల్పిస్తే బెటర్ అని వారు సూచించారట. దీనికి తోడు శాఖాపరంగా పని ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.
తరుచూ అనారోగ్యానికి గురవుతున్న కొండా సురేఖ
దాంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను బాధ్యతల నుంచి తప్పించారట. ఇక మరో మంత్రి కొండా సురేఖ ఈ మధ్య వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. దానికి తోడు ఆమె శాఖ లో చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని అందుకోసమే మెదక్ ఇన్చార్జ్ మంత్రి భాద్యతల నుంచి తప్పించారని సమాచారం. మొదక్ జిల్లాలో నేతల మధ్య ఉన్న వైరుధ్యాలను చక్కబెట్టడంలో ఇన్చార్జ్ మంత్రిగా ఆమె ఫెయిలయ్యారని.. పటాన్ చెరువు పార్టీ నేతలు బాహాబాహాకి నేతలు మంత్రి కంట్రోల్ చేయలేకపోయారని.. పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం కూడా కొండా సురేఖ మార్పునకు కారణమంటున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సీతక్క
ఇక ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కను నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్‌గా , నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇంఛార్జీ మంత్రిగా మార్పులు చేశారు. 6 నెలల క్రితమే తనను ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ భాధ్యతలనుంచి తప్పించాలని సీఏంను కోరారట మంత్రి సీతక్క. దీనికి కారణం లేకపోలేదని సమాచారం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతలు ఎవరూ తన మాట వినడం లేదని , పైగా సంబంధం లేని విషయాల్లో తన పై విమర్శులు చేస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోతున్నారట సీతక్క.
ప్రేమ్‌సాగర్ రావు, వివేక్‌ల మధ్య విభేదాలు
ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యం కాదని .. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్చార్జ్ మంత్రిగా రివ్యూలు నిర్వహించడం సమస్యగా మారిందని సీఎంకు సీతక్క చెప్పినట్లు సమాచారం. ఆ క్రమంలో సీతక్కను అనివార్యంగా మార్చాల్సిన పరిస్థితి రావడంతో జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా జిల్లా ఇంఛార్జీ మంత్రుల నియామకం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిత్తిస్తుంది. సీనియర్లను భాద్యతల నుంచి తప్పించడానికి, కొందరిని జిల్లాలు మార్చడానికి కారణాలు ఉన్నా.. రాజకీయ వర్గాల్లో ఎదో తెరవెనుక ఏదో రాజకీయం నడిచిందనే చర్చ సాగుతోంది.
Story By Apparao, Bigtv Live