బీఆరెస్ పార్టీ ఎక్కడ నుంచి ఎక్కడికి దిగజారుతున్నదో.. చివరకు ఎవరి చేతుల్లోకి అది వెళ్లిపోతున్నదో తెలియజేసే ఓ చిన్న ఉదాహరణ ఇది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కీలక కార్యకర్త ఒకరు.. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి కొణతం దిలీప్‌ను గులాబీ చీడపురుగు.. అని వర్ణించి.. ఆయన లీలల గురించి ‘గులాబీ నీడ’లో అనే పుస్తకం కూడా రాస్తున్నానని ప్రకటించాడు. కొణతం దిలీప్ తెరవెనుక ఉండి ఆ పార్టీ పతనానికి, యువనేత కేటీఆర్‌ను ఆగం చేసిన తీరు గురించి చాలా మందికి తెలియదు.
తెలంగాణ ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన కేసీఆర్.. ఆ తరువాత ఆయన పెట్టిన టీఆరెస్ పార్టీ. ఇది చరిత్ర. ఆ తరువాత తెలంగాణ మలిదశ ఉద్యమం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు అదో నేపథ్యం. అంతే. ఆ తరువాత జరిగిన ప్రతిచర్యా.. పక్కదారి పడుతూ వచ్చింది. చేతలు మారాయి. మాటలూ మారాయి. కొత్త ముఖాలు వచ్చిపడ్డాయి. కొత్త బాధ్యతలు తీసుకుంటూ మొత్తం పక్కదారి పట్టించడం మొదలుపెట్టాయి. ఇందులో కొణతం దిలీప్‌కుమార్ రెడ్డి కూడా ఒకడని చెప్పాలి.
మన తెలంగాణ పత్రికలో మన వార్తలే రాయాలి. మనమే ఉండాలి.. ఇంకొకరి వార్తలు మనకెందుకు? అని వితండవాదం చేసి ఆ నమస్తేను ఆ పరిస్థితికి తెచ్చిన ఘనుల్లో ప్రధానుడు. ఆ తరువాత డిజిటల్ మీడియాను తనే ఏలుతూ, ఏలికలకే సలహాలిచ్చేంతగా ఎదిగి.. వారిని ఇలా గద్దెదిగేదాకా దిగజార్చిన మేథావుల్లో ఈ మేథాను కూడా చేర్చొచ్చు. పొగడ్తలంటే కేసీఆర్‌కు ఇష్టం. కానీ ఆ పొగడ్తలే తన కొంపముంచాయని ఆయనకు ఇప్పటికీ తెలియదు. అలా వారికి అడుగంటించిన తెర వెనుక ముఖ్యుల్లో కొణతం ఒకడు.
ఇవన్నీ ఎందుకంటే.. తనకు తాను మేథావిగా భావిస్తాడు. తను చెబితే చాలు కీలుగుర్రంలా కేటీఆర్ నడుస్తాడు.. ఆడుతాడు.. పరిగెత్తుతాడు..! అలా తయారు చేసుకున్నాడు. అధికారంలో ఉన్న పార్టీని అడుగంటించి.. పెద్దసారును ఫామ్‌హౌజుకు పంపి.. చిన్నసారును ఇంకా తన పిడికిలిలో బంధించి కీలుబొమ్మను చేసేశాడు దిలీప్. అప్పుడు అధికారం దూరమైంది. ఇప్పుడు ఆ అధికారం కోసం తొక్కని పక్కదారి లేదు. మర్యాద మన్ననా అంతా జాన్తానై.
తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకును.. అని ఏదో సినిమాలో మోహన్‌బాబు రౌడీ డైలాగు కరెక్టుగా ఆప్ట్ అయ్యేలాగే వీరి ప్రవర్తన ఉంది. పార్టీ వీడిన కవితను కూడా వదల్లేదు కొణతం. ‘మరదలు పిల్ల..’ అని గేలి చేసే దాకా పోయింది కొణతం బలుపు. దీనిపై కవిత కూడా గట్టిగానే రియాక్టయ్యారు.
అధికార పార్టీ ఆరోపణలకు హుందాగా సమాధానం ఇవ్వొచ్చు. విషయంతో కూడిన వివరణ చెప్పొచ్చు. వారు తప్పే చేయలేదనుకుంటే. కానీ మాటకు పది మాటలంటాం అనే కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు కొణతం. ముందే కోతి ఆపై కల్లు తాగింది.. అన్నట్టుగా తయారైంది కేటీఆర్ పరిస్థితి. కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా అందుబాటులో లేడు. ఇక వీరిద్దరిదే ఆడింది ఆట .. పాడింది పాట. తండ్రికున్న పరపతిని కూడా పణంగా పెట్టిమరీ సోషల్ మీడియా మార్కెట్లో కొత్త రాజకీయాన్ని ఆవిష్కరించడం వెనుక కొణతం దిలీప్ ..కర్త, కర్మ, క్రియ అంటే అతిశయోక్తి కాదు. దీన్నే అంటారు.. సహవాస దోషమని! నిండా మునిగిన తరువాత ఇక చలి గురించి భయమేలా? ఆలోచనేలా?