Tennis Players: ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లఖ్‌నవూలో నిర్వహించిన టెన్నిస్ పోటీల్లో పాల్గొని, తిరిగి దేవరియాకు వెళ్తున్న ఆరుగురు క్రీడాకారుల కారు ఓ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు క్రీడాకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన ఎలా జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పుర్ జిల్లాలోని సుఖ్‌బదేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న కారు వేగంగా వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, లోపల ఉన్నవారు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, స్థానికుల సహాయంతో కారు తలుపులు విరగ్గొట్టి బాధితులను బయటకు తీశారు.
వైద్యుల నిర్ధారణ, బాధితుల వివరాలు
బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతులను నిత్య ప్రజాపతి (22), ఇర్ఫాన్ అన్సారీ (20), అనికేత్ (24)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆనంద్ యాదవ్, రాజు, జయంతో శర్మలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
పరారీలో డ్రైవర్
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Also Read: సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!