Kainchi Dham Traffic Alert: ‘హనుమాన్ అంశ్’ సినిమా విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రదేశాలపై పర్యాటకులలో క్రేజ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ కుమావోన్ కొండల్లో ఉన్న నీమ్ కరోలి బాబా ఆశ్రమం కైంచి ధామ్ కు భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేనంతగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారులపై వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాధారణ రోజుల్లో ప్రశాంతంగా ఉండే కైంచి ధామ్ పరిసరాలు ప్రస్తుతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. హల్ద్వానీ–కైంచి ధామ్, నైనిటాల్–భోవాలి మార్గాల్లో కొన్ని ప్రాంతాల్లో వాహనాల 3 నుంచి 20 కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. సాధారణంగా రెండు గంటల్లో పూర్తయ్యే ప్రయాణం ఇప్పుడు 10 నుంచి 12 గంటల వరకు పడుతోంది. దీంతో కొంతమంది భక్తులు తమ వాహనాలను రహదారిపైనే నిలిపి, ఆశ్రమానికి చేరుకోవడానికి కొన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.
కైంచి ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రహదారులు, పార్కింగ్ సదుపాయాలు దాదాపు 4 వేల వాహనాలను నిర్వహించే స్థాయిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే. వీకెండ్ లో ఈ ప్రాంతానికి సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు వాహనాలు, భక్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఇంత భారీ సంఖ్యలో యాత్రికులు రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెమ్మది నెమ్మదిగా కిలో మీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్థానిక పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. హల్ద్వానీ, కాఠ్‌గోదాం, కాలాధుంగి, ఖైర్నా వైపు నుంచి కైంచి ధామ్‌కి వెళ్లే మార్గాల్లో స్థానికేతరుల టూ వీలర్స్ ఎంట్రీని నిషేధించారు. సరైన గుర్తింపు కార్డులు ఉన్న స్థానికులకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలతో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు. కొండ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలను కాఠ్‌గోదాం–భీమ్‌తాల్ మార్గం వైపు మళ్లిస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జ్యోలికోట్ హైవేపై కూడా ఒకే రూట్ ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ భారీగా వాహనాలు రావడంతో రహదారులపై ఒత్తిడి కొనసాగుతోంది. కొంతమంది యాత్రికులు ఆశ్రమానికి చేరుకోవడానికి 5 కిలోమీటర్లకు పైగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు స్థానికంగా సమాచారం. మరికొందరు భారీ క్యూలు చూసి దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్తున్నారు. అటు కైంచి ధామ్‌కు వెళ్లాలని భావిస్తున్న భక్తులు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు యాత్రను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ సినిమా తర్వాత పెరిగిన ఆధ్యాత్మిక ఆసక్తి కైంచి ధామ్‌కు భక్తుల రాకను ఎంతగా ప్రభావితం చేసిందో ప్రస్తుతం అక్కడి ట్రాఫిక్ పరిస్థితి స్పష్టంగా చూపిస్తోంది.
Read Also: 2026లోనే ప్రపంచం అంతం.. నవంబర్ 13న ప్రళయం రాబోతుందా?