Anam Ramanarayana Reddy: తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించింది వైసీపీకి చెందిన దుష్ట చతుష్టయమని మంత్రి ఆనం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు .. జగన్‌తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకుల్ని దుష్ట చతుష్టయంగా అభివర్ణిస్తూ… వైసీపీ నాశనానికి కూడా వారే కారణమని ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. ఆయన వైసీపీ నాయకులను అంతలా టార్గెట్ చేయడానికి కారణమేంటి? వైసీపీలో ఉన్నప్పుడు ఆయన కూడా వారితో ఇబ్బంది పడ్డారా? అందుకే వారి భాగోతాలు బయట పెడతానని ఆ సీనియర్ నేత హెచ్చరిస్తున్నారా? టీటీడీలో వారి అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికలు దేవాదాయ శాఖ మంత్రికు అందాయా? దుష్ట చతుష్టయం ఎవరు?
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు వైసీపీ అద:పాతాళంలో పడిపోవడానికి కూడా లెక్కకు మించిన కారణాలు కనిపిస్తాయి .. వాటిలో ప్రధానమైనది తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, శ్రీవారి భక్తులపై వైసీపీ ప్రభుత్వం నాటి టీడీపీ పాలకమండళ్లు ప్రదర్శించిన నిర్లక్ష్యమే అంటారు. తమ పాలన గురించి తెలుసుకోవడానికి జగన్ బోల్డు సర్వేలు చేయించుకున్నారంటారు. తిరుపతి నుంచి తిరిగి వెళ్ళే రైళ్లలోనిజనరల్ భోగీల్లో మూడు సంవత్సరాల క్రితం ప్రయాణం చేసి వుంటే … తమ పార్టీ పరిస్థితి ..తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమయ్యేదంటున్నారు.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు మళ్లీ ఇంటికెళ్లే వరకు కొండపై పడ్డ బాధల గురించి అంతలా తిట్టుకునే వారంట..
కరోనా తర్వాత నిబంధనల పేరుతో సామాన్య భక్తులకు స్వామి వారిని దూరం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీటీడీ పాలక మండలి అడ్డగోలు నిర్ణయాలతో తిరుమలలో ఇష్టానుసారం వ్యవహరించాయి .. ఇక ఇటీవల కొండపై తొక్కిసిలాట ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు.. దానిపై భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది.. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం తన మందీ మార్భలంతో తిరుమల వచ్చి నానా హడావుడి చేశారు. దానిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ టీమ్‌కి దుష్టచతుష్టయం అన్న టాగ్ లైన్ తగిలించి టార్గెట్ చేశారు.
వైసీపీ హయాంలో తిరుమల కొండపై చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది.. ఆ విచారణలు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుని నివేదికలు ప్రభుత్వానికి చేరుతున్నాయంటున్నాు. ఆ క్రమంలో విజిలెన్స్ నివేదికలో పొందు పర్చిన విషయాలు ఏమిటి..దేవాదాయ శాఖ మంత్రి వద్ద చిట్టాలో ఎముంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2019 – 2024 మధ్య కాలంలో టీటీడీలో రాజ్యాంగేతర శక్తులు దందాలు నడిపాయని స్థానికులు చెప్పుకుంటారు .. అదనపు ఈఓగా వచ్చిన ధర్మారెడ్డిది సెపరేట్ రూటు.. మీడియాతో పాటు అధికారులు, చివరకు ప్రజా ప్రతినిధులు సైతం తన మాట వినక పోతే వారిని ఇబ్బంది పెట్టడమే అయన లక్ష్యం.. అందుకు ఉదాహారణలుగా అనేక మంది అధికారులపై విజిలెన్స్ ద్వారా తప్పుడు నివేదికలు తీసుకోవడం , వారిని బెదిరించి తనకు అనుకూలంగా మలుచుకున్న ఘటనలు చాలానే ఉన్నాయంటారు. అవకతవకలపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై సైతం కేసులు పెట్టిన సందర్భాలున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి దఫా వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పాలకవర్గం చైర్మన్‌గా నియమించారు. ఆయన హయాంలోనే తిరుమలలో అక్రమాల పర్వానికి తెర లెగిసిందంటారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ని విచారించడానికి విజిలెన్స్ నోటీసులు ఇస్తే … ఉలిక్కిపడి తనను విచారించకూడదంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు… వైవీ సుబ్బారెడ్డి సతీమణి అయితే ఏకంగా తిరుమల ఆలయంలో జగన్మోహన్ గోవిందా అంటూ వీర విధేయత ప్రదర్శించి వివాదానికి తెర లేపారు.
ఇక ఉదయాస్తమాన సేవలు టికెట్ల విషయంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన దందాలు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఆ సమయంలో మాట్లాడుకున్న మాటలు వారి పరువును గంగలో కలిపిపాయి… తిరుపతి, వైజాగ్, ఒంగోలు, విజయవాడ క్యాంపు కార్యాలయాలలో టికెట్లు అయన ఇష్యూ చేయడం అవి దళారుల చేతుల్లో పడటం… వాటిని బ్లాక్‌లో విక్రయించడం షరా మామూలుగా జరిగింది.. ఎస్వీ యూనివర్సిటికి చెందిన ఓ విద్యార్థి నాయకుడు .. వైవీ సుబ్బారెడ్డితో సన్నిహితంగా మెలిగి కొండపై అక్రమార్జనతో కోటీశ్వరుడు అయ్యాడంటే పరిస్థితి అర్థం అవుతుంది.
ఇక భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఖజానా ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేసారు … క్యూలైన్ల నిర్మాణం పేరుతో అటవీప్రాంతంలో సైతం నిర్మాణాలు చేపట్టారు .. ఈ క్యూలైన్లలోకి భక్తుడు వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే కనీసం 15 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఆ దారిలో నడక అంటే ఎడారిలో నడిచినట్లే .. దాంతో పాటు తిరుపతిలో నిర్మాణాలు., పార్వేటి మండపం పునర్నిర్మాణం, తిరుపతిలో మాస్టర్ ప్లాన్ పేరుతో రహాదారుల నిర్మాణం ఇలా అన్నిటీకీ తిరుమల స్వామి వారి నిధులే వెచ్చించారు. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న తన కొడుకు అభినయ్‌ని తన స్థానంలో ఎమ్మెల్యేని చేయడానికి భూమన స్వామి వారి నిధులను రకరకాల రూపాల్లో వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ అస్తులను సొంత అస్తులుగా భావించారు. ఆయన ఏకంగా టీటీడీ గోశాలకు చెందిన ప్రహారీ గొడపై తన సొంత ఆలయం తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రచారాన్ని చేసుకున్నారు.. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరు నెలలకు వాటిని తొలగించారు. వీరితో పాటు కొండ మీద కింద పనిచేసిన పోలీసు అధికారుల దందా కూడా విజిలెన్స్ నివేదికలో బయటపడిందంట. వీఐపీ దర్శనాలకు సంబంధించి ఐదు సంవత్సరాల కాలంలో లక్షలాది టికెట్లు తీసుకున్న వారిలో సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి అండ్ కో ఉన్నారంట…దీంతో పాటు అటవీ శాఖ మంత్రిగా పాప వినాశము, నడక దారిలో అడ్డగోలుగా దుకాణాలు కేటాయించారనే విమర్శలు పెద్దిరెడ్డి పై ఉన్నాయి.
Also Read: బద్దుకొండా.. ఏడయ్యా? ఓటమి తర్వాత జాడ లేదయ్య!
ముఖ్యంగా పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికూమార్ కేసును లోకాయుక్తలో రాజీ చేయడానికి వీరు దందాలు నడిపారనే విమర్శలున్నాయి.. అప్పట్లో జరిగిన అన్ని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికలు రెడీ అవుతున్నాయంట… వాటి ఆధారంగానే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంతగా చెలరేగి పోయారంట.. ఆయన జగన్‌తో కలిసి దుష్ట చతుష్టయం అంటున్నారు. మరి అక్రమాలకు పాల్పడిన ఇంత మంది నేతల్లో మిగిలిన ముగ్గురు ఎవరో కాని… వచ్చే శాసన సభ సమావేశాలలో విజిలెన్స్ నివేదికలు బయటపెడితే తేలిపోనుంది.