
Top Ten Languages : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200కుపైగా దేశాల్లో మొత్తం 7వేలకు పైగా భాషలుండగా.. ఒక్క భారత్‌లోనే 22 అధికారిక భాషలతోపాటు వేలాది లిపిలేని భాషలు నేటికీ మనుడలో ఉన్నాయి. భాషల సంఖ్య భారీగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు మాత్రం గుప్పెడే ఉన్నాయి. రోజువారీ వినియోగాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు.. ప్రపంచంలో టాప్ 10 భాషలేవో తెలుసుకుందాం.

జనం మాట్లాడే టాప్ 10 భాషల జాబితాలో ఇంగ్లిష్ తొలిస్థానంలో ఉంది. దీనిని అత్యధికంగా 135 కోట్ల మంది మాట్లాడుతుండగా, 60కిపైగా దేశాల్లో ఇది అధికారిక భాషగా ఉంది. పలు దేశాలవారు దీన్ని పోటీపడి నేర్చుకుంటున్న నేపథ్యంలో ఇది యూనివర్సల్ భాషగా గుర్తింపు పొందింది.

ఈ జాబితాలో రెండవది.. చైనీస్ సంప్రదాయ భాష మాండరిన్. మాండరిమ్ అనే పోర్చుగీసు పదం నుంచి మాండరిన్ అనేమాట వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల మంది మాట్లాడే ఈ భాష చైనా, తైవాన్, సింగపూర్ దేశాల్లో అధికారిక భాషగా ఉంది.

మూడవ అతిపెద్ద భాష.. హిందీ. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లమంది హిందీలో మాట్లాడుతుండగా, కేవలం భారత్‌లోనే దీన్ని మాట్లాడేవారి సంఖ్య 52 కోట్లుగా ఉంది. భారత్‌తో బాటు పాకిస్థాన్, ఫిజీ దేశాల్లోనూ ఇది మంచి గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికాలోనూ హిందీ మాట్లాడేవారున్నారు.

వినియోగంలో ఉన్న నాల్గవ అతిపెద్ద భాష.. స్పానిష్. స్పెయిన్‌తో సహా 20కిపైగా దేశాల్లో ఇది అధికారిక భాషగా దీనిని ప్రపంచవ్యాప్తంగా 54 కోట్లమంది మాట్లాడుతున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని మెక్సికో, కొలంబియా, అర్జెంటీనా చీలి, వెనుజువెలా వంటి దేశాల్లోనూ దీని వినియోగం ఎక్కువే.

ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లమంది మాట్లాడే ఐదవ అతిపెద్ద భాషగా అరబిక్ గుర్తింపు పొందింది. 22 ముస్లిం దేశాల్లో ఇది అధికారిక భాష. ఎడమ నుంచి కుడివైపుకు రాయటం దీని ప్రత్యేకత.

ఆరవ స్థానంలో బెంగాలీ భాష నిలిచింది. 26.8 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాష మాత్రమే కాదు.. బంగ్లాదేశ్ అధికారిక భాష కూడా.

ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచిన ఫ్రెంచ్.. ఫ్రాన్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో అధికారిక భాషగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 26.7 కోట్లమందికి వాడుక భాషగా ఉంది.

జాబితాలో ఎనిమిదవ స్థానంలో రష్యన్ నిలిచింది. సోవియట్ నుంచి విడిపోయి, స్వతంత్ర దేశాలుగా మారిన ఉక్రెయిన్, జార్జియా, ఉజ్బెకిస్థాన్, అర్మెనియా, అజర్‌బైజాన్‌లోనూ మనుగడలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని 25.8 కోట్లమందికి ఇది వాడుక భాష.

ఈ భాషా జాబితాలో 9వ స్థానంలో పోర్చుగీసు ఉంది. విచిత్రం ఏంటంటే.. పోర్చుగల్‌లో పోర్చుగీసు మాట్లాడేవారి కంటే బ్రెజిల్, అంగోలా, మొజాంబిక్ దేశాల్లో ఈ భాషమాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. పది దేశాల్లో ఇది అధికారిక భాషగా ఉంది. దీనిని మాట్లాడేవారి సంఖ్య 25.8 కోట్లు.

అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో పదవ స్థానంలో మరో భారతీయ భాష అయిన ఉర్దూ నిలిచింది. ఇది భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో వినియోగంలో ఉంది. 23 కోట్లమంది ఈ భాషలో మాట్లాడుతున్నారు.