
Nara Bhuvaneswari : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. రెండో రోజు తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటించారు. మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చారు.
తంగెళ్లపాలెంలో మోడం వెంకట రమణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యలుకు ధైర్యం చెప్పారు. టీడీపీ తరఫున రూ.3 లక్షల చెక్కును ఆ కుటుంబానికి అందించారు. మోడం వెంకటమరణ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొనతనేరిలో నారా భువనేశ్వరి పర్యటించారు. గాలి సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం చేశారు.
మరోవైపు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి దెబ్బకొట్టామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని మండిపడ్డారు. కానీ ఈ నిర్బంధాలు ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయలేవని స్పష్టం చేశారు. నిజం గెలిచి తీరుతుందని పేర్కొన్నారు. మరింత బలంగా చంద్రబాబు ప్రజల కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తారని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని లోకేశ్ ట్వీట్ లో ప్రస్తావించారు.