ఈ మధ్య కేటీఆర్ .. కేసీఆర్ లెక్క మధ్యలో పంచులు వేసేందుకు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్ బయటకు రాని లోటు తీర్చి.. జనాలకు నేనున్నా అనే భరోసా నింపే ప్రయత్నంలో భాగంగా.. ఆయన స్పీచుల మధ్యలో జనాన్ని వారించే క్రమంలో ఇచ్చే పంచులను కూడా సందర్భాన్ని బట్టి వదిలే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ, ఇది కూడా బూమరాంగే అవుతున్నది. తాజాగా నిన్న కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో బహదూర్‌పల్లి, శంషాబాద్ రైతులతో కలిసి మీటింగు పెట్టుకున్నాడు. మధ్యలో ఎవరో రైతు పక్కకు పోయి ఫోన్ మాట్లాడటంతో కేటీఆర్‌కు చిరాకెత్తింది.. అంత అర్జెంటా? ఏం నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా..? లేక పెళ్లాం ఫోన్ చేసిందా? మరీ పక్కకు వోయి మాట్లాడుతున్నవ్..!? అంటూ వెటకారం, వ్యంగ్యం.. అన్ని కలగలిపి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ మాట్లాడిన తీరులో పెళ్లాం అనే పదం ఉపయోగించడం పై కేటీఆర్ అహంకారానికి ఇదొక చిన్న ఉదాహరణగా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.
కేసీఆర్ స్టైల్ ఇలా తెచ్చి పెట్టుకున్నట్టుగా, కావాలని అన్నట్టుగా ఉండదు. ఆయన నైజమేమింటే.. తను ఏదైనా చెప్పేటప్పుడు అక్కడంతా పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండాలి. ఎవ్వరు ఏ కొద్దిగా డిస్టర్బ్ చేసినా.. కస్సుమంటాడు. బేవకూఫ్… హౌలే… అరె పిచ్చోనివారా? ఇక్కడ నీనర్వ.. అక్కడ నువ్వర్వ.. జనానికేమర్థమైతది..? పొద్దన్నగూకలేదు.. అప్పుడే చెడిపోయినవా? జర ఆన్ని ఆగవట్టుర్రి.. ఆడు మనోడేనా? దాదాపుగా ఇలాంటి మాటలు, తిట్లు, వ్యంగ్యోక్తులు.. తరుచూ కేసీఆర్ నుంచి వస్తూనే ఉంటాయి. వీటిని జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఆయన సీరియస్‌గా తిట్టినా.. పట్టించుకోరు. పైగా ఇంకా కేరింతలు కొడతారు. కేసీఆర్ నోటి వెంట వచ్చే ఆ తెలంగాణ యాస తిట్లను కూడా జనం బాగా ఎంజాయ్ చేస్తారు. చివరకు ప్రెస్‌మీట్‌లో కూడా చికాకు కలిగించే ప్రశ్నలేసే జర్నలిస్టులను కూడా .. అయితే ఏం చెద్దామంటావ్..? రాహుల్ ఈ సిల్లీ క్వశ్చన్లేందీ? నీదే పేపర్..? .. అని అర్సుకుంటాడు.
ఆయన ఎక్కడున్నా.. చెప్పింది వినేవాళ్లే ఉండాలి తప్ప.. చికాకు తెప్పించేలా జోక్యం చేసుకునేటోళ్లు.. ఉల్టా ప్రశ్నలు వేసేటోళ్లు ఉంటే… అంతే ఆయనలోని మరో రూపం ఇలా బయటపడుతుంది. అది కేసీఆర్‌కే నప్పుతుంది. వేరే ఎవరికీ సూట్‌కాదు. ఆయన రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ తీసుకోగలడేమో గానీ.. ఇలా అచ్చంగా మరో కేసీఆర్‌లా మారలేడు. మారేలా నటించినా.. అది జనానికి రిసీవ్ కాదు. పైగా ఇలా నవ్వులపాలు, విమర్శలపాలు కాకతప్పదు.
కవిత కూడా పలు సందర్భాల్లో ఇలా తండ్రిలా మధ్యలో జనాన్ని అర్సుకునే ప్రయత్నం చేసినా.. అదీ కృతకంగానే అనిపించింది. ఇక ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్రతో ఆయన తరహా డైలాగులు చెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. డైలాగులు, హావభావాలను ఎంజాయ్ చేశారు. కేరింతలు కొట్టారు. సీరియస్‌గా తీసుకోలేదు. కేసీఆర్ బహిరంగ సభ డైలాగుల్లా జోష్‌నైతే నింపాయి.