India v USA : ఈ భూప్రపంచం మీద ఎక్కడ ఎలాంటి కండీషన్ ఉన్నా.. యుద్థం లేదా, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డా.. అక్కడ ట్రంప్ తన బిజినెస్ మైండ్ ఎంటరై పోతుందా? మొన్న రష్యా- ఉక్రెయిన్ వార్, ఇవాళ ఇండో పాక్ వార్.. యుద్ధమేదైనా మధ్యస్తం చేస్తాననడం.. ఆపై వారి నుంచిలాగాల్సింది లాగేయటం. మరీ ముఖ్యంగా భారత్ ని ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే ఎర్త్ పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా చేసిన జీరో టారీఫ్ కామెంట్స్ ఏంటి? వాటి తాలూకూ పర్యావసానాలేంటి?
ఖతార్ లో అమెరికా సైనిక సిబ్బందిని ఉద్దేశించి ట్రంప్ కామెంట్స్
బైద వే.. ఐ డోంట్ వాంటూ సే.. ఐ డిడ్, బట్ ఐ సెటిల్ ఇండియా- పాక్ ప్రాబ్లెం..ఇదీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన రీసెంట్ కామెంట్. నేను చెప్పకూడదు కానీ.. గత వారం భారత్ పాక్ మధ్య ఏర్పడ్డ సమస్య నివారణకు నేను ఖచ్చితంగా సహాయపడ్డాను. ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందిని ఉద్దేశించి.. ట్రంప్ మాట్లాడిన సారమిది.
వెయ్యేళ్ల సమస్య సానుకూల పరిచా..
యుద్ధం చేయడానికి బదులు వాణిజ్యం చేద్దామని తాను అన్నాననీ.. ఇటు పాక్ తో పాటు అటు భారత్ సైతం ఎంతో సంతోషంగానే ఉందని.. వారు దాదాపు వెయ్యేళ్ల న్యాయపోరాటం చేస్తున్నారనీ.. అన్నారు.. ట్రంప్. అనకూడదు కానీ.. ఇందులో దాగినదంతా ప్రేమేనా? నిజంగానే భారత్ పాక్ మధ్య కుదిర్చిన ఒప్పందం బాధ్యాతా యుతంగా చేసిందా? లేక .. పాక్ ని ఒక బూచిగా చూపించి భారత్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో భాగమా? అన్న ప్రశ్నలకు ఈ ప్రపంచం సమాధానం వెతుకుతుండగా మరో ట్రంప్ మార్క్ భారత ప్రేమ బయట పడింది. అదెలాంటిదంటే.. వెయ్యేళ్ల పాటు భారత్- పాక్ మధ్య గల సమస్యను సానుకూల పరిచాను. ఆ ఇద్దరూ ఎంత హ్యాపీయో చెప్పలేనంటూ.. ట్రంప్ పెట్టిన ఇంకో మెలిక చూడండి ఎలాగుందో.
యాపిల్ భారత్ వెళ్లడం నచ్చలేదన్న ట్రంప్
ఈ మాటల అర్ధమేంటని చూస్తే.. గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు ట్రంప్. చైనా- అమెరికా మధ్య టారీఫ్ వార్ నడుస్తుండగా.. యాపిల్ సంస్థ.. భారత్ లో తమ ఉత్పత్తులు తయారు చేసి అమెరికాకు దిగుమతి చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది నచ్చని ట్రంప్.. ఈ విషయాన్ని టిమ్ కుక్ దగ్గర ప్రస్తావించారు. అమెరికాలో యాపిల్ సంస్థను ఇంత బాగా చూసుకుంటున్నాం.. వీరేమో భారత్ వెళ్దామనుకుంటున్నారు.. అక్కడ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు. ఇది తనకు నచ్చడం లేదని తెగేసి చెప్పారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ టారీఫ్ లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారీఫ్ లు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. టారీఫ్ లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్ లో వస్తువుల అమ్మకం చాలా చాలా కష్టమంటూ.. తనకున్న భారత అభిమానం మొత్తం కుమ్మరించేశారు ట్రంప్.
జీరో టారీఫ్ కి భారత్ ఒప్పుకుందని మరో ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
మీకో విషయం చెప్పనా.. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చిందని మరో ట్విస్ట్ ఇచ్చారు ట్రంప్. ఏ టారీఫ్ లు లేకుండానే భారత్ దిగుమతులకు అంగీకరించిందని అన్నారాయన. మీరు భారత్ లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా.. అక్కడి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదని తేల్చేశారు ట్రంప్. వాళ్లకు వాళ్ల స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు ట్రంప్. ఈ విషయాలను స్వయంగా మీడియా ముందే వెళ్లగక్కారు ట్రంప్. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్ కుక్ ఒప్పుకున్నట్టు కూడా ప్రకటించారు ట్రంప్.
ఏప్రిల్ 9న భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారీఫ్
ఏప్రిల్ 9న భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారీఫ్ విదిస్తామని.. ప్రకటించారు ట్రంప్. అయితే 90 రోజుల పాటు ఈ పెంపును తాత్కాలిక నిలుపుదల చేయడం తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన జీరో టారీఫ్ మాటల్లో నిజం లేదని అన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. టారీఫ్ లతో సహా సమగ్ర వాణిజ్య ఒప్పందం పై భారత్ అమెరికా మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రతి అంశంపైనా కులంకుషమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకూ ఏ నిర్ణయం వెలువడలేదు. ఒక ఒప్పందం కుదిరితే.. ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధి చేకూరాలి. ఇదే తాము కోరుకుంటున్నట్టు చెప్పారు మంత్రి జైశంకర్. ఇలాంటి ప్రకటనలు తొందరపాటు చర్యే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. 2024లో భారత్ అమెరికా మధ్య 129 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని గుర్తు చేశారాయన.
ఒప్పందాల ఖరారు కోసం వాషింగ్టన్లో వాణిజ్యమంత్రి పియూష్
ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్.. మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ఖరారు కోసం మన వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వాషింగ్టన్ లో పర్యటిస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో ట్రంప్ చేసినజీరో టారీఫ్ ప్రకటనల అర్ధమేంటి? సున్నా టారీఫ్ కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికీ సంబంధమేంటి? మోడీ ఈ అంశంలో ఎందుకు రియాక్ట్ కావడం లేదు?అమెరికాతో ఏ డీల్ కుదుర్చుకోవడంలో భాగంగా తలూపారు? అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. జైరాంరమేష్ ఎక్స్ లో ప్రశ్నించారు.
భారత్ విషయంలో ట్రంప్ అసలు ఆలోచనేంటి?
భారత్ విషయంలో ట్రంప్ అసలు ఆలోచనేంటి? ఒకటే భారత్ కి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో అర్ధమేంటి? భారత్ మా మిత్రదేశం అంటూనే పాక్ కిసాయం. పాక్ కి మద్దతుగా వచ్చిన టర్కీకి కూడా హెల్ప్. ఇక ఔషధ ధరల విషయంలోనూ భారత్ కి వ్యతిరేకంగా నిర్ణయం. ఐఫోన్ సంగతి సరే సరి. తాజాగా బిగ్ బిల్ తో మరో ట్రంప్ మార్క్ బాదుడు షురూ. ఆ డీటైల్స్ ఏంటో తెలియాలంటే మీరీ స్టోరీ తప్పక చూడాల్సిందే.
IMF బెయిలౌట్ ప్యాక్ తో పాక్ కి హల్ప్
టర్కీకి క్షిపణులను విక్రయించే వెపన్ డీల్
ఔషధ ధరల తగ్గుదలతోనూ భారత్ కి చెక్
యాపిల్ భారత్ రాకుండా మరో పన్నాగం
బిగ్ బిల్ పేరిట మరో బాదుడు షురూ
పాకిస్థాన్ ఉగ్రవాద దేశమని తెలుసు. అక్కడి ఉగ్రవాదమే తమపై 9\11 దాడులు చేసిందనీ తెలుసు. భారత్ ని మొదట ఉగ్రవాద చర్యలతో కవ్వించింది పాకిస్థాన్ అనీ తెలుసు. భారత్ ఎలాంటి సైనిక చర్య తీసుకున్నా.. మాకు సమ్మతమే. ఎందుకంటే భారత్ మా మిత్ర దేశమనడమూ తెలిసిందే. పైకేమో భారత్ పై కపట ప్రేమ. లోలోన భారత్ కి వ్యతిరేక చర్యలు.
మొత్తంగా పాక్ కి సుమారు 3 బిలియన్ డాలర్ల నష్టం
మొన్న భారత్ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది పాకిస్థాన్ కి. ఆ దేశ అసలు ఆదాయవనరైన ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపడం మాత్రమే కాదు. సైనిక స్థావరాలపైనా పెద్ద ఎత్తున గురి పెట్టింది భారత్. భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ పేక మేడలా కూలింది. దీంతో 80 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భారత్ దెబ్బకు పాక్ కి తగిలిన అన్ని నష్టాలను కలుపుకుంటే.. సుమారు 3 బిలియన్ డాలర్లు. ఈ నష్టం నుంచి కోలుకోడానికి 2 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ నుంచి ఇప్పించింది.. అమెరికా. ఇలా ఆదేశానికి ఆపన్న హస్తం అందించింది కూడా ఇదే అమెరికానే.
టర్కీతో 304 మిలియన్ డాలర్ల వెపన్ డీల్
ఇక ఇదే యుద్ధంలో.. పాకిస్థాన్ కి తమ డ్రోన్ల ద్వారా టర్కీ ఎంత పెద్ద సాయం చేసిందో తెలిసిందే. అలాంటి టర్కీకి కూడా హెల్ప్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 304 మిలియన్ డాలర్ల విలువైన క్షిపణులను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ 2 వేల 300 కోట్ల వరకూ ఉండొచ్చు. ఈ డీల్ కింద 53 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, 60 బ్లాక్ టూ మిస్సైల్స్ అందించనున్నట్టు తెలుస్తోంది.
తాను విధించిన ఆంక్షలు తానే తూచ్ అంటోన్న US
ఇదే టర్కీ భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థాన్ కి 350 డ్రోన్లను అందించింది. దీని కారణంగా టర్కీ ఇండియా ఒప్పందాలు క్షీణించడం మొదలైంది. మొన్న పాక్ కి ఐఎంఎఫ్ రుణ సాయం, ప్రస్తుతం టర్కీకి మిస్సైల్ సరఫరా చూస్తుంటే.. ట్రంప్ డబుల్ గేమ్ ఏంటో ఇట్టే అర్ధమై పోతుందని అంటున్నారు నిపుణులు. అయితే ఈ టర్కీ డీల్ అమలులోకి రావాలంటే యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఇదిలా ఉంటే.. టర్కీ అమెరికా నుంచి జే 35 యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేలా తెలుస్తోంది. గతంలో టర్కీ రష్యా నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది. దీనిపై ఆంక్షలు విధించింది అమెరికా. తాను విధించిన ఆంక్షలు తానే తూచ్ అనేసి.. ఇదిగో ఈ బిగ్ డీల్ చేసుకుంది ట్రంప్ నాయకత్వంలోని అమెరికా.
అమెరికాతో తిరిగి మెరుగైన సంబంధాల కోసం టర్కీ యత్నం
టర్కిష్ వేర్పాటు వాద సంస్థ పీకేకేతో సంబంధం కలిగి ఉన్నాయి అమెరికా మద్దతుగల కుర్దిష్ దళాలు. వీటిని కొత్త సిరియన్ సైన్యంలో అనుసంధానించడానికి టర్కీ అమెరికా చర్చలు సాగిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో..పీకేకే తన ఆయుధాలను వదిలేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంప్రతిపక్తి కోసం 40 ఏళ్లుగా జరిపిన పోరాటం అంతమవుతోంది. ఈ క్రమంలో అమెరికాతో టర్కీ తన సంబంధ బాంధవ్యాలను మరిం మెరుగుపరుచుకునే దిశగా ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ డీల్.. యాంటీ ఇండియాగానే పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు దౌత్య నిపుణులు.
భారీ మార్కెట్ భారత్ ని కాదని టర్కీతో చేయికలపడమేంటి?
పాక్ ఆ మాత్రమైనా యుద్ధ రంగంలో నిలిచి.. భారత్ తో తలపడిందంటే.. అందుకు కారణం ఈ టర్కిష్ షూటింగ్ డ్రోన్లే. అలాంటి టర్కీయులతో ట్రంప్ చేసుకుంటున్న ఈ ఒప్పందాలు భారత వ్యతిరేక చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతేడాది భారత్- యూఎస్ మధ్య జరిగిన వాణిజ్యం విలువ 129 బిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీలో చెబితే.. కొన్ని లక్షల కోట్లు. అలాంటి భారీ మార్కెట్ గల భారత్ ను కాదని.. టర్కీతో చేయి కలపడమేంటి? దానికి తోడు భారత్ తో వ్యాపారం చేయడమే నష్టదాయకమన్న కోణంలో యాపిల్ వంటి సంస్థలను రెచ్చగొట్టడమేంటి? అన్నదొక చర్చగా మారింది.
30- 80 శాతం మన మందుల ధరలు తగ్గించే ప్లాన్
ఇక ఔషధ ధరల వ్యవహారం. అమెరికాలో ఔషధ ధరలు 30 నుంచి 80 శాతానికి తగ్గించి తీరాల్సిందేనంటూ.. కార్యనిర్వాహక ఉత్తర్వు తెచ్చారు ట్రంప్. ఇది కూడా భారత్ కి వ్యతిరేకంగా పని చేసేదే. ఎందుకంటే అమెరికా మన నుంచి దిగుమతి చేసుకునే వాటిలో మెడిసిన్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. మొన్న కరోనా సమయంలో ట్రంప్ మనల్ని బెదిరించి మరీ మన మందులు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి భారత్ ను మరింత బాగా చూసుకోవాల్సింది పోయి.. మన నుంచి వచ్చే మందుల ధరలనూ తగ్గించాలని చూస్తున్నారు. ముప్పై నుంచి ఎనభై శాతానికి తమ ఉత్పత్తులు తగ్గించాల్సిందేనని.. ఆర్డర్ తీసుకురావడం అంటే అది భారత్ కి మరో షాక్ ఇవ్వడమేనంటున్నారు భారతీయ ఔషధ రంగ నిపుణులు.
తల్లిదండ్రులకు డబ్బు పంపినా పన్ను తప్పదు
ఇప్పటికే అమెరికాలోని ఎన్నారైలకు నిద్రలేని రాత్రులు తప్పడం లేదు. గోరుచుట్టు మీద రోకటిపోటులా.. అమెరికా నుంచి భారత్ కి డబ్బు పంపితే.. 5 శాతం పన్ను విధిస్తానంటున్నారు ట్రంప్. అక్కడి వారు తమ తల్లిదండ్రులకు డబ్బు పంపినా.. ఐదు శాతం నొక్కేస్తానంటున్నారు ట్రంప్.
ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట కొత్త పన్ను
ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ట్రంప్ సర్కార్. అందులో భాగంగా.. చూస్తే, అమెరికా నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపేవారిపై 5 శాతంపన్ను విధించేలా ఒక ఏర్పాటు. ఇది అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పాలిట పెను విఘాతంగా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ కుటుంబాలకు డబ్బు పంపేవారికి ఆర్ధికంగా పెద్ద నష్టం కానుందీ బిల్లు. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే ఆదాయాన్నిసరిహద్దు భద్రతా ప్రాజెక్టులకు వాడాలని భావిస్తున్నారు ట్రంప్.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు బిగ్ బిల్ పేరిట పన్ను పిడుగు
ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి బాద్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడి ఎన్నారైలకు కష్టాలు ఒకదాని వెంట మరొకటిగా వస్తూనే ఉన్నాయి. కఠిన ఆంక్షలతో విరుచుకుపడుతున్నారు. గ్రీన్ కార్డు ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా చేశారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత పెంచారు.