Trump Effect: రూపాయి ఢమాల్.. డాలర్ జోరు.. గత కొన్ని రోజులుగా ఇదే న్యూస్. లోకల్ గా, ఇంటర్నేషనల్ గా అసలు ఏం జరుగుతోంది? వన్ డాలర్ ఈక్వల్ టు హండ్రెడ్ రుపీస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదా? ఇలాంటి డౌట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఒక్క డాలర్ 87 రూపాయలతో సమానమైంది. ఇలా జరగడం వల్ల కొంత వరకు లాభం.. చాలా వరకు నష్టం. మరి రూపాయి వాల్యూ పెంచుకునేదెలా? ఆర్బీఐ యాక్షన్ ప్లాన్ ఏంటి?
డాలర్ చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. కొన్ని దేశాల్లో లోకల్ కరెన్సీ ఎన్ని కోట్లయినా ఒక్క డాలర్ ముందు దిగదుడుపే. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎవరైనా ఫారినర్స్ వెళ్తే లోకల్ కరెన్సీ కంటే డాలర్లే కావాలంటారు. అట్లుంటది డాలర్ తోని. ఇంటర్నేషనల్ గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా గిరాకీ పెరిగేది డాలర్ కే. యుద్ధాలైనా, రోగాలైనా.. పాండమిక్ అయినా, ఎండమిక్ అయినా.. ఏవైనా సరే అంతా అప్పుడు డాలర్, బంగారాన్నే నమ్ముకుంటారు. డాలర్ కు భద్రమైన, ఎక్కడైనా చెల్లే కరెన్సీగా నమ్మకం ఉండడం వల్లే ఇది జరుగుతోంది.
డాలర్‌ను వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలాంటి దేశాలకు వర్కవుట్ కావడం లేదు. అయితే డాలర్‌పై అతిగా ఆధారపడాల్సిన పరిస్థితిని మాత్రం తగ్గించుకునే రూట్లు వెతుక్కునే పనిలో భారత్ సహా మరికొన్ని దేశాలు ఉన్నాయి. అలా చేసినా ట్రంప్ కు కోపం పెరుగుతోంది. ఆల్టర్నేట్ కరెన్సీ కోసం చూస్తున్న దేశాలను టార్గెట్ చేసి మరీ ఎక్కడ కొట్టాలో అక్కడే గురి చూసి కొడుతున్నారు ట్రంప్. ఇదంతా ఇంట్రొడక్షన్ ఇప్పుడెందుకంటే.. డాలర్ తో పోలిస్తే రూపాయి క్షీణత ఆల్ టైమ్ లో కు పడిపోయింది. ఇది ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దాం.
రూపాయి వాల్యూ పెరగాలన్నా, తగ్గాలన్నా కంటికి కనిపించేవి, కనిపించని ఫ్యాక్టర్స్ ఎన్నో బ్యాక్ గ్రౌండ్ లో పని చేస్తూ ఉంటాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే.. డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గినా పరేషాన్… తగ్గకపోయినా పరేషాన్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే పడితే ఒకరికి లాభం. పెరిగితే మరొకరి భారం. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల మధ్య రూపాయి నలిగిపోతోంది. అందుకే ఇప్పుడు డాలర్ విలువ 87 రూపాయల 8 పైసలుగా నమోదైంది. ఇది రూపాయి చరిత్రలోనే ఆల్ టైమ్ లో. ఒక్క డాలర్ 87 రూపాయలు అంటే తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రంగంలోకి దిగాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.
అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ ఇంతలా తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ను అబ్జర్వ్ చేస్తోంది ఆర్బీఐ. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఒక డాలర్ వాల్యూ 90 రూపాయలకు చేరుతుందనీ అంటున్నారు. అలాగే సర్దుకుపోవడమా.. చక్రం తిప్పడమా అన్నది ఆర్బీఐ, మార్కెట్లు, ప్రభుత్వం చేతిల్లోనే ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఏ పని చేయాలన్నా డాలర్ల రూపంలోనే చేయాలి. సో మన రుపీస్ ను ఎక్కువగా ఖర్చు చేయాలి. దీంతో ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది.
ప్రెజెంట్ రుపీ సిచ్యువేషన్ ను కేంద్రం అబ్జర్వ్ చేస్తోంది. అమెరికా డాలర్ విలువ 87ను దాటినా ఎలాంటి టెన్షన్ అవసరం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే అంటున్నారు. రూపాయి చుట్టూ జరుగుతున్న ఫ్యాక్టర్స్ పై ఆర్బీఐ ఫోకస్ పెంచిందంటున్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి ఎందుకు ఇంత క్షీణిస్తోందన్న మ్యాటర్ పై ఫోకస్ పెట్టి కొన్ని విషయాలు గుర్తించారు. ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్ అమ్మేసి, నిధులు తీసుకెళ్లిపోతున్నారు. అందుకే రూపీ మారకపు రేటుపై ఒత్తిడి పెరుగుతోందంటున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా మారి ఉద్యోగ కల్పన పెరిగింది. నిరుద్యోగం తగ్గింది. సో అక్కడి వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లంతా అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతుండడంతో మనలాంటి దేశాల నుంచి ఇన్వెస్ట్ మెంట్స్ తీసేసి అక్కడ పెడుతున్నారన్న మాట.
గత నెల జనవరిలో ఏకంగా 48 వేల కోట్లు వెనక్కు పట్టుకెళ్లారు. దీంతో డాలర్ కు డిమాండ్ పెరిగి, రూపాయి డౌన్ అవుతోంది. అటు ముడి చమురు రేట్లు పెరగడం, దాంతో పాటే మన బిల్లు కూడా పెరిగి రూపాయిపైనే ఒత్తిడి పడుతోంది. ఇదే కాదు మనదేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. ఇది మరో కారణం. అటు రుపీ వాల్యూ తగ్గడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటుకు లేటెస్ట్ గా జవాబు ఇచ్చారు. రూపాయి విలువను మార్కెట్టే నిర్ణయించాలన్నారు. డాలర్‌తో పోలిస్తే, రూపాయి వాల్యూ ఇంతే ఉండాలన్న టార్గెట్ ఏమీ పెట్టుకోలేదన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ క్లియర్ గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారు.
డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ 87 రూపాయలకు చేరింది. అంటే ఇది ఆల్ టైమ్ రికార్డు. అంటే రూపాయి మరింతగా పతనం అవుతుందనడానికి సిగ్నల్స్ పంపింది. మరి ఇప్పుడు చేయాల్సింది చాలానే ఉంది. అలా వెయిట్ అండ్ సీ ఫార్ములా వర్కవుట్ కాదంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. వెంటనే రంగంలోకి దిగకపోతే రూపాయి సెంచరీ దాటుతుందంటున్నారు.
మనదేశం చమురు అవసరాల కోసం చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, యంత్ర పరికరాలనూ చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సిందే. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. అలా చేయడం వల్ల మన ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే దిగుమతి చేసుకునే వంట నూనెలు, సహజవాయువు, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు కొనాలన్నా చాలా మోతెక్కిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీని ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఫారిన్ కరెన్సీలో లోన్లు తీసుకున్న కంపెనీలకు భారం పెరుగుతుంది. వడ్డీ, అసలు తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది.
Also Read: 22 ఏళ్ల ఇండియన్ కుర్రాడి చేతిలో అమెరికా జాతీయ భద్రత.. అంతా మస్క్ మహిమ!
దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే వ్యాపార సంస్థల లాభాల్లో కోత పడుతుంది. ఖర్చులు తడిసిమోపెడవుతాయి. స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పవు. ఇవే కావు.. విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పంపే తల్లిదండ్రులపై భారం చాలా పెరుగుతుంది. యూనివర్సిటీ ఫీజులు, పిల్లల రోజువారీ ఖర్చుల కోసం ఎక్కువ రూపాయలు పెట్టి వాటిని డాలర్లుగా మార్చి పంపాలంటే తడిసి మోపెడవుతుంది. ఇది భారతీయ తల్లిదండ్రులకు పెను భారమే. లోన్లు, ఇతర అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుందన్న మాట.
డాలర్ తో రూపాయి విలువ తగ్గితే మన దేశం నుంచి వస్తువులు, సర్వీసెస్ ఎక్స్ పోర్ట్స్ చేసేవారికి మాత్రం లాభం జరుగుతుంది. మన దేశం నుంచి ఐటీ సేవల ఎగుమతులు చాలా ఎక్కువ. మెడిసిన్స్, వజ్రాభరణాలు, దుస్తులు, ఇంజినీరింగ్ విడిభాగాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఈ రంగాల కంపెనీలు మాత్రం ఎక్కువ ఆదాయాలు, లాభాలు నమోదు చేసే వీలుంటుంది. అంటే రూపాయి విలువ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు చాలా తక్కువ ధరలకు లభించి సరకులకు గిరాకీ పెరుగుతుంది.
అంటే బయటి వారు ఒక డాలర్ పెడితే ప్రస్తుత లెక్క ప్రకారం 87 రూపాయలకు ఇచ్చినట్లు లెక్క. ఆ లెక్కన మన వస్తువులు కొనే వారికి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అదే సమయంలో మన వాళ్లకు ఆర్డర్స్ కూడా పెరుగుతాయి. మరోవైపు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న మనవారు, మనదేశంలోని వారి కుటుంబీకులకు పంపే నగదు వాల్యూ పెరుగుతుంది. అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మనవాళ్లు 1150 డాలర్లు పంపితే ఇండియాలో అది లక్ష రూపాయల వాల్యూకు సమానం అన్న మాట. చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడి వాళ్లు పంపితే ఇక్కడి వారి సంబంధీకుల కొనుగోలు శక్తి పెరుగుతుంది.
ఫైనల్‌గా డాలర్ తో రూపాయి వాల్యూ తగ్గితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. అంటే ఎక్కువ మందిపై సరుకుల ధరలు పెరిగి ఎఫెక్ట్ చూపుతుందన్న మాట. అయితే డాలర్ కు ఆల్టర్నేట్ పేమెంట్స్ చేసేందుకు ఇండియా మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో రూపాయి కరెన్సీని ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలిపే ప్రయత్నాలు అంతగా వర్కవుట్ కావడం లేదు. అన్ని దేశాల బ్యాంకుల కరెన్సీ నిల్వల్లో 60 శాతం వాటా డాలర్లదే ఉంటుంది. ఆ నిల్వలు ఆయా దేశాల సొంత కరెన్సీల వాల్యూపైనా ఎఫెక్ట్ చూపుతాయి.
కేంద్ర ప్రభుత్వం రష్యా, యూఏఈలతో పాటు మరికొన్ని దేశాలతో రూపాయల్లో ట్రేడ్ మొదలుపెట్టింది. డాలర్‌పై ఆధారపడటం తగ్గితే డాలర్ నిల్వలను భారీగా మెయింటేన్ చేయాల్సిన పరిస్థితి తప్పుతుంది. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నా, అది అంతగా వర్కవుట్ కావడం లేదు. డాలర్, యూరోల మాదిరిగా రూపాయి అందరి ఆమోదం పొందకపోవడమే కారణం. భారత్‌కు భారీ వాణిజ్య లోటు కూడా ఉంది. దీంతో మన రూపాయి విలువపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతోంది. పైగా డాలర్‌ను వదిలేయడం రష్యా, చైనా వంటి వాటితో పోలిస్తే ఇతర దేశాలకు అనుకున్నంత ఈజీ కాదు.
రూపాయిని కాపాడుకోవాలంటే కేంద్రం చేయాల్సింది చాలా ఉంది. దేశంలోనే ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీస్ పెంచాలి. స్వదేశంలో పరిశ్రమలకు ఊతమివ్వాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. ఫారిన్ ఇంపోర్ట్స్ పై ఆధారపడడం తగ్గించాలి. దాంతో డాలర్‌కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగి వస్తుంది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలి. ఎందుకంటే మనం డాలర్లలో చెల్లింపులు ఎక్కువగా చేసేది చమురు కోసమే. ఇందుకోసమే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.
యూరో, యెన్, యువాన్ నిల్వలను పెంచుకుని డాలర్‌పై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి. రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇప్పటికే కొన్ని దేశాలతో ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి. అది రూపాయికి మంచి పరిణామమే. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలర్‌కు ఆల్టర్నేట్ గా చూసే దేశాలపై 100శాతం టారిఫ్ లు పెంచుతానంటున్నారు. ఇతర దేశాలతో రూపాయితో వాణిజ్యం జరపాలనుకుంటున్న భారత్ ఈ సవాల్ ను ఎలా ఎదుర్కొంటున్నది కీలకం. సో ఫైనల్ గా రూపాయి పతనాన్ని అడ్డుకోవటానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోంది. మరి ఎలాంటి ఎఫర్ట్స్ ఉంటాయో చూడాలి.