Akash Bobba Elon Musk| ఆకాశ్ బొబ్బ… ఈ కుర్రాడు ఎవరు? ఇప్పుడు ఇంటర్నెట్ అంతా అతని గురించే వెతుకుతోంది. ఎలన్ మస్క్ నేతృత్వంలో నడవబోయే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజె – DOGE) విభాగంలో ఈ భారతీయ సంతతికి చెందిన యువకుడికి చోటు దక్కింది. అందుకే అతని గురించి అందరూ ఆరా తీస్తున్నారు.
ఆకాశ్ బొబ్బ (Akash Bobba)… 22 ఏళ్ల యువ ఇంజినీర్. డోజె నిర్వహణ కోసం మస్క్ ఆరుగురు యువ ఇంజినీర్లను ఎంచుకున్నారు, అందులో ఆకాశ్ ఒకడు. అయితే, డోజెకు ఇతన్ని మస్క్ ఎంచుకున్నాడని తెలిసిన తర్వాత, లింక్డిన్ సహా ఎక్కడా అతని గురించి సమాచారం లేకుండా చేశారు. కానీ, ఇంతలో సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో అతని ప్రయాణం గురించి సమాచారం బయటకు వచ్చింది.
కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్, ఎంట్రాప్రెన్యూర్షిప్, టెక్నాలజీ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ చేశాడు ఆకాశ్. ఆ తర్వాత మెటాలో ఏఐ, పలాన్టిర్ లో డేటా అనలిటిక్స్, బ్రిడ్జ్‌వాటర్ అసోషియేట్స్ లో ఫైనాన్షియల్ మోడలింగ్ మీద కూడా ఇంటర్న్షిప్ చేశాడు. అయితే, అతని పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్న సందర్భంతో అతని మాజీ క్లాస్మేట్ ఒకరు ఆకాశ్ గురించి ఇప్పుడు నెట్ లో షేర్ చేసిన సమాచారం వైరల్ అవుతోంది.
Also Read: అమెరికా చైనా మధ్య సీరియస్ ట్రేడ్ వార్.. ఇండియాకు జాక్‌పాట్!
కాలేజీ రోజుల్లో బృందంలోని ఒక సభ్యుడి తప్పిదం వల్ల ప్రాజెక్టు మొత్తం డిలీట్ అయ్యిందట. సమయం పెద్దగా లేకపోవడంతో బృందం మొత్తం కంగారుపడుతోందంట. ఆ సమయంలో, ఆ రాత్రి రాత్రే సోర్స్ కోడ్ ఉపయోగించకుండానే తిరిగి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని, అంతకు ముందు కంటే బెటర్ గా రూపొందించాడు ఆకాశ్. ఆ సమయంలో అతని కోడింగ్ సామర్థ్యం చర్చనీయాంశమైందని అతని స్నేహితుడు చెబుతున్నారు.
ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు ఎలన్ మస్క్ (Elon Musk) సారథ్యంలో ఏర్పాటైన ఈ విభాగం. డోజె లో కీలక బాధ్యతల కోసం ఆకాశ్ తో ఆరుగురిని మస్క్ ఎంచుకున్నారు. అయితే, ఆకాశ్ తల్లిదండ్రులు ఎవరు? భారతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాళ్లంతా 19-24 ఏళ్లలోపు యువకులే. అందులో ఒక విద్యార్థి కూడా ఉన్నాడు. అయితే, ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం, మరియు కీలకమైన బాధ్యతలకు అనుభవం లేనివారిని ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులు ఉండాలనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, యూఎస్ ఎయిడ్ నుంచి కీలక సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారంటూ డోజె సిబ్బందిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక, ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు అంతిమం కాదని, వాటికి తమ అనుమతి తప్పనిసరి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది.
ఆకాశ్‌తో పాటు ఇథాన్ షావోత్రన్, ఎడ్వర్డ్ కొరిస్టీన్, గౌటియర్ కోల్ కిలియాన్, ల్యూక్ ఫారిటర్, గావిన్ క్లిగెర్‌ను కూడా డోజె ఉద్యోగులుగా నియమితులయ్యారు. వీరిలో షావోత్రన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్గలుగా సమాచారం. గతంలో మస్క్ కు చెందిన ‘ఎక్స్ ఏఐ’ నిర్వహించిన హ్యాకథాన్‌లో షోవోత్రన్ రన్నరప్‌గా నిలిచాడు.