TTD Board Members: చిన్న పాటి వివాదం చోటు చేసుకోగానే దానికి పొలిటికల్ కలర్ ఇచ్చి క్యాష్ చేసుకోవాలనుకున్నారు. టీటీడీలో ఐదు సంవత్సరాలుగా నోరు తెరవని ఉద్యోగ సంఘాలు వైసీపీ నేతల ప్రోద్భలంతో జూలు విదల్చాలని చూశాయి. ఉద్యోగుల ముసుగులో ప్రతిపక్ష నేతలు తమ చేతుల్లోకి ఉద్యమాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అటు పాలక మండలి సభ్యులకు, అధికారులకు , ఉద్యోగులకు రాజకీయ నాయకులకు ఎవరి పరిధి ఎంతో తెల్చి చెప్తూ సమస్య పరిష్కారం అయ్యింది. దాంతో ఆ వివాదాన్ని అస్త్రంగా చేసుకుని రచ్చరచ్చ చేద్దామనుకున్న వారి అశలు అడియాసలు అయ్యాయంట. అసలు తిరుమల కొండపై ఏం జరిగింది? ఆ లెక్క ఎలా సెటిల్ అయింది?
సంచలనం సృష్టించిన టీటీడీ సభ్యుడి దురుసు ప్రవర్తన
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల పాలక మండలి సభ్యుడి దురుసు ప్రవర్తన , చిరు ఉద్యోగి బాలాజీ సింగ్‌పై ఆయన విరుచుకుపడిన తీరు, వాడిన బాష దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాంతో ఎదో ఒక రకంగా అందరూ బాలాజీసింగ్‌కు మద్దతుగా వాయిస్ వినిపించారు. అయితే ఉదయం ఆ ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు టీటీడీ ఉద్యోగ సంఘాలలో చలనం రాలేదు. దానికి కారణం అయా సంఘాల వెనుక నాయకులేనంట. దాన్ని ఉద్యమంగా చేసి ప్రభుత్వానికి, పాలక మండలికి చెడ్డ పేరు తీసుకు రావాలనే కుట్రలో వారు పావులు అయ్యారనే ప్రచారం జరుగుతుంది.
ఘటన జరిగిన వెంటనే మీడియాలో హడావుడి
ఉదయం ఘటన జరిగిన వెంటనే మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో హడావుడి జరిగింది. టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకు తీరిగ్గా మీడియా సమావేశం పెట్టారు. మరి అంతవరకు వారేం చేశారో? అసలేం జరిగిందో దేవుడికే తెలియాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ అధికారులతో పాటు పాలక మండలి స్పందించింది. టీటీడీ విజిలెన్స్ విభాగం అక్కడ జరిగిన వివరాలను నమోదు చేసుకుంది. ఉద్యోగి బాలాజీ సింగ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకోవడంతో పాటు అక్కడ విధులలో ఉన్న సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. దాంతో పాటు సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు.
చొరవ తీసుకుని వ్యవహరించిన భానుప్రకాష్ రెడ్డి
మహాద్వార ప్రవేశం విషయంలో జరిగిన గొడవగా తేల్చి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరో వైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. చైర్మన్ బీఅర్ నాయుడు అదేశాల మేరకు సంప్రదింపుల వ్యవహారం మొదలు పెట్టారు. ముందు ఉద్యోగి కుటుంబంతో మాట్లాడారు. తర్వాత దుర్బాషలాడిన పాలక మండలి సభ్యుడి నరేష్‌కుమార్‌కి పరిస్థితి వివరించి అతను క్షమాపణ చెప్పాలని సూచించారు. పాలక మండలి చైర్మన్ తో పాటు మిగిలిన సభ్యులు కూడా అదే విషయాన్ని సదరు సభ్యుడికి గట్టిగా చెప్పారంట.
ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులు వంద మంది
అందోళన ప్రారంభించిన టీటీడీ ఉద్యోగులు పరిపాలనా భవనం మెట్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. అక్కడ ఉద్యోగికి క్షమాపణ విషయం కంటే ఇతర అంశాలు ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. వారిలోని అనెక్యత కూడా బయటపడింది. ముఖ్యంగా పరిపాలనా భవనానికి సంబంధించి 3వేల మందికి పైగా ఉద్యోగులు ఉంటే కేవలం వంద మంది మాత్రమే అందోళనలో పాల్గొన్నారు. గతంలో చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు రంగంలో దిగి హాడావుడి చేసాడు. ప్రధాన కార్యాలయం నుంచి రహదారి వరకు వచ్చి అందోళన చేసేలా ఉద్యోగులను ఉసిగొల్పాడు. ఇదే సమయంలో గత ఐదు సంవత్సాల గురించి ప్రశ్నిస్తే … అప్పుడంతా ఓకే ..మూడు నెలల నుంచే సమస్యలు మొదలయ్యాయని ప్రస్తుత ప్రభుత్వం పై అగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యపై సీరియస్ గా స్పందించిన సీఎంఓ
అయితే సమస్య పై సీఎంఓ సీరియస్ గా స్పందించడంతో.. అన్నమయ్య భవన్ లో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుల ముందు ఉద్యోగి బాలాజీకి దురుసుగా ప్రవర్తించిన సభ్యుడు నరేష్‌కుమార్ క్షమాపణ చెప్పాడు .. దాంతో వ్యవహారం ముగిసి వివాదం సమసినట్లు అయింది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు పలు అంశాల గురించి ప్రస్తావిస్తే ఈఓ ఒకే మాట అన్నట్లు తెలిసింది . ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులు అణచివేతకు గురైనప్పుడు ఒక్కరైనా నోరు తెరిచారా అని సీరియస్‌గా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక మిగతా అంశాల గురించి తాము చూసుకుంటామని.. ప్రస్తుత వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామని సూటిగా స్పష్టం చేయడంతో ఉద్యోగ సంఘాలు తలూపి వెళ్లిపోయాయంట.
పాలక మండలి సభ్యుడి వివాదాన్ని రచ్చ చేయడానికి కుట్ర
టీటీడీఉద్యోగ సంఘాల నాయకులు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏక పక్షంగా పని చేశారు. ఉద్యోగి అనే వాడు వ్యక్తిగతంగా తన రాజకీయ అభిమానం చాటుకోవచ్చు.. అయితే టీటీడీలో కొందరు ఉద్యోగ సంఘా నాయకులు తమ కింది ఉద్యోగులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. భూమన ఫ్యామిలీకి వీరవిధేయులుగా వ్యవహరించిన సదరు నాయకులు వైసీపీకే ఓటు వేయాలని ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో వత్తిడి కూడా తెచ్చారంట. అలాంటి నాయకుల కథలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతూ వారంతా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వివాదాలు ఎదుర్కొంటున్న వారంతా పాలక మండలి సభ్యుడి వివాదాన్ని అడ్డం పెట్టుకుని రచ్చ చేయాలని చూశారని.. చివరికి వారికి నిరాశే మిగిలిందని అంటున్నారు . ప్రస్తుత వివాదాన్ని వాడుకోని తమ అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించిన వారికి ఈఓ, పాలకమండలి చెక్ పెట్టిందంటున్నారు.
గత ఈఓ ధర్మారెడ్డిని నిలువుగా ముంచిన సలహాదారులు
అసలు అందరినీ బయో మెట్రిక్ నుంచి పంపాలనే నిర్ణయం ఎవరిది అనే అంశంపై చర్చ నడుస్తోంది. అది కొంతమంది సలహాదారులు పైత్యం అయి ఉంటుందని అంటున్నారు. గతంలో ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డికి సలహాదారులు ఇలాంటి సలహాలే ఇచ్చి .. అయన కొంప ముంచడమే కాక అప్పటి ప్రభుత్వాన్ని సైతం డ్యామేజ్ చేశారు. అందరినీ బయోమెట్రిక్ ద్వారా పంపి మహద్వారం ముందు మీడియా లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే సలహాదారులు అలాంటి సలహాలు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కుట్ర ప్రయత్నాలు విఫలమై వైసీపీ వర్గాల్లో నిరాశ
గతంలో కూడా తిరుమలలో మీడియాకు విభజన రేఖలు పెట్టి లేని పోని వ్యతిరేకతను గత ప్రభుత్వం మూట గట్టుకుంది. ఇప్పుడు కూడా మీడియా వారిని నియంత్రించే వ్యూహంలో భాగంగా ఇచ్చిన సలహా.. ఈ విధంగా వికటించిందనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఉన్నతాధికారులు ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇవ్వాలనే వాదన ఉంది. అయితే టీ కప్పులో తుపాన్ లాంటి ఇష్యూని సునామీగా మార్చాలని ప్రయత్నించిన వారికి చెక్ పెట్టడం సులభం అవుతుందంటున్నారు. మొత్తమ్మీద కొండపై ఇప్పటికీ వైసీపీ నేతల ప్రభావం కొనసాగుతున్న కనపడటం చర్చనీయాంశంగా మారింది.