కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందన్న పాక్
కశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్‌కు చేరుకోబోతుందా..? పరిస్థితులు చూస్తుంటే.. అలాగే కనిపిస్తోంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు భారత్ బుద్ది చెప్పే తరుణం ఆసన్నమయ్యింది. పాక్ ఆక్యూపైడ్ కశ్మీర్ కేంద్రంగా భారత్‌ను ఇబ్బందిపెట్టడానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగిస్తోంది. కశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కారించాలని పాక్ ప్రధాని ఇటీవల భారత్‌కు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో.. అసలు భారత్ ఏమనుకుంటుందో అనే సందేహం పాక్ మెదణ్ని తొలిచేస్తున్నట్లుంది.
కశ్మీర్ విషయంలో భారత్ మంచి చేసిందన్న జైశంకర్
తాజాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లండన్‌లో ఓ కార్యక్రమానికి అటెండ్ అవ్వగా.. అక్కడ ఒక పాకిస్తాన్ జర్నలిస్టు.. మంత్రి జైశంకర్‌ని ఉద్దేశించి ప్రశ్న అడిగారు. అయితే, ఈ ప్రశ్నలో పాక్ జర్నలిస్ట్ విచిత్రమైన వాదన చేశారు. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందని అన్నారు. అందుకే, కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, “కశ్మీర్‌పై శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటారా..? ప్రధాని మోడీ.. ట్రంప్‌కు మంచి స్నేహితుడే కాబట్టి, ఆ దిశాగా ఏదైనా ప్రయత్నాలు జరగొచ్చా..?” అంటూ పాకిస్తాన్ టోన్‌లో సదరు జర్నలిస్ట్ ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తారు. అయితే, జర్నలిస్ట్ ఉద్దేశం అర్థమైన మంత్రి జైశంకర్ అంతే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు.
మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించడం
లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ‘చాథమ్ హౌస్’లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఏంటనే అంశంలో మంత్రి జైశంకర్ ‘టిట్ ఫర్ ట్యాట్’లా సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ కాశ్మీర్ విషయంలో చాలా మంచి పనులే చేసిందని అన్నారు. అలాగే, కశ్మీర్‌లో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. అందులో మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించడమనీ.. కాశ్మీర్‌లో వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం రెండవ అడుగనీ.. భారీగా పెరిగిన ఓటింగ్‌తో ఇటీవల ఎన్నికలు నిర్వహించడం మూడవ అడుగని అన్నారు.
పీఓకేని భారత్‌కు తిరిగిస్తే కాశ్మీర్ సమస్య తీరినట్లేనని వెల్లడి
ఇక, చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన ‘కాశ్మీర్‌లోని దొంగిలించిన భాగాన్ని’ భారతదేశానికి తిరిగి ఇచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య “పరిష్కరించబడినట్లే” అని జైశంకర్ స్పష్టం చేశారు. “ఇదే అంతా ఎదురుచూస్తున్న భాగమనీ.. పీఓకే భారత్ ఆధీనంలోకి వచ్చేస్తే.. కశ్మీర్ సమస్య పరిష్కరించబడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని వెల్లడించారు.
“పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ భారతదేశంలో భాగం..
అయితే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి గతంలో బిజెపి మంత్రులు కూడా ఇలాగే స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్, పలువురు బడా నేతలు.. “PoK భారతదేశంలో భాగమనీ.. భారత్ దానిని తీసుకొని తీరుతుందని” అన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రమే కశ్మీర్ అంశంలో పరిష్కరించాల్సిన ఏకైక సమస్య అని భారత్ పలు సందర్భాల్లో చెప్పింది.
జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం భూభాగం భారత్‌లో అంతర్భాగం
జమ్మూ కాశ్మీర్‌లోని దాదాపు 78 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్న మాటను పదే పదే చెబుతోంది. 1994 పార్లమెంటు తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భారత్ వైఖరి స్పష్టంగా తెలియజేశారు. “జమ్మూ కశ్మీర్, లడఖ్‌కు సంబంధించినంత వరకూ మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి అని” పేర్కొన్నారు. అలాగే, “పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని” ఈ తీర్మానం పిలుపునిచ్చింది.
జైశంకర్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల తిరస్కరించిన పాక్
అయితే, మంత్రి జైశంకర్ లండన్‌లో తాజాగా చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుండి తీవ్రమైన స్పందన వచ్చింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. “మార్చి 5న భారత విదేశాంగ మంత్రి జమ్మూ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ తిరస్కరిస్తుందని అన్నారు. భారతదేశం గత 77 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్‌ను ఆక్రమిస్తుందనీ.. భారత్ ఆక్రమించిన ఆ ప్రాంతంలోని పెద్ద భూభాగాలను ఖాళీ చేయాలని” డిమాండ్ చేశారు.
77 ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను భారత్ ఆక్రమిస్తుందని ఆరోపణ
కట్ చేస్తే ప్లాష్ బ్యాక్‌లో ఇటీవల.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనికి విరుద్ధంగా శాంతి మంత్రం వల్లించారు. కశ్మీర్ అంశం సహా భారత్‌తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో చేసిన వాగ్దానాలను భారత్ నెరవేర్చి, చర్చలకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి ప్రారంభంలో.. “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం” సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పీఓకే భారతదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు
కశ్మీర్ యావత్తూ భారత భూభాగమని మంత్రి జైశంకర్ చెప్పడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని… ప్రతి భారతీయ రాజకీయ పార్టీ POK భారతదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోడానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఆ మధ్య, న్యూఢిల్లీలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన సంభాషణలో కూడా జైశంకర్ దీన్ని స్పష్టం చేశారు. “POK గురించి భారత పార్లమెంటు తీర్మానం విస్పష్టంగా వెల్లడించిందనీ.. అది మా జాతీయ నిబద్ధత” అని వెల్లడించారు. అలాగే, ఆగస్టు 2019లో కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి ప్రజలు ఆలోచించేలా చేసిందని అన్నారు.
ఆగస్టు 2019లో కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు
అయితే, POK భారతదేశంలో భాగమనే విషయాన్ని ప్రజలు “మరచిపోయేలా” చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయనీ.. దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటుందనీ.. POK తిరిగి స్వాధీనం చేసుకునే ముందు భారత ప్రజలకు దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటామని అన్నారు. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పాకిస్తాన్‌ను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని చెప్పలేకపోవడమే పరిస్థితిని ఇక్కడి వరకూ తెచ్చిందని కూడా బిజెపి మంత్రులు ఆరోపిస్తున్నారు. “ఇంటికి మంచి సంరక్షకులు లేకపోతే… బయటి నుండి దొంగలు పెరుగుతారంటూ” గతంలో మంత్రి జైశంకర్ సెటైర్లు కూడా వేశారు.
స్వతంత్రం తొలినాళ్లలోనే కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్
స్వతంత్ర భారతదేశం నుండి విడిపోయి, స్వతంత్ర దేశంగా ఏర్పడిందే పాకిస్తాన్. తర్వాత నాటి జమ్మూ కశ్మీర్ మహారాజులు ఈ ప్రాంతానికి భారత్ రక్షణ కావాలని కోరారు. తర్వాత పరిణామాల్లో పాకిస్తాన్ తన బుద్ధి చూపించింది. తూర్పు పాకిస్తాన్.. అంటే, బంగ్లాదేశ్‌తో పాటుగా.. కశ్మీర్‌ను కూడా భారత్ నుండి విడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించింది… ఇప్పటికీ, ప్రయత్నిస్తూనే ఉంది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే కశ్మీర్‌ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది పాక్. అందులో భాగంగానే కార్గిల్ యుద్ధం కూడా జరిగింది.
దొంగిలించిన భాగం తిరిగి భారతదేశానికి ఇచ్చేసిన తర్వాత..
అయితే, ఈ ఆక్రమిత భాగాన్ని భారత్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని పిలుస్తుంటే… పాకిస్తాన్ మాత్రం దాన్ని ఆజాద్ కశ్మీర్ అంటూ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ.. కశ్మీర్ నుండి కొంత భాగం పాకిస్తాన్ దొంగిలించింది అన్నది వాస్తవం. అయితే, దొంగిలించబడిన దాన్ని తిరిగి సొంతం చేసుకోవడం యజమాని హక్కు. దీన్ని పక్కన పెట్టి.. ‘నువ్వు దొంగిలించింది తిరిగి ఇచ్చేయమని’ దొంగనే అడగడం.. హాస్యాస్పదమని అంటున్నారు కొందరు. మంత్రి జైశంకర్ లండన్ చాథమ్ హౌస్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా అచ్చం ఇలాగే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శలు
భారతదేశం నుండి దొంగిలించబడిన భాగం తిరిగి భారతదేశానికి ఇచ్చేసిన తర్వాత ప్రాదేశిక వివాదం పరిష్కారమవుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యపై.. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారని అడిగారు. ఒకవైపు, భారత కేంద్ర ప్రభుత్వం వెంటనే పిఓకెను తిరిగి స్వాధీనం చేసుకోవట్లేదు.. అలాగే, చైనా ఆక్రమించిన భూభాగాల గురించి కూడా చర్చించట్లేదు అని అన్నారు.
కశ్మీర్‌లో కొంత భాగం చైనా ఆక్రమణ
“పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ భాగాన్ని తిరిగి తీసుకుంటామంటే.. దాన్ని ఎవరు ఆపుతున్నారు? దాన్ని తిరిగి తీసుకోవద్దని కశ్మీర్ ప్రజలు ఎప్పుడైనా చెప్పారా?” అని ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో కూడా భారతదేశానికి పీఓకెను తిరిగి స్వాధినం చేసుకునే అవకాశం వచ్చిందనీ.. కానీ, అలా చేయడంలో భారత్ ఎందుకు విఫలమైందని అబ్దుల్లా అడిగారు. ఇక, కేంద్రం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలోనే.. ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న జమ్మూ-కశ్మీర్ భాగాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఒమర్ అబ్ధుల్లా కోరారు.
కార్గిల్ యుద్ధంలోనే పీఓకెను తిరిగి స్వాధినం చేసుకునే అవకాశం
నిజానికి, కార్గిల్ యుద్ధం సమయంలో, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం భారత్‌కు వచ్చింది. అప్పుడు పాకిస్తానే ముందు భారత్‌పై దాడికి దిగింది. కాబట్టి, అదే వేడిలో భారత్ పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోడానికి ఇష్టపడితే.. ఇప్పుడు సమస్య ఇక్కడి వరకూ వచ్చేది కాదు. అప్పుడు కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే ఉంది. వారిని ఆపేవాళ్లు కూడా లేరు. కానీ, అలా జరగలేదు. కార్గిల్ వరకూ వెళ్లారు కానీ అంతకుమించి లోపలకి ఉన్న భారత భూభాగాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు..? ఈ ప్రశ్న జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా మాత్రమే అడిగింది కాదు. గతంలోనూ ఎంతో మంది ప్రశ్నించారు. ఇది పక్కన పెడితే.. జమ్మూ కశ్మీర్ మ్యాప్‌లో కొంత భాగం చైనా కూడా ఆక్రమించుకుంది. అది ఇప్పుడు చైనా నియంత్రణలోనే ఉంది. అయితే, దీని గురించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని సీఎం ఒమర్ అబ్ధుల్లా ప్రశ్నించారు.
మెరుగుపడుతున్న చైనా, భారత్ సంబంధం
అయితే, ఇటీవల చైనాతో భారతదేశ సంబంధం కాస్త మెరుగుపడుతుందని మంత్రి జైశంకర్ వెల్లడించారు. చైనా గురించి, మాట్లాడుతూ… టిబెట్‌లో కైలాస పర్వత తీర్థయాత్ర మార్గం ప్రారంభంతో సహా అక్టోబర్ 2024 నుండి జరిగిన కొన్ని పరిణామాలు చైనా-భారత్ సంబంధాలను మెరుగుపరుస్తున్నాయని అన్నారు. “ప్రపంచంలో రెండు బిలియన్లకు పైగా జనాభా కలిగిన ఏకైక దేశాలుగా చైనాతో మాకు చాలా, చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందనీ.. రెండు దేశాల ఆసక్తులను గౌరవించే, సున్నితత్వాలను గుర్తించే, ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండే సంబంధాన్ని భారత్ కోరుకుంటుంది” అని అన్నారు.
భారత సరిహద్దుకు దగ్గరగా గ్రామాలు నిర్మిస్తున్న చైనా
అయితే, చైనా మాత్రం దీనికి విరుద్ధంగా.. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్లు నడుచుకుంటోంది. సరిహద్దు సైనికుల్ని కాస్త వెనక్కి పంపినప్పటికీ.. టిబెట్ సమీపంలోని భారత సరిహద్దుకు దగ్గరగా చైనా గ్రామాలనే నిర్మిస్తోంది. అంతేనా, ఎయిర్ పోర్ట్‌లు.. చివరికి, బంకర్లను కూడా నిర్మిస్తోంది. వీటన్నింటిపై భారత విదేశాంగ శాఖ అన్నీ గమనిస్తున్నామని చెప్పడమే తప్ప.. చేసిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత, భారత్ ఆ ప్రాంతంలో మౌళిక సదుపాయాలను వేగవంతం చేస్తోంది.
ఏది ఏమైనప్పటికీ… గత దశాబ్ధ కాలంలో భారత్‌కు సరిహద్దు దేశాల వ్యవహారంలో ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. మాల్దీవుల నుండి నేపాల్ వరకూ ఒక రకమైన సమస్య ఉంటే… శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుండీ మరో రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక, పాకిస్తాన్, చైనాలు సందు దొరికితే భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోడానికి సరంజామాలు రెడీ చేసుకుంటూనే ఉన్నాయి. ఆర్థికంగా భారత్ పరుగులు పెడుతుంటే… రక్షణ రంగంలో అభివృద్ధి సాధిస్తుంటే… ఇంకోవైపు నుండీ… చైనా సహాయంతో పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. చైనా నుండి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తూ భారత్‌నే ఛాలెంజ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మాటలు చెప్పడాన్ని దాటి ఏదైనా చేయాలనే కామెంట్లు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. మరి, భారత్ దీనికి పరిష్కారం ఎలా సాధిస్తుందో చూడాలి.