Air India Elderly Passenger Injured| భారత విమానయాన సంస్థల్లో ఎయిర్ ఇండియా ప్రముఖమైనది. చాలా కాలం ప్రభుత్వ ఆధీనంలో ఈ ఎయిర్ లైన్స్ నష్టాల్లో ఉండడంతో దాన్ని లాభాల బాట పట్టించేందుకు టాటా సంస్థ దీన్ని హస్తగతం చేసుకుంది. అయితే ఎయిరిండియా విమాన సిబ్బంది ప్రయాణికులకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతోంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఒక వృద్ధ మహిళకు వీల్‌చెయిర్ సేవలు అందించకపోవడంతో ఆమె కిందపడి గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన గురించి ఆమె బంధువులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సిబ్బంది నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ఈ ఘటనతో ఎయిరిండియా విమానసంస్థ సేవలు వివాదాస్పదమయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. రాజ్ పశ్రీచా అనే 82 ఏళ్ల వృద్ధురాలు.. ఒక మాజీ సైనికాధికారి భార్య. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఎయిరిండియా విమానంలో ప్రయాణించాలని టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలు ఉండడంతో ఆమె తన కోసం ఒక వీల్‌చెయిర్ ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. అయితే.. ఢిల్లీ విమానాశ్రయంలో వెళ్లాక ఒక గంటకు పైగా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. వీల్ చైర్ అడిగినా స్పందించలేదు. చివరికి ప్రయాణం చేయాలని ఆమె తన కుటుంబ సభ్యుల సహాయంతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా.. కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి.
Also Read: రన్యారావును పోలీసులు కొట్టారా?.. ఆగ్రహించిన మహిళా సంఘాలు
ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్త స్రావమైంది. అంత జరిగినా.. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ సహాయం చేయలేదని, తామే మెడికల్ కిట్ కొని ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నామని ఆమె బంధువులలో ఒకరైన పరుల్ కన్వర్ (Parul Kanwar) అనే మహిళ తెలిపారు. సాయం కోసం చాలా సేపు ఎదురు చూశాక.. అప్పుడు సిబ్బంది వీల్‌చెయిర్ తీసుకువచ్చారని.. అలా గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకువెళ్లామని పరుల్ తెలిపారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఆమెకు వైద్య సేవలు అందించబడ్డాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. రాజ్ పశ్రీచా శరీరంలో ఎడమ వైపు పక్షవాతం సోకడంతో మెదడులో రక్తస్రావం జరిగిందేమోనని వైద్యులు అనుమానిస్తున్నారని పరుల్ తెలిపారు.
ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరుల్.. “మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి” అని ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ఫిర్యాదు చేసినట్లు, చర్యల కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తెలిపారు.
అయితే, పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని, బాధితురాలు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నామని ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు పూర్తి కాకముందే తాను ఎయిరిండియాతో ఏవిధమైన చర్చలు చేయనని పరుల్ తేల్చి చెప్పారు.