E-Paper
Advertisement

Upasana Vs Sridhar: పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? శ్రీధర్ Vs ఉపాసన.. ఎవరు చెప్పింది నిజం?

Upasana Vs Sridhar: పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? శ్రీధర్ Vs ఉపాసన.. ఎవరు చెప్పింది నిజం?
Advertisement

Upasana Vs Sridhar: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో తీరాల్సిన ముచ్చట! కానీ.. చాలా మందిలో పెళ్లిపై రకరకాల అభిప్రాయాలున్నాయ్. అసలు.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? లైఫ్‌లో సెటిలయ్యాక చేసుకోవాలా? లేక.. పెళ్లిని కెరీర్‌తో ముడిపెట్టడం కరెక్ట్ కాదా? పెళ్లి విషయంలో ఉపాసన మాట వినాలా? జోహో సీఈవో శ్రీధర్ చెప్పింది ఫాలో కావాలా? వీళ్లిద్దరి అభిప్రాయాలపై.. జనం ఏమనుకుంటున్నారు? పెళ్లి మీద ఇంటర్నెట్‌లో నడుస్తున్న లొల్లేంటి?

ఏ వయసులో ముచ్చట.. ఆ వయసులో తీరాలంటారు. అది.. పెళ్లయినా, పిల్లలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా. అలా ఎందుకంటారో.. ఏజ్ దాటిపోతున్నా పెళ్లి కాని వాళ్లకు బాగా తెలుస్తుంది. కానీ.. ఇప్పుడు లేట్ మ్యారేజీలే బెటరని.. లైఫ్‌లో సెటిలయ్యాకే పెళ్లిళ్లనే చర్చ మొదలైంది. అయితే.. సంస్కృతి, సంప్రదాయాల పునాదులపై నిర్మితమైన భారత సమాజంలో.. వయసులో ఉండగానే పెళ్లి ముచ్చట తీరాలనేది.. గట్టిగా నమ్ముతారు. అందుకే.. 30 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. కానీ.. నేటి యువతరం.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

Advertisement

ముందు.. ఉద్యోగం రావాలంటున్నారు. తర్వాత.. మంచి ప్యాకేజ్ కావాలంటున్నారు. లైఫ్‌లో సెటిలవ్వాలంటున్నారు. ఇదంతా జరిగే సరికి.. ముప్ఫైలు, నలభైలు దాటేస్తున్నారు. అప్పుడు.. పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. కెరీర్ వెంటపడి.. మంచి వయసులో ఉండగా పెళ్లి చేసుకోవడం లేదు. వయసుమీద పడ్డాక.. తోడు అవసరం తెలిశాక.. పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అయినాసరే.. చాలా మందిలో పెళ్లిపై భిన్నవాదనలున్నాయ్. కొందరు వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలంటే.. ఇంకొందరు కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి బెటరని ఉచిత సలహాలు ఇస్తున్నారు. హీరో రాంచరణ్ భార్య ఉపాసన.. పెళ్లిపై చేసిన కామెంట్స్.. ఇంటర్నెట్‌లో ఇంట్రస్టింగ్ డిబేట్‌కు దారితీసింది. ఆమె చేసిన ట్వీట్‌పై.. పెద్ద రచ్చే నడుస్తోంది.

సోషల్ యాక్టివిటీస్‌లో ఉపాసన ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. మహిళా సాధికారత గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉపాసన స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. యూత్‌లో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి.. ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చాలా మంది స్టూడెంట్స్ చేతులెత్తి.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలియజేశారు. అలా.. చెయ్యెత్తిన వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారని.. అమ్మాయిలు తక్కువమంది ఉన్నారని ఉపాసన ట్వీట్ చేశారు. దీనిని బట్టి.. మహిళలు కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ఇది.. న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా అంటూ వర్ణించారు. ముందుగా.. మీ విజన్ సెట్ చేసుకోండి. తర్వాత.. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లండి అని అమ్మాయిలకు సలహా ఇచ్చారు ఉపాసన.

Advertisement

అయితే.. ఉపాసన చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయ్. తన స్పీచ్‌కు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. అమ్మాయిలు.. వయసులో ఉండగానే తమ అండాలను దాచుకోవాలని ఉపాసన సూచించారు. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలనేది నిర్ణయించుకోవచ్చన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం లభించాకే.. పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాతే పిల్లల్ని కనాలని ఉపాసన చెప్పారు. ఇలా.. అమ్మాయిలు తమ అండాలను దాచుకోవాలన్న వ్యాఖ్యలపై.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనే వాదనతో విభేదిస్తున్నారు. ఉపాసన 23 ఏళ్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని.. ఇప్పుడు మహిళలు కెరీర్‌పై ఫోకస్ చేయాలని సలహాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

ఇక.. ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళలకు ఇన్సూరెన్స్ కాదంటున్నారు. ఒకవేళ మహిళలు తమ అండాన్ని దాచుకున్నా.. అది విజయవంతమైన గర్భధారణగా మారుతుందన్న గ్యారంటీ లేదంటున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెడితే.. ఆమె ఆరోగ్యం, మిగతా బంధాలపై దృష్టి పెట్టే సమయం ఉండకపోవచ్చంటున్నారు. అలాంటప్పుడు.. అండాన్ని దాచుకోవడం వల్ల ఉపయోగమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకోసం.. వివాహం, కెరీర్ సమాంతరంగా ఉండొద్దని అడుగుతున్నారు. ఉపాసన 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు.. ఆమె ఎలాంటి కెరీర్ కలిగి ఉందని క్వశ్చన్ చేస్తున్నారు. పెళ్లైన తర్వాతే.. ఆమె తన కెరీర్ బిల్డ్ చేసుకుంది కదా! అని గుర్తు చేస్తున్నారు. పైగా.. ఉపాసన సగటు మహిళ కాదని.. మిగతా మహిళలు ధనవంతులను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఈ స్టేట్‌మెంట్ ద్వారా.. ఉపాసన అపోలో ఐవీఎఫ్ సెంటర్లని సేల్‌కి పెట్టిందని కామెంట్ చేస్తున్నారు. అండాలని దాచుకోండి.. వాటి నిర్వహణకు డబ్బులు చెల్లించండి అని మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ఉందంటున్నారు. అంతేకాదు.. గర్భధారణకు హామీ ఇవ్వని ఐవీఎఫ్ విధానాన్ని ఫాలో అవమని చెబుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఉపాసన వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని.. ఆమె చెప్పిన మాటలు కేవలం ఉన్నత వర్గాలకే వర్తిస్తుందంటున్నారు. అపోలో ఫెర్టిలిటీ బిజినెస్ పెంచుకునేందుకు.. ఉపాసన ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మరో నెటిజన్ మండిపడ్డారు. అపోలో ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ బిజినెస్‌ కోసమే.. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, కెరీర్, గోల్స్ అంటూ మాట్లాడుతున్నారని.. ఈ మాయలో అమ్మాయిలు పడొద్దని సూచిస్తున్నారు. పెళ్లయ్యాక.. భర్త సాయంతో ఉన్నత స్థఆనాలకు చేరుకున్న మహిళలు చాలా మందే ఉన్నారంటున్నారు. కెరీర్ ముఖ్యమే అయినప్పటికీ.. దాని కోసం దేనిని వాయిదా వేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన పోస్ట్ చేసిన వీడియోకు.. పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయ్.

ఉపాసన చెప్పింది కాసేపు పక్కనపెడితే.. అసలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పటికీ.. పెళ్లి కాని నైంటీస్ కిడ్స్‌ చాలా మందే ఉన్నారు. జెన్‌జీ కిడ్స్ మాత్రం అప్పుడే పెళ్లేంటి బ్రో అంటూ.. లైట్ తీసుకుంటున్నారు. మరి.. కెరీర్, లైఫ్, సెటిలవడం లాంటివన్నీ పూర్తయ్యాకే పెళ్లి అంటే.. అందరికీ వర్కవుట్ అవుతుందా? యువతరం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల.. ఆ ఎఫెక్ట్ వారితో పాటు దేశంపైనా ఉంటుందా? పెద్దలు చెప్పినట్లు వయసులో ఉన్నప్పుడే పెళ్లి ముచ్చట తీరిపోవాలా?

పెళ్లి గురించి ఉపాసన చెప్పిన మాటలపై.. రకరకాల రియాక్షన్లు వస్తున్నాయ్. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కూడా ఉపాసన కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. ఆవిడ కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోమంటే.. జోహో శ్రీధర్ మాత్రం పెళ్లి చేసుకున్నాక కూడా ఈ పనులన్నీ చేయొచ్చంటున్నారు. వయసులోఉండగానే అంతా పెళ్లి చేసుకోవాలని.. ఇది అందరి బాధ్యత అని ట్వీట్ చేశారు. తనని కలిసే యువ పారిశ్రామికవేత్తలు.. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కలిగి ఉండాలని సలహా ఇస్తానని తెలిపారు.

పెళ్లి, పిల్లలను.. వేటి కోసం వాయిదా వేయొద్దని చెబుతానన్నారు. సమాజం పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న జనాభా బాధ్యతను.. యువతరం నిర్వర్తించాల్సిందేనని ట్వీట్ చేశారు. ఈ రకమైన ఆలోచనలు కాస్త పాతకాలపు భావాల్లా అనిపించొచ్చు కానీ.. ఇవి మళ్లీ ప్రజల్లో ప్రతిధ్వనిస్తాయని నమ్ముతున్నానని.. ఉపాసన ట్వీట్‌కు రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇచ్చారు. శ్రీధర్ వెంబూ సలహాపైనా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. యువత వివాహాలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం.. ఆర్థిక ఒత్తిళ్లే అని కామెంట్ చేస్తున్నారు. ఒక్కోతరం దృష్టిలో బాధ్యతకు ఒక్కో అర్థం ఉంటుందని, కొందరు కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తే.. ఇంకొందరు కెరీర్ ముఖ్యమనుకుంటారని చెబుతున్నారు.

ఏదేమైనా.. ఈ తరం యువతలో పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో ఏ ఒక్కరి దగ్గర క్లారిటీ లేదు. వ్యక్తిగత ఎదుగుదల, కెరీర్ గోల్స్, ఆర్థిక స్థిరత్వం, సామాజిక మార్పులు, సంప్రదాయాల ప్రభావం మధ్య.. యువత నలిగిపోతోంది. గడిచిన కొన్ని దశాబ్దాలతో పోలిస్తే.. ఇప్పుడు ఇండియాలో పెళ్లి వయసు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం చట్ట ప్రకారం పురుషులకు కనీస వయస్సు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలుగా ఉంది. స్త్రీల కనీస వివాహ వయస్సు కూడా 21కి పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. కానీ.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. భారత్‌లో సగటు వివాహ వయస్సు.. పురుషులకు సుమారు 28 ఏళ్లు, స్త్రీలకు సుమారు 25 ఏళ్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. ఈ ఏజ్ లిమిట్ 30 దాకా ఉంది. ప్రస్తుతం.. పెళ్లి విషయంలో 90ల్లో పుట్టిన వాళ్లంతా 30 ఏళ్లు దాటినవారు, 30 ఏళ్లకు దగ్గరగా ఉన్న వాళ్లు ఉన్నారు. వీరిపై.. కుటుంబ ఒత్తిళ్లు, కెరీర్, సెటిల్మెంట్ గోల్స్‌ని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతున్నారు. ఇక.. జెన్‌జీ కిడ్స్ కెరీర్, ఫ్రీడమ్, వ్యక్తిగత ఎదుగుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పుడే.. పెళ్లేంటి బ్రో అనే ధోరణి వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల.. ఉద్యోగంలో స్థిరపడటానికి, ఆర్థిక స్థిరత్వానికి, పిల్లల్ని పెంచడానికి మానసికంగా టైమ్ దొరుకుతుంది. ఇదే సమయంలో.. స్త్రీలలో 30 ఏళ్లు దాటక, పురుషుల్లో 40 ఏళ్లు దాటాక.. సంతానోత్పత్తి, గర్భధారణ, జన్యుపరమైన సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. కుటుంబం నుంచి, బంధువుల నుంచి వచ్చే.. ఏంటి ఇంకా పెళ్లి కాలేదా? అనే క్వశ్చన్.. మానసికంగా మరింత ప్రెజర్ పెంచుతుంది. సరైన వయసులో పెళ్లి ముచ్చట తీరితో.. ఆలస్యం కాకుండా పిల్లల్ని కంటే.. వయసు మీద పడే నాటికి పిల్లలు చేతికొస్తారని చెబుతుంటారు పెద్దలు. 40ల్లోకి వచ్చేసరికి.. పిల్లలు ఉద్యోగాలు చేసే స్థితిలో ఉంటే.. అంతా బాగుంటుందనే చర్చ ఉంది. ఇక.. యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ.. అది దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది.

Also Read: ఏపీలో హిడ్మాకి ఏం పని.. పోలీసుల ట్రాప్‌లో ఎలా పడ్డాడు?

పెళ్లిళ్లు ఆలస్యమైతే.. జంటలు పిల్లల్ని కనేందుకు తక్కువ టైమ్ ఉంటుంది. దీనివల్ల.. దేశంలో జననాల రేటు తగ్గుతుంది. దీర్ఘకాలంలో యంగ్ వర్క్ ఫోర్స్ తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయే పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల.. పెళ్లిళ్లు చేసుకొని కూడా సక్సెస్ అయిన వాళ్లెందరో ఉన్నారనే కామెంట్లు, ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయ్. కొందరు యువత పెళ్లిని పూర్తిగా దాటేయడం, లివిన్ రిలేషన్స్‌ని ఎంచుకోవడం వల్ల.. సంప్రదాయా వైవాహిక వ్యవస్థ విలువ మారిపోతుంది. అందువల్ల.. సామాజిక ఒత్తిడికి లొంగిపోకుండా, కేవలం.. కెరీర్ కోసమే ఆలస్యం చేయకుండా.. మీ గోల్స్, వైవాహిక జీవిత బాధ్యతలకు మధ్య సమతుల్యత సాధించి.. వివాహం చేసుకోవడం ఉత్తమం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Story By Anup, Bigtv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×