Coal Mine Accident: ఝార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
ప్రమాద స్థలంలో గందరగోళ పరిస్థితులు
రామ్‌గఢ్ జిల్లాలోని మాండు ప్రాంతంలో ఈ బొగ్గు గని ఉండగా, ఇది అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు సమాచారం. శనివారం ఉదయం ఈ గనిలో మట్టి కదలడంతో ఒక్కసారిగా పై భాగం కూలిపోయింది. ఆ సమయంలో లోపల ఉన్న కార్మికులు.. కొంతమంది బయటకు పరుగులు తీశారు. కానీ నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొందరు గనిలో చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు.
అనుమతులు లేకుండా గని నిర్వహణ
పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఈ గనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా దీనిని నడుపుతున్నట్లు వెల్లడైంది. గనిలో భద్రతా పాటించకపోవడమే ఈ విషాదానికి కారణమయ్యే అవకాశముంది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సహాయచర్యలు కొనసాగుతున్నాయి
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సహాయంతో.. గనిలో చిక్కుకున్న కార్మికులను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. అయితే, గనులు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. సహాయక చర్యలు మెల్లగా సాగుతున్నాయి. ప్రమాదం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి.. ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read: మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను చంపిన భార్య
ప్రజల్లో ఆందోళన
ఈ ప్రమాదంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి అనుమతులులేని గనులు ఇంకా పలు చోట్ల నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై.. ఇటువంటి అక్రమ గనులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.