రిపబ్లికన్లకు సెనేట్‌లో మెజారిటీ.. పాపులర్ ఓట్లలో ముందంజ
అమెరికాలో ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారు అయినప్పటికీ.. ఇంకా.. మరో రెండు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. స్వింగ్ స్టేట్స్‌లో కీలకమైన నెవాడా, అరిజోనాల్లో కమల హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు వస్తారనేది తేలాలి. అయితే, ఈ రెండు రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను రిపబ్లికన్లు గెలిస్తే, ట్రంప్ మొత్తం ఏడు స్వింగ్ రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసినట్లే లెక్క. ఇప్పటికే, రిపబ్లికన్లకు సెనేట్‌లో మెజారిటీని ఉండగా.. పాపులర్ ఓట్లలో కూడా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఆరు సీట్ల తక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ.. అక్కడ కూడా ట్రంప్‌దే పైచేయిగా ఉంది.
ఇది ట్రంప్ కీలక విధానాలను అమలు చేయడానికి మరింత బలాన్ని ఇస్తుంది. అందుకే, రాబోయే రోజుల్లో నాటో కూటమి నుండి బయటకు వచ్చేసే ప్లాన్ చేసినా.. అమెరికా వీధుల్లో నిరసనలు అణిచేయడానికి సైనిక బలగాలను మొహరించినా.. ట్రంప్‌కు ఎలాంటి అడ్డంకి లేకుండా చేస్తుంది. నిజానికి, ట్రంప్ తీసుకునే ఇలాంటి నిర్ణయాలపై పెంటగాన్ నుండి వ్యతిరేకత వస్తుందన్నది స్పష్టం. అందుకే, ట్రంప్ తనకు అనుకూలమైన వారిని తీసుకోవడం కోసం పెంటగాన్ ఉన్నతాధికారుల్లో మార్పులు చేస్తారనే అభిప్రాయానికి కారణం అయ్యింది.
సెనెట్ సమ్మతి లేకుండా అనుకూలమైన వారిని నియమించుకునే ప్లాన్
తనకు ఇష్టం వచ్చినట్లు పాలన చేయడానికి సిద్ధపడిన ట్రంప్ ఇప్పుడు కేబినెట్ నియామకాలలో కూడా తన స్టాంప్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సెనెట్ సమ్మతి లేకుండానే తనకు అనుకూలంగా ఉండే అధికారుల్ని నియమించుకునే హక్కు ఇవ్వాలని రిపబ్లికన్ చట్టసభ్యులను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను కూడా మార్చాలని ట్రంప్ మొండిపట్టు పడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం, కేబినెట్, జ్యుడిషియల్ పోస్టులకు ఎవరినైనా అధ్యక్షుడు నామినేట్ చేస్తే దానికి సెనెట్ అనుమతి పొందడం తప్పనిసరి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఈ సెనెట్ ఓటింగ్‌ను కాదనే అధికారం కూడా ఉంటుంది. ట్రంప్ కూడా ఈ అధికారాన్నే వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా, తన పాలనలో డెమోక్రాట్ల జోక్యం చేసుకోకుండా ఏకపక్షంగా పాలించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఆందోళనలు పెరిగాయి.
ట్రంప్ టార్గట్ లిస్ట్‌లో కొందరు నల్లజాతి ఉన్నతాధికారులు
ట్రంప్ 2.0 టార్గెట్ లిస్ట్‌లో తాను గతంలో విమర్శించిన మాజీ యుఎస్ జనరల్స్, డిఫెన్స్ సెక్రటరీలు ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వీళ్లలో కొందరు ట్రంప్‌ని ఫాసిస్ట్ అని పిలవగా.. ఇంకొందరు, ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించారు. వీళ్లపై అప్పట్లో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. తన మాజీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లీని దేశద్రోహ నేరం కింద ఉరితీయాలని వ్యాఖ్యానించారు. అయితే, ఈ లిస్ట్‌లో కొందరు నల్లజాతికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, రాబోయే ట్రంప్ పాలనలో అమెరికా వ్యాప్తంగా కల్చరల్ వార్ జరుగుతుందని కొందరు విశ్లేషకులు ఇప్పటికే వెల్లడించారు. దానికి తగ్గట్లే, ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్‌ని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మిలటరీ ర్యాంక్‌లలో వివక్ష గురించి బ్రౌన్ వీడియో మెసేజ్
నిజానికి, బ్రౌన్, అమెరికా వ్యాప్తంగా ఉన్నతంగా గౌరవించబడిన మాజీ ఫైటర్ పైలట్. రాజకీయాలకు దూరంగా ఉండే కమిటెడ్ సైనిక కమాండర్‌గా పేరున్న వ్యక్తి. నల్లజాతీయుడైన బ్రౌన్ అమెరికాలో అత్యంత ఉన్నత స్థాయి ఫోర్-స్టార్ జనరల్. మే 2020లో మిన్నియాపాలిస్‌లో ఒక వైట్ పోలీసు ఆఫిసర్, బ్లాక్ అయిన జార్జ్ ఫ్లాయిడ్‌ను హత్య చేసిన తర్వాత అమెరికా వ్యాప్తంగా జాతి వివక్షపై వచ్చిన విమర్శలకు బ్రౌన్ సంచలన సమాధానం ఇచ్చారు. మిలటరీ ర్యాంక్‌లలో వివక్ష గురించి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. యూఎస్ మిలిటరీలో అన్ని జాతులు సమానంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటూ పేర్కొన్నారు.
Also Read: ఉక్రెయిన్ వర్సెస్ రష్యా.. ట్రంప్ వార్ డీల్?
అయినప్పటికీ, బ్రౌన్‌ను తీవ్రంగా విమర్శించారు ట్రంప్. ట్రంప్‌కు కాబోయే వైస్ ప్రెసిడెంట్ జెడి.వాన్స్ కూడా బ్రౌన్‌ను వ్యతిరేకించారు. గతేడాది, యూఎస్ మిలిటరీ అధికారిగా బ్రౌన్‌ను ఎన్నుకునే క్రమంలో నాడు సెనేటర్‌గా ఉన్న జెడి.వాన్స్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక విధంగా, పెంటగాన్‌లో ట్రంప్ ఆదేశాలను ప్రతిఘటించే అధికారుల్లో బ్రౌన్ కూడా ఉంటారని గతంలోనే జెడి.వాన్స్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వంలోని వ్యక్తులు విధేయత చూపకపోతే, వారిని తొలగించాలనీ.. ప్రెసిడెంట్ ఏంచేయాలని ప్రయత్నిస్తున్నారో దానికి అనుకూలంగా ఉండే అధికారులే ఆ స్థానాల్లో ఉండాలని వాన్స్ ఎన్నికల ముందే స్పష్టం చేశారు.
సరిహద్దులో అదనపు యాక్టివ్-డ్యూటీ దళాలను పంపే అవకాశం
ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ సైనిక కార్యకలాపాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు పెంటగాన్‌లో అధికారులంతా నమ్ముతున్నారు. సరిహద్దులో కస్టమ్స్, సరిహద్దు రక్షణకు సహాయంగా అదనపు యాక్టివ్-డ్యూటీ దళాలను పంపే అవకాశం ఉందని అనుకుంటున్నారు. యాక్టివ్ డ్యూటీ, నేషనల్ గార్డ్, రిజర్వ్‌లతో సహా సరిహద్దు వద్ద ఇప్పటికే వేలాది మంది బలగాలు ఉన్నాయి. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గతేడాది 15 వందల యాక్టివ్ డ్యూటీ ఫోర్స్‌లను అక్కడకు పంపింది.
ఇప్పుడు ట్రంప్ దాని కంటే అధికంగా దళాలను అక్కడ మొహరిస్తారనీ.. ముఖ్యంగా అక్రమ వలసలను నిరోధించడానికి భారీగా సైన్యాన్ని వాడతారని తెలుస్తోంది. రాష్ట్రలకు సరిపడా మ్యాన్ పవర్ లేదనీ, హెలికాప్టర్లు, ట్రక్కులు, కాంబాట్ సామర్థ్యాలు లేవని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. అయితే యాక్టివ్ డ్యూటీ బలగాలను అమెరికా వీధుల్లోకి పంపే నిర్ణయాన్ని మాత్రం పెంటగాన్ తేలికగా తీసుకోలేమని చెబుతోంది. ఇది, దేశంలో అంతర్గత కలహాలను విపరీతంగా పెంచుతాయని విమర్శిస్తోంది. సరిహద్దు మిషన్ కోసం వేల మంది సైనికులను అక్కడికి పంపితే.. ఇది విదేశీ బెదిరింపులను ఎదుర్కోవటానికి సైన్యం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఫెడరల్ ఉద్యోగులను రక్షించే గార్డ్‌రైల్‌లను బలోపేతం
రాబోయే ట్రంప్ పాలన తమకు చేటు చేయబోతుందని ఊహించిన పెంటగాన్ ఉన్నతాధికారులు కొందరు ఇప్పటికే దాన్ని నివారించే చర్యలు చేపట్టినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని పాలసీ మార్పులను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ, ట్రంప్, షెడ్యూల్ ఎఫ్‌ని జారీ చేస్తే… పెంటగాన్, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఆ వర్గంలోకి ఏ ఉద్యోగులను తరలించాలో జాబితాలను రూపొందించే పనిలో ఉన్నాయి. అందులో, వీలైనంత తక్కువ మంది ఉద్యోగులు వచ్చేలా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఫెడరల్ ఉద్యోగులను రక్షించే గార్డ్‌రైల్‌లను బలోపేతం చేయడానికి, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ ఆఫ్ పర్సనల్ అండ్ మేనేజ్‌మెంట్ ఒక నియమాన్ని కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే, మిలిటరీని రాజకీయంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కూడా యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పదే పదే హెచ్చరించారు. అలాగే, యూఎస్ మిలిటరీ చట్టబద్ధమైన ఆదేశాలను మాత్రమే పాటిస్తుందనీ కూడ ఆస్టిన్ అన్నారు. ఈ మాటలు స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ రాబోయే పాలనను ఉద్దేశించి వచ్చాయని అమెరికా వ్యాప్తంగా చర్చలు జరిగాయి.