US Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు, ఇండియా అల్లుడు.. జెడీ వాన్స్, మొదటిసారి అధికారికంగా భారత పర్యటనకు వచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో తన ముగ్గురు పిల్లలు భారత్ గడ్డపై అడుగుపెట్టగా.. యావత్ భారతదేశం వాన్స్ పర్యటనపై చర్చిస్తోంది. ప్రపంచమంతా ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంతో అయోమయంలో పడగా.. ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య ఎలాంటి డీలింగ్స్ ఉంటాయో అనే ఆసక్తి పెరిగింది. అయితే, ట్రంప్ తెంపరితనానికి ఏ మాత్రం తీసిపోని వాన్స్ వైఖరిని.. ప్రధాని మోడీ చాకచక్యంగా ఎలా డీల్ చేయనున్నారు..? ఉపాధ్యక్షుడు వాన్స్ టూర్‌కు ఎందుకింత ఇంపార్టెన్స్..? కుదుర్చుకోబోతున్న డీల్స్ ఏంటీ..?
ఏప్రిల్ 21 నుండి 24 వరకూ జెడి వాన్స్ భారత్ పర్యటన
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జెడి వాన్స్ తన సతీమణి ఉషా చిలుకూరి వాన్స్, తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. వాన్స్ ఉపాధ్యక్ష పదవిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇది తొలి భారత పర్యటన. ఏప్రిల్ 21 నుండి 24 వరకూ.. నాలుగు రోజుల పాటు సాగనున్నఈ పర్యటనలో వాన్స్ కుటుంబం ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాలను సందర్శించనున్నారు. ఏప్రిల్ 21న.. జెడి వాన్స్ కుటుంబంతో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌లో దిగగా.. కేంద్ర సీనియర్ కాబినెట్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వాగతం పలికారు.
దాదాపు 60 దేశాలపై భారీ సుంకాలను విధించిన ట్రంప్
వాన్స్ వెంట అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా దాదాపు 60 దేశాలపై భారీ సుంకాలను విధించారు. ఇటీవల, 90 రోజుల పాటు తాత్కాలికంగా ఈ సుంకాలను నిలిపివేస్తూ.. చైనా, మెక్సికో మినహా మిగిలిన దేశాలకు 10% బేస్ సుంకాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి కీలక పరిణామాల మధ్య ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్‌కు అధికారిక పర్యటనపై రావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోడీ నివాసానికి వాన్స్
అయితే, జెడి వాన్స్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా.. ఢిల్లీ చేరుకున్న కొద్ది గంటల తర్వాత వాన్స్ కుటుంబం.. ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. అలాగే, సంప్రదాయ భారతీయ హస్తకళా ఉత్పత్తులు విక్రయించే షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించారు. ఇక, ఏప్రిల్ 21 సాయంత్రం.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడి నివాసానికి వాన్స్ చేరుకున్నారు. ఈ సమావేశంలో మోడీ, వాన్స్ మధ్య అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వాణిజ్య ఒప్పందాలపైన, రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించనునట్లు సమాచారం.
వాన్స్ రెండో రోజు.. జైపుర్‌లో చారిత్రక ప్రదేశాల సందర్శన
ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం ప్రధాని మోడీ.. వాన్స్ కుటుంబంతో పాటు అమెరికా అధికారులకు అధికారిక విందును అందిస్తున్నారు. ఇక, రెండో రోజు జైపుర్‌లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనున్నారు. ఈనెల 23న ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి తిరిగి జైపుర్‌కు చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు.
విద్యార్థి వీసాల రద్దు విషయంలో అమెరికా తీరుపై విమర్శలు
వినడానికి వాన్స్ పర్యటన.. వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో కలిసి ఉన్నప్పటికీ.. ఇటీవల ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు.. అంతకమించి, భారత్-అమెరికా సంబంధాల్లో ఏర్పడిన కొన్ని కీలక పరిణామాల మధ్య ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటీవల, అమెరికాకు వెళ్లే విద్యార్థి వీసాల రద్దు విషయంలో అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వం.. ఉపాధ్యక్షుడు వాన్స్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల వీసాలను చిన్న చిన్న కారణాలు చూపుతూ రద్దు చేస్తుండడంపై భారత్ కూడా నిరసన వ్యక్తం చేయాలని ఇటీవల నిపుణులు.. కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనితో పాటు.. వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత కూడా ఉంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, రక్షణ సహకారం..
ఉపాధ్యక్షుడు వాన్స్ భారత సందర్శన.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా, వాణిజ్య ఒప్పందాలు, రక్షణ సహకారం, భౌగోళిక రాజకీయ విషయాలపై చర్చలు జరుగుతాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రెండు దేశాల మధ్య 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడే అవకాశం ఉంది.
ఇండో పసిఫిక్‌లో చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేసే ప్లాన్
అలాగే, ఈ పర్యటన.. 13 సంవత్సరాల్లో అమెరికా ఉపాధ్యక్షుడి మొదటి భారత సందర్శన కావడం విశేషం. దీనికి ముందు, 2013లో నాటి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ భారత్‌ను సందర్శించారు. ఇక, ఇప్పుడు వాన్స్ పర్యటన.. ట్రంప్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమి చేస్తున్న వ్యూహాత్మక ప్రణాళికల్లో ఈ పర్యటన కీలకం కానుంది.
ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ర్టాటజిక్ టెక్నాలజీ-TRUST
దౌత్యపరంగా చూసుకున్నప్పుడు.. ఉపాధ్యక్షుడు వాన్స్, ప్రధాని మోడీ మధ్య ఉన్నత స్థాయి చర్చలు కీలక ఒప్పందాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోడీతో వాన్స్ సమావేశంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి కీలక నాయకులు పాల్గొంటుండగా.. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందాలను మరింత బలోపేతం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా, ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ర్టాటజిక్ టెక్నాలజీ-TRUST వంటి కార్యక్రమాలపై వాన్స్ పర్యటన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వాన్స్ ఇటీవలి ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్‌ల్యాండ్ పర్యటనలు
అయితే, ఇక్కడ ఒక సందేహాం కూడా లేకపోలేదు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చేసిన ఇటీవలి ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్‌ల్యాండ్ విదేశీ పర్యటనలు వివాదాస్పదంగా మారాయి. ప్రెసిడెంట్ ట్రంప్ మాదిరిగానే.. వాన్స్ కూడా “అమెరికా ఫస్ట్” విధానానికి స్ట్రాంగ్ మద్దతుదారు. ఆ దిశగా వాన్స్ వ్యాఖ్యలు యూరప్ అసంతృప్తికి కారణం అయ్యాయి. అయితే, ఈ పర్యటన దానికి భిన్నంగా భారత్‌తో సానుకూల సంబంధాలను నిర్మించడానికి కీలకమైన అవకాశంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా వీసా రద్దులు, అక్రమ వలసలపై ట్రంప్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. .
వాన్స్ భారత పర్యటనలో వ్యక్తిగత, సాంస్కృతిక సంబంధం
ఇకపోతే.. వాన్స్ భారత పర్యటనలో వ్యక్తిగత, సాంస్కృతిక సంబంధం కూడా ఉంది. వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్.. భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెకండ్ లేడీ. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వలస వెళ్లారు. కాబట్టి, ఈ పర్యటనకు వ్యక్తిగత ప్రాముఖ్యత కూడా లేకపోలేదు. మొత్తంగా చూస్తే.. ఇది భారత్-అమెరికా భాగస్వామ్యంలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
వెల్‌కమ్ వాన్స్
వాన్స్ పర్యటన ఫలితంగా అమెరికా-భారత్ మధ్య బంధం మరింత మెరుగవుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఇది చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా వేస్తున్న ఎత్తుగడ కూడా అనుకోవాలి. మరి, ఇందులో భారత్‌కు వచ్చే లాభమేంటీ..? వాన్స్ పర్యటనలో ఏయే రంగాలకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి..? ఈ పర్యటనలో భాగంగా ఏవైనా ఒప్పందాలు చేసుకోబోతున్నారా..? మొత్తంగా చూస్తే.. వాన్స్ పర్యటనతో భారత్ వాణిజ్యంలో వచ్చే మార్పులేంటీ..?
ఇరు దేశాల మధ్య కీలకంగా వాణిజ్య ఒప్పందాలు
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పర్యటనలో భాగంగా.. భారత్-అమెరికా మధ్య ముఖ్యమైన ఒప్పందాలు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ పర్యటనలో ఖచ్చితమైన ఒప్పందాలు జరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని కీలక రంగాలలో పురోగతి కోసం చర్చలు జరుగుతాయని అంతా భావిస్తున్నారు. అందులో.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కీలకంగా ఉంది. భారత్-అమెరికాలు.. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఒక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం.. ఏప్రిల్ 2న భారతదేశంపై 26% సుంకాలు విధించినప్పటికీ.. ఇటీవల ఇచ్చిన 90 రోజుల తాత్కాలిక విరామం కాలంలో.. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంలో మొదటి దశ.. వాన్స్ పర్యటనతో ఖరారు కానుందనే అంచనాలు ఉన్నాయి.
మరిన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా అమెరికా
ఇక, భారత్ ఇప్పటికే కొన్ని అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించింది. చైనాకు చెక్ పెట్టే క్రమంలో.. ఇప్పుడు, మరిన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే, అమెరికా.. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో ఎక్కువ ప్రవేశం కోరుతోంది. అయితే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతుల ఆందోళనల కారణంగా మోడీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీనితో పాటు.. రెండు దేశాలు రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇందులో జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ వంటి ఆయుధాల సంయుక్త ఉత్పత్తి, సేకరణ వంటి అంశాలు ఉన్నాయి. కాగా.. ఈ చర్చలు జెడి వాన్స్ పర్యటనలో ప్రారంభమై.. రాబోయే నెలల్లో అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సెత్ భారత్ పర్యటనలో మరింత ముందుకు సాగవచ్చని అనుకుంటున్నారు.
ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (TRUST)
అలాగే, సాంకేతిక సహకారంలో భాగంగా.. ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (TRUST) కార్యక్రమం.. గతంలో ఇనిషియేటీవ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (iCET)గా పిలుస్తున్నారు. కాగా, ఈ పర్యటనలో అధికారికంగా ఇది ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు, డ్రోన్స్, సెమీకండక్టర్స్ వంటి కీలక సాంకేతిక రంగాలలో సహకారం ఉంది. ఇటీవల, ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కూడా భారత్‌లోని రెండు ప్రముఖ టెలికాం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది సాంకేతిక రంగంలో భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల.. ఏఐ, సెమీకండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్, రక్షణ, డ్రోన్స్, అధునాతన పదార్థాల వంటి కీలక సాంకేతిక రంగాలలో భారత్-అమెరికా సహకారంతో పాటు.. గవర్నమెంట్-టు-గవర్నమెంట్, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగం మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంది.
లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి కీలక ఖనిజాల సేకరణ, ప్రాసెసింగ్
అలాగే, కీలక ఖనిజాల సరఫరా గొలుసులోనూ ఇరు దేశాలు నిర్ణయాలు తీసుకోనున్నాయి. లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి కీలక ఖనిజాల సేకరణ, ప్రాసెసింగ్‌ను బలోపేతం చేయడం ఇందులో భాగంగా ఉంది. ఇది చైనా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడానికి ఉద్దేశించింది. చైనా ప్రపంచ REE ఉత్పత్తిలో దాదాపు 70% నియంత్రిస్తుండగా.. ఈ వాణిజ్యంలో ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తోంది అమెరికా.
అల్యూమినియం, బొగ్గు గనులు, ఆయిల్ అండ్ గ్యాస్..
స్ట్రాటజిక్ మినరల్ రికవరీ ఇనిషియేటివ్‌లో భాగంగా.. అల్యూమినియం, బొగ్గు గనులు, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి భారీ పరిశ్రమల నుండి కీలక ఖనిజాలను సేకరించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. అలాగే, వ్యూహాత్మక రంగాల్లో.. రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోడిమియం, సమారియం వంటి ఖనిజాలు మిస్సైల్స్, ఫైటర్ జెట్స్, రాడార్లలో ఉపయోగించే అధిక-పనితీరు గల మాగ్నెట్ల కోసం రెండు దేశాల మధ్య ఒప్పందాలకు అవకాశం ఉంది.
లిథియం, కోబాల్ట్ వంటివి ఎలక్ట్రిక్ వాహనాలు..
మరోవైపు, ఇంధనం విషయంలో.. లిథియం, కోబాల్ట్ వంటివి ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వ కోసం అధునాతన బ్యాటరీలలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక, సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గాలియం, ఇండియం, అల్ట్రా-ప్యూర్ సిలికాన్ వంటివి AI హార్డ్‌వేర్, క్వాంటం కంప్యూటింగ్‌లో కీలకంగా ఉన్నాయి. అలాగే, అంతరిక్ష రంగంలో కీలకమైన స్కాండియం, , బయోటెక్ ఇమేజింగ్‌లో వినియోగించే యూరోపియం, టెర్బియంలు కూడా వాణిజ్యంలో భాగం కానున్నాయి.
Also Read: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
ఇక, భారతదేశంలో కీలక ఖనిజాల నిల్వలు పరిమితం కావడంతో.. TRUST కార్యక్రమం విదేశాలలో ఖనిజ సంపదలను సేకరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. ఇది భారత జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్‌ను కూడా బలోపేతం చేస్తుంది. అలాగే, సెమీకండక్టర్స్, అధునాతన పదార్థాల కోసం బలమైన సరఫరా గొలుసులను సృష్టించడం ద్వారా సాంకేతిక స్వాతంత్ర్యం, జాతీయ భద్రతను పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇండో-పసిఫిక్ వ్యూహం వాన్స్ పర్యటనలో భాగం
ఇక, ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్ వ్యూహం కూడా వాన్స్ పర్యటనలో భాగంగా ఉన్నాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల క్వాడ్ కూటమి ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడంపై మోడీ, వాన్స్ మధ్య చర్చలు జరుగుతాయి. వాన్స్ పర్యటన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం, భారత్… అమెరికా నుండి మరిన్ని రక్షణ సామగ్రి, ఇంధన కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. ఇది రెండు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచుతుంది. మొత్తంగా చూస్తే.. వాన్స్ పర్యటనలో ఎటువంటి అధికారిక ఒప్పందాలపై సంతకాలు కాకపోవచ్చు కానీ.. ఈ చర్చలు భవిష్యత్తులో ఒప్పందాలకు పునాది వేయవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు.. భారత్‌లోని రైతు సంఘాలు, ముఖ్యంగా ఆల్ ఇండియా కిసాన్ సభ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.