E-Paper
Advertisement

అక్రమ వలసలకు చెక్.. లీగల్ వలసదారులకు షాక్.. ట్రంప్ కొత్త రూల్స్ అసలు కథ!

అక్రమ వలసలకు చెక్.. లీగల్ వలసదారులకు షాక్.. ట్రంప్ కొత్త రూల్స్ అసలు కథ!
Advertisement

US Visas: అమెరికా ఫస్ట్ నినాదంతోనే ట్రంప్ పని చేస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలంటున్నారు. H-1B వీసా రూపంలో వచ్చే విదేశీ ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ద్వారా స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు వచ్చేలా చూసుకుంటున్నారు. చాలామంది టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలపై అమెరికాలో అడుగుపెట్టి, ఆ తర్వాత అక్కడ ఆశ్రయం కోరుతూ శాశ్వతంగా ఉండిపోతున్నారు. ఈ లూప్‌హోల్‌ను క్లోజ్ చేయడమే కొత్త రూల్ అసలు లక్ష్యం.

అమెరికా వీసా విధానంలో కీలక మార్పులు

Advertisement

విదేశీయులు అమెరికాకు వచ్చి అక్కడి ప్రభుత్వ రాయితీలు, ఉచిత వైద్యం లేదా సంక్షేమ నిధులపై ఆధారపడకూడదని యూఎస్ గట్టిగా భావిస్తోంది. ఆర్థికంగా అత్యంత స్థిరంగా ఉన్నవారికే దేశంలోకి అనుమతి ఇవ్వాలనేది తెరవెనుక వ్యూహం. ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటే.. వీసాల జారీ విషయంలో మరింత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. వలసల విధానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామని, ఈ మార్పు సమయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చన్నారు.

అక్రమ వలసలకు చెక్..

Advertisement

లీగల్ గా వచ్చే వలసదారులకు బెనిఫిట్ చేసేలా పవర్ ఫుల్ సిస్టమ్ ను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అక్రమ వలసదారులకు చెక్ పెట్టేలా వీసాల జారీలో రిఫామ్స్ మొదలు పెట్టామని, ఇందులో భారత్‌ను ఏమాత్రం టార్గెట్‌ చేయడం లేదన్నారు. తాజాగా అమెరికా, భారత్ విదేశాంగ మంత్రుల ప్రెస్ మీట్లో వీసా, వలస విధానాల్లో ట్రంప్‌ ప్రభుత్వం చేసిన మార్పులపై భారత్‌ ఆందోళనను మన విదేశాంగ మంత్రి జైశంకర్‌.. మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పాలసీలతో చట్టబద్ధమైన వలసలు ప్రతికూలం కావొద్దన్నారు.

గ్రీన్ కార్డ్ ఆందోళనలపై భారత్ గళం

ప్రజల మధ్య సంబంధాలే భారత్‌–అమెరికా సంబంధాలకు కీలకమని జైశంకర్‌ అన్నారు. అమెరికాల వీసాల జారీ విషయంలో ఇండియన్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రూబియోకు చెప్పానన్నారు. చట్టబద్ధంగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని నేరుగానే చెప్పేశారు. అక్రమ వలసలను అరికట్టే విషయంలో అమెరికాకు సహకరిస్తున్నామన్నారు. లీగల్ గా వచ్చే ఇమిగ్రెంట్స్ కు అడ్డంకులు సృష్టించవద్దని అమెరికాకు సూచించారు. రెండు దేశాల వ్యాపార, సాంకేతిక, పరిశోధన సహకారానికి వలసలు కీలకమన్నారు. హెచ్‌–1బీ వీసా రూల్స్ ను ట్రంప్‌ ప్రభుత్వం కఠినం చేయడం ఇండియన్లకు ఇబ్బందికరంగా మారిందన్నారు. గ్రీన్‌ కార్డు విషయలోనూ ఆందోళన ఉందన్నారు. అమెరికా తన విదేశాంగ విధానంలో అమెరికా ఫస్ట్‌ ఉంటే, ఇండియా కు ఇండియా ఫస్ట్ విధానం ఉందన్నారు జైశంకర్.

రూబియో కీలక వ్యాఖ్యలు

అయితే గ్రీన్‌ కార్డ్‌ రూల్స్ లో మార్పులపై రూబియో రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, అమెరికాలో వలస సంక్షోభం నెలకొందన్నారు. ఇది భారత్ వల్ల జరిగిందని తాను చెప్పడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా 2 కోట్ల మందికి పైగా జనం చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించారని, ఆ సవాలును పరిష్కరించాల్సి ఉందని వివరించారు. కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు ఇబ్బందులు సహజమే అని, ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కేవలం ఇండియాను ఉద్దేశించి చేసినవి కావన్నారు రుబియో. H-1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో ఇండియన్లే ఉండటం వల్ల.. ఈ కొత్త మార్పుల ప్రభావం ఇండియన్లపై కాస్త ఎక్కువగా పడుతోందని ఆయన అంగీకరించారు.

ఇండియన్ టాలెంట్‌కు అమెరికా కొత్త అవకాశాలు

వలసల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత ఏర్పడే కొత్త విధానం చాలా వేగంగా, పారదర్శకంగా ఉంటుందని రుబియో అన్నారు. కొత్త సిస్టమ్ సెట్ అయ్యాక అమెరికాకు వచ్చి పనిచేయాలని, సరికొత్త ఆవిష్కరణలు చేయాలని భావించే ఇండియన్లకు గతంలో కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ గా మారే ఛాన్స్ ఉందన్నారు. తన భారత పర్యటనలో రుబియో అమెరికా ఫస్ట్ వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రకటించారు. ఈ కొత్త టూల్ ద్వారా అమెరికా-భారత్ మధ్య వాణిజ్య, ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని బలపరిచే బిజినెస్ ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్లకు వీసా అపాయింట్‌మెంట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత దొరకనుంది.

గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్‌పై అమెరికా విమర్శలు

గ్రీన్‌కార్డు ప్రక్రియలో ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన కొత్త మార్పులపై ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. లింక్డ్‌ ఇన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హామన్‌ ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏఐ రీసెర్చర్స్, ఉద్యోగులు, స్టూడెంట్స్ అమెరికాను విడిచివెళ్లాలా అని క్వశ్చన్ చేశారు. గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇది టెక్‌, వ్యాపార సంస్థలతో సహా మొత్తం అమెరికాకే హానికరం అన్నారు. గతంలో గూగుల్‌లో కీలక బృందానికి నాయకత్వం వహించిన ఏఐ నిపుణుడు ఆండ్రూ ఎన్గ్‌.. ఈ కొత్త నిబంధనను తప్పుబట్టారు. దీని కారణంగా అమెరికాలో డాక్టర్లు, టీచర్లు, సైంటిస్టుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థుల దృష్టి యూరప్ వైపు

ఇప్పటికే ఇండియాలో కొత్త H-1B, L-1 వీసా అపాయింట్‌మెంట్లు 2026లో దొరకడం గగనమైంది. స్లాట్స్ అన్నీ 2027కి వెళ్లిపోతున్నాయ్. రాబోయే రోజుల్లో వీసా వెయిటింగ్ పీరియడ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. H-1B వీసాలకు జీతాల ఆధారంగా ఎంపిక ఉండబోతోంది. కేవలం లక్కీ డ్రా పద్ధతిలో కాకుండా, ఎక్కువ వేతనం, అలాగే అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారికే H-1B వీసాలు దక్కేలా రూల్స్ మార్చుతున్నారు. దీనివల్ల ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతాయ్. అందుకే ఇప్పుడు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యూరప్ వైపు మళ్లుతున్నారు. అమెరికా స్టూడెంట్ వీసాల రిజెక్షన్ రేటు పెరగడం, ఫీజుల భారం వల్ల విదేశీ విద్యా రుణాలు దాదాపు 30% నుంచి 50% పడిపోయాయ్. ఫలితంగా భారతీయ విద్యార్థులు అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.

వీసా ప్రాసెస్ మరింత కఠినం

2025 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం.. ప్రతి H-1B, H-4 దరఖాస్తుదారుడి ఆన్‌లైన్ ప్రొఫైల్స్, డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను అధికారులు జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. ఈ అడిషనల్ వెరిఫికేషన్ వల్ల కాన్సులేట్ అధికారులు ఒక రోజులో నిర్వహించే ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది. స్క్రీనింగ్ ఆలస్యం కావడం వల్ల 2025 చివరలో, 2026 ప్రారంభంలో జరగాల్సిన వేలాది అపాయింట్‌మెంట్లను యూఎస్ కాన్సులేట్లు ఆటోమేటిక్‌గా 2026 అక్టోబర్ లేదా 2027 కి రీషెడ్యూల్ చేసేశాయి. టూరిజం, బిజినెస్, స్టూడెంట్స్ అప్లికేషన్లు రోజురోజుకూ పెరుగుతుండటంతో కాన్సులేట్ల కెపాసిటీకి మించి లోడ్ పడుతోంది.

హైదరాబాద్‌లో H-1B, L-1 వీసా స్లాట్లు నిమిషాల్లోనే ఫుల్

హైదరాబాద్ లో H-1B , L-1 వర్క్ వీసా పరిస్థితి ఎలా ఉందంటే.. స్లాట్లు ఓపెన్ అయిన నిమిషాల్లోనే అయిపోతున్నాయ్. B1, B2 టూరిస్ట్, బిజినెస్ వీసా వెయిటింగ్ టైమ్ 8 నెలలుగా ఉంది. స్టాంపింగ్ కోసం ఇండియాకు వస్తే తిరిగి ఎప్పుడు అమెరికా వెళ్తామో తెలియని పరిస్థితి ఉండటంతో.. వీసా వాలిడిటీ ముగిసిన చాలామంది ఇండియన్లు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న ఈ వీసా కష్టాలకు తోడు మరిన్ని సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయ్. వీసా గండం గట్టెక్కి చదువుకునేందుకు వెళ్లిన వారికి కూడా తిప్పలు పెరుగుతున్నాయ్.

రూపాయి విలువ పతనం..

రూపాయి విలువ తగ్గడంతో పేరెంట్స్ డాలర్లలో ఎక్కువ పంపించాల్సి వస్తోంది. భారత రూపాయి ఇప్పుడు అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కొన్ని నెలల్లోనే తీవ్రమైంది. డాలర్‌కు రూపాయి విలువ 95 మార్కును దాటింది. ఏ క్షణంలోనైనా అది సెంచరీ మార్క్ చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్నేళ్ల కిందటి వరకు పౌండ్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా కనిపించేది. 2013లో పౌండ్‌తో రూపాయి విలువ మూడంకెల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2022లో, యూరోతో పోలిస్తే రూపాయి 100 మార్కును తాకింది. ఇప్పుడు, డాలర్‌ విలువ 100 రూపాయలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

విద్యార్థుల ఎదుర్కొంటున్న సవాళ్లు

వీసా కష్టాలను ఎదుర్కొని అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్లిన వారికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయ్. విదేశాల్లో చదువు అంటే తాము ఊహించుకున్న జీవితం వేరు.. కానీ అక్కడ గడుపుతున్న జీవితం మరోలా ఉంటోంది. బలహీనపడుతున్న రూపాయి, విదేశాల్లోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప.. మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కొందరు అసలు భోజనమే మానేయాల్సి వస్తోంది. మరికొందరు రోజుకు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు. ఎక్స్ పైరీ డేట్ ముగిసిన ఫుడ్ కోసం వెతికి మరీ తక్కువలో తింటున్నారు. డబ్బులు సరిపోక మరిన్ని పనులు చేస్తున్నారు. ఏ చదువు కోసమైతే అమెరికా దాకా వెళ్తున్నారో.. ఈ టెన్షన్లతో ఆ చదువులపైనే ఎఫెక్ట్ పడుతోంది.

విదేశీ విద్యార్థుల జీవన శైలిలో పెద్ద మార్పులు

అమెరికానే కాదు యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్‌లోని విద్యార్థులదీ ఇదే సిచ్యువేషన్. బయట తినడం మొత్తమే మానేస్తున్నారు. తక్కువ ధర ఉన్న ఆహారం కోసం కొన్ని యాప్ లపై ఆధారపడుతున్నారు. ఎక్స్ పైరీ డేట్ దగ్గరికొచ్చిన ఫుడ్ కొనేందుకు ఎగబడుతున్నారు. అమెరికాలోని చాలా మంది విద్యార్థులు డబ్బు ఆదా చేసుకోవడానికి వర్శిటీలు ఇచ్చే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పై ఆధారపడుతున్నారు. చాలా వర్శిటీలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంటాయ్. అపార్ట్‌మెంట్లను షేర్‌ చేసుకుంటున్నారు.

మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన ఆర్థిక షాక్

చాలా మంది విద్యార్థులు తమకు అధికారికంగా అనుమతి ఉన్న పని గంటలకు మించి పనిచేస్తున్నారు. అధికారిక పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతోపాటు శ్రమతో ఉన్న పనులు కూడా చేసుకోవాల్సి వస్తోంది. యూకే వంటి చోట్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కూడా ఖరీదుగా మారడంతో డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. ఈ కరెన్సీ పతనం మధ్యతరగతి కుటుంబాలకు షాక్ గా మారుతోంది. రూపాయి విలువ పడిపోవడంతో చివరి సెమిస్టర్ల నాటికి అప్పటికే తీసుకున్న విద్యా రుణం సరిపోవడం లేదు. విద్యార్థుల ఖర్చులు పెరగడంతో మిగిలిన ఫీజులను భరించడానికి వారి తల్లిదండ్రులు అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది.

అమెరికా ఉద్యోగ మార్గం కష్టమా?

ఫైనల్ గా జరుగుతున్నదేంటంటే.. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల గురించే కాకుండా, గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉపాధి గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. వలస, పని వీసాల రూల్స్ ను డొనాల్డ్‌ ట్రంప్‌ టైట్ చేయడంతో హెచ్‌–1బీ వీసా వ్యవస్థ, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ క్వశ్చన్ మార్క్ గా మారింది. భవిష్యత్‌ అంతా గందరగోళంగా మారింది. సో చదువుకునే టైంలో సమస్యలు, చదువు పూర్తయ్యాక ఉద్యోగం విషయంలోనూ వీసాల రూపంలో ఇబ్బందులు ఒక్కటేమిటి డాలర్ డ్రీమ్స్ షాక్ ఇస్తోంది. ఈ రూల్స్ అన్నీ చూస్తుంటే.. అమెరికా ఇకపై కేవలం అత్యున్నత నైపుణ్యం కలిగి, ఆర్థికంగా బలమైన విదేశీయులను మాత్రమే ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తోంది. సాధారణ ఉద్యోగాల కోసం లేదా వలస వెళ్లాలనే ఆలోచనతో ఉన్నవారికి రాబోయే రోజుల్లో అమెరికా వీసా సాధించడం కష్టమే. వీళ్లంతా ప్లాన్ బి చూసుకుంటే బెటర్.

Also Read: గవర్నర్ ను కలిసిన కవిత.. వినతి పత్రం అందజేత.. సీఎంపై ఘాటు విమర్శలు

Story by: Anup, Big tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×