Big Stories

Neuralink Implant : ప్రపంచానికి మార్గదర్శకంగా న్యూరాలింక్.. లింక్, టెలిపతి ఎలా పనిచేస్తాయి ?

Neuralink Implant : ఇప్పుడు ప్రపంచం ముందున్న అత్యంత అధునాతన టెక్నాలజీ కృత్రిమ మేథస్సు… ఏఐ అని పిలుస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని భయపెడుతోందనే సంశయాలు ఉన్నప్పటికీ.. ఏఐ సంచలనాత్మకంగా అభివృద్ధిలో పథంలో కీలక అడుగు వేసింది. తాజాగా, ఎలోన్ మస్క్ కంపెనీ ‘న్యూరాలింక్’ మొట్టమొదటిసారి ఒక మానవ రోగికి మెదడు ఇంప్లాంట్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఇంతకీ, ఈ న్యూరాలింక్ ఏం చేస్తోంది..? మెదడులో చిప్ పెడితే మనిషి అవయవాలను ఆర్టిఫిషియల్‌గా కంట్రోల్ చేయొచ్చా..? ఇంతకీ ఎలన్ మాస్క్ ఏఐను ఉపయోగించి ఏం చేయబోతున్నాడు..?

- Advertisement -

ఎలన్ మస్క్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఎలన్ మస్క్ బిజినెస్ ఐడియాస్.. ఎలన్ మస్క్ ఏ స్టెప్ తీసుకున్నా అది ప్రపంచంలో పెద్ద చర్చనే రేకెత్తిస్తోంది. అలాంటి ఎలన్ మస్క్ మరో కంపెనీ ఇప్పుడొక అద్భుతమై ఆవిష్కరణ చేసింది. ఈ డెవలప్‌మెంట్ న్యూరో టెక్నాలజీలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఎలన్ మస్క్ కంపెనీ ‘న్యూరాలింక్’ మెదడులో ఓ చిప్‌ను ఇంప్లాంట్ చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఓ మానవ రోగికి మెదడును ఇంప్లాంట్ చేయగా ఆ రోగి ప్రస్తుతం బాగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది భూమిపై శాస్త్రీయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లిన అత్యంత సంచలనాత్మకమైన డెవలప్‌మెంట్‌గా అంతా భావిస్తున్నారు.

- Advertisement -

న్యూరాలింక్ స్థాపకుడైన ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ వార్తను పంచుకున్నాడు. జనవరి 29న న్యూరాలింక్ నుండి మొదటి మానవుడు మెదడులో చిప్ ఇంప్లాంట్ పూర్తిచేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆ రోగి బాగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభ ఫలితాలు ఆశాజనకమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను చూపుతున్నాయి” అని ఎలన్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న న్యూరాలింక్.. మెదడు ఇంప్లాంట్‌‌లను మానవులపై పరీక్షించడానికి గతేడాది యూఎస్ రెగ్యులేటర్‌ల నుండి ఆ సంస్థ ఆమోదం పొందింది. కాగా, సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్‌లో.. మానవ మెదడు, కంప్యూటర్ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నరాలను, కండరాలను బలహీనపరిచే ALS వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో ఈ ప్రాజెక్ట్ కీలకమైన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. అలాగే, ఇది మానవ సామర్థ్యాలను మరింత పెంచడానికి.. మానవులకు, కృత్రిమ మేధస్సుకు మధ్య మరింత సంబంధాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది.

ఈ న్యూరాలింక్ ఇంప్లాంట్‌ను “లింక్” అనే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి, ఇది ఒక చిన్న కాంపాక్ట్ పరికరం. ఇది దాదాపు ఐదు నాణేల పరిమాణంతో ఉంటుంది. దీన్నే శస్త్రచికిత్స ద్వారా మానవ మెదడులో పెట్టారు. ఇక, ఈ ఆపరేషన్‌లో మనిషి జుట్టు కంటే సన్నగా ఉండే 64 ఫ్లెక్సిబుల్ దారాలను శస్త్రచికిత్స ద్వారా “కదలికలకు సంబంధించి” నియంత్రించే మెదడులోని ఒక భాగంలో ఉంచారు. ఈ ఆపరేషన్ చేయడానికి ఓ రోబోట్‌ను ఉపయోగించారు. ఇక, మెదడులో ఇంప్లాంట్ చేసిన ఈ థ్రెడ్‌లు వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయగల బ్యాటరీతో పనిచేస్తాయి. అలాగే, మెదడు సంకేతాలను వైర్‌లెస్‌గా రికార్డ్ చేయడానికి, సదరు రోగి ఎలా కదలాలనుకుంటున్నారో డీకోడ్ చేసే యాప్‌కి ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంది. ఎక్స్ వేదికగా ఎలన్ మస్క్ దీన్ని ‘టెలిపతి’ అని పేర్కొన్నారు. టెలిపతి అంటే “మన ఫోన్, లేదంటే మన కంప్యూటర్‌ ద్వారా ఏదైనా పరికరాన్ని ఎలా నియంత్రిస్తామో” సరిగ్గా అలాగే పనిచేస్తుంది. అలాగే, ఇది కూడా పనిచేస్తుంది. పక్షవాతం వచ్చి, అవయవాలు పనిచేయకుండా ఉన్న రోగుల వంటి వారికి ఈ చిప్‌ను ఇంప్లాంట్ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుంది. బ్రెయిన్‌లో పెట్టిన ఈ చిప్ ద్వారా శరీరంలో నరాలకు సిగ్నల్స్ పంపి వాటిని కదిలేటట్లు చేయవచ్చు.

ఇక మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పరిశోధనా రంగంలో తన ప్రవేశాన్ని ఎలన్ మస్క్ తరచుగా గుర్తుచేస్తూ వచ్చాడు. అయితే.. ఈ ప్రయత్నంలో ఎలన్ ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కున్నాడు. మెదడుపై పరిశోధనల కోసం తీసుకునే అనుమతుల్లో చాలా జాప్యాలను చూశాడు. అవసరమైన పెట్టుబడుల కోసం మరొక ఇంప్లాంట్ డెవలపర్ అయిన సింక్రోన్‌తో సహకారాన్ని కోరారు. ఇద్దరి సహకారంలో… జులై 2022లో యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన పేషెంట్‌కి మొదటిసారిగా సింక్రోన్ ఇంప్లాంట్ జరిగింది. ఈ శస్త్రచికిత్సలో పుర్రె తెరవాల్సిన అవసరం లేని తక్కువ ఇన్వాసివ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను అమలుచేసి, సక్సెస్ అయ్యారు. కాగా, మానవ మెదడులను కంప్యూటర్‌లకు కనెక్ట్ చేయడం కంపెనీ లక్ష్యంగా.. సంక్లిష్టమైన నాడీ సంబంధిత పరిస్థితులను పరిష్కరించడంలో మరింత అభివృద్ధిని సాధించే దిశగా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ టెక్నాలజీ అభివృద్ధిలో ఆశాజనక పరిణామాలు ఉన్నప్పటికీ, న్యూరాలింక్ సంస్థ దాని భద్రతా ప్రోటోకాల్‌లపై విమర్శలు ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రమాదకర పదార్థాల రవాణాకు సంబంధించిన యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకి జరిమానాలు కూడా విధించారు. అదే కాకుండా, గత నవంబర్‌లో, న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాంట్ భద్రత గురించి కూడా విమర్శలు వచ్చాయి. ఎలన్ మస్క్ తన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించాడని కొన్ని కేసులు నమోదుకాగా.. ఆ దావాలపై దర్యాప్తు చేయమని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ను నలుగురు యూఎస్ చట్టసభ సభ్యులు కోరారు. కాలిఫోర్నియా కేంద్రంగా 2016లో స్థాపించి న్యూరాలింక్ సంస్థలో 400 కంటే ఎక్కువ మంది పనిచేస్తుండగా.. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఈ కంపెనీ $363 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను సేకరించింది. న్యూరాలింక్ సాధించిన ఈ సక్సెస్‌.. న్యూరోటెక్నాలజీ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మానవ-కంప్యూటర్ పరస్పర చర్యలో కొత్త శకాన్ని సూచిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఇక.. ఎలన్ మస్క్ ఆలోచనా తీరు న్యూరాలింక్ ప్రొఫైల్‌ను పెంచుతుందనేది నిజమే అయినప్పటికీ, ఈ రంగంలో ఇప్పటికే కొన్ని సంస్థలు బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ముందంజలోనే ఉన్నారు. వారిలో కొందరు రెండు దశాబ్దాల క్రితమే ట్రాక్ రికార్డ్ సృష్టించారు. పార్కిన్సన్స్ వ్యాధి వంటి పరిస్థితులకు మెదడు ఇంప్లాంట్లు ఇప్పటికే విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఉటాకు చెందిన బ్లాక్‌రాక్ న్యూరోటెక్ 2004లో మొదటిసారి మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లలో ఆర్టిఫిషియల్ బ్రెయిన్‌ను అమర్చింది. అయితే, తాజాగా న్యూరాలింక్ రూపొందించిన ప్రెసిషన్ న్యూరోసైన్స్ అనేది పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేస్తుంది. ఈ ఇంప్లాంట్ మెదడు చాలా సన్నని టేప్ ముక్కను పోలి ఉంటుంది. దీన్ని “క్రానియల్ మైక్రో-స్లిట్” ద్వారా అమర్చవచ్చు. కాగా, ఇది చాలా సులభమైన ప్రక్రియ కావడంతో మరింత పాపులర్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది మీడియాలో మరింత పాపులర్ కావడానికి కారణం.. ఈ కంపెనీకి భారీ స్థాయిలో నిధులు సమకూరాయి. సాంకేతికంగా ఆశ్చర్యపరిచే పరికరాన్ని కనుగొనడం కంటే ఎక్కువగా ఇందులో ఎలన్ మస్క్‌ కనెక్షన్ కూడా ఉంది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News