Big Stories

Visakha Steel Plant : మోదీ విశాఖ పర్యటనపై టెన్షన్..స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉద్ధృతం

Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ప్రధాని నవంబర్ 11న నగరానికి వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆందోళన బాటపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ నుంచి రైల్వే డీఆర్‌ఎమ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎమ్‌ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

- Advertisement -

కార్యక్రమాలు ఇవే..
నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు. నగరంలోనే రాత్రి బస చేస్తారు. నవంబర్ 12న ఆంధ్రా యూన్సివర్శిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రూ. 10,742 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే పూర్తైన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా సభ నిర్వహించేందుకు రెండు భారీ జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

నవంబర్ 11, 12 తేదీల్లో టెన్షన్..
ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం గేట్ నుంచి ఏయూలోకి ప్రధాని ప్రయాణించే మార్గంలో రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు.

కార్మికుల హెచ్చరిక
మోదీ పర్యటన సమయంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్రధానికి తమ నిరసన తెలుపుతామని ప్రకటించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ప్రధాని విశాఖలో అడుగుపెట్టాలని గతంలో హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని విశాఖ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఆ రెండు రోజులు కార్మికుల ఎలాంటి నిరసనలకు దిగుతారనే టెన్షన్ ఏర్పడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News