Visakhapatnam: గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు తొందరపడుతున్నారు… సమయం మించిపోతుంది ఆలస్యం చేయొద్దంటూ తొందర పెడుతున్నారు… టైంని సెట్ చేసుకుని మరి పనుల్లో బిజీ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు…. అధికారులపై ఒత్తిడి కూడా పెంచుతున్నారు… ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు… పదవులను పట్టించుకునే పరిస్థితి అంతకన్నా లేదు… నువ్వు మేయర్, నేను డిప్యూటీ మేయర్, వాళ్ళు కార్పొరేటర్లు అనే తారతమ్యం అసలు లేదు…. కళ్ళ ముందు అందరికీ కనిపిస్తున్నది ఒక్కటే…. టైం…. సమయం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి అనుకున్నారు… అసలు జీవీఎంసీ కార్పొరేటర్లు అంతలా హైరానా పడిపోవడానికి కారణమేంటి?
ఏపీలో ఉన్న ఒకే ఒక్క గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం…. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మాత్రమే కాదు రాజకీయ నాయకులకు ఆదాయ కార్పొరేషన్ గా కూడా జీవీఎంసీ మారిపోయింది…. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే జీవీఎంసీలో రాజకీయపరంగా చిన్న పదవి వస్తే చాలు కోట్లకు పడగలెత్తొచ్చు అనే ప్రచారం ఉండనే ఉంది… ఇప్పటికే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండడంతో పార్టీలకు సంబంధం లేకుండా వారంతా తొందరపడుతున్నారు… అధికారులపై వత్తిడి పెడుతున్నారు…. కార్పొరేటర్ల కాన్సెప్ట్ ఒక్కటే పదవీకాలం ముగిసే లోపు అవకాశం ఉన్నంత వరకు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని…
గత నెల రోజులుగా జీవీఎంసీ కార్పొరేటర్లు తొందరపడుతూ అధికారులను తొందర పెడుతున్నారు… ఎప్పుడు లేనిది పార్టీలకు సంబంధం లేకుండా కార్పొరేటర్లు అంతా ఒక్కేటే అన్నట్లు అధికారుల చుట్టూ తిరుగుతూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ జీవీఎంసీ అధికారులే ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది… దీంతో కార్పొరేటర్లు తమ పరిధిలో ఉన్న పాత పనులతో పాటు కొత్త పనులపై కూడా దృష్టి పెట్టారు… ఎంత తొందరగా పనులు శాంక్షన్ అయితే అంతే తొందరగా పనులు చేయించేసి బిల్లులు క్లియర్ చేయించుకోవడానికి పావులు కదుపుతున్నారు…
కేవలం మూడు నెలలు పదవీకాలం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం జీవీఎంసీలో ఉన్న 97 మంది కార్పొరేటర్లలలో అనేక మంది ఎమ్మెల్యేల సిఫార్సులను కూడా తీసుకుని జీవీఎంసీ అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది … ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో అనేక మంది కార్పొరేటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు, ఇండియన్ నేవీ కార్యక్రమాల కోసం ఎన్నో పనులు చేశారు … విశాఖ నగరం పరిధిలో ముఖ్యంగా NAD నుండి ఆర్కే బీచ్ వరకు ఉన్న ప్రాంతం మొత్తం ఏదొక కార్యక్రమాలు జరుగుతుందటంతో ఎప్పుడు పనులు జరుగుతూనే ఉంటున్నాయి… కానీ విశాఖ నార్త్, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎక్కువ మంది కార్పొరేటర్లకు తక్కువ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి… దీంతో జీవీఎంసీ అధికారులపై కార్పొరేటర్లు ఇప్పుడు పనుల కోసం దండయాత్ర మొదలు పెట్టారు
జీవీఎంసీ కౌన్సిల్ పదవీకాలం మూడు నెలలే ఉండటంతో కార్పొరేటర్లు ఇప్పుడు తొందర పడుతూ పనులు చేయించడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి… కౌన్సిల్ ముగిసేలోపు చేయగలిగినన్ని పనులు చేయించి సొమ్ము చేసుకోవడం ఒక కారణం అయితే కౌన్సిల్ ముగిసాక ప్రజలు ఎవ్వరు డివిజన్లలో పట్టించుకోరు కాబట్టి కనీసం చివరలో చేసిన పనులు చూపించి పరువు అయినా నిలుపుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది…. మూడు నెలల్లో కౌన్సిల్ ముగిస్తే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తెలీదు… వెంటనే ఎన్నికలు నిర్వహించినా మళ్ళీ సిట్టింగ్ లకే సీట్లు వస్తాయానే గ్యారంటీ లేదు… సీటు వచ్చినా మళ్ళీ గెలుస్తామనే నమ్మకం చాలా మంది కార్పొరేటర్లలో కనిపించడం లేదని తెలుస్తోది…
ముఖ్యంగా గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో డివిజన్లలో కార్పొరేటర్లు ప్రజలకు ఎలాంటి పని కావాలన్నా డబ్బులు లేకుండా చేయలేదు… దీంతో ప్రజల నాడి తెలుసుకున్న కార్పొరేటర్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంలా డివిజన్లలో వర్కుల పేరుతో సొమ్ములు చేసుకోవడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది… కార్పొరేటర్లు అందరూ మూకుమ్మడిగా జీవీఎంసీ మీద దండయాత్ర మొదలు పెట్టడంతో జీవీఎంసీ మేయర్, కమిషనర్ ఏం చెప్పాలో అర్ధం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోందంట..
Story by Ramireddy , Big TV