Waqf Bill Protest: బెంగాల్ లో వక్ఫ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ భగభగమంటోంది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏ మూక ఏ ఇంటిపై దాడి చేస్తుందో తెలియదు అన్నట్లుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వక్ఫ్ చట్టం పాసై, రాష్ట్రపతి నోటిఫై చేశాక ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. అవి కాస్తా హింసాత్మకంగా మారి ముగ్గురి ఊచకోతకు కారణమయ్యాయి. ఇంతకీ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు ఎవరి పని? నిఘా వర్గాలు ఏమంటున్నాయి?
నివురుగప్పిన నిప్పులా బెంగాల్..
అల్లర్లు.. రాళ్ల దాడులు
ప్రాణభయంతో పరుగులు
యదేచ్ఛగా జరిగిన లూటీలు
రంగంలోకి భద్రతా దళాలు
ఇంటర్నెట్ బంద్..
క్షణక్షణం.. భయం భయం..
బెంగాల్ లో వక్ఫ్ నిరసనలు అగ్గి రాజేశాయి. ప్రశాంతంగా చేసిన నిరసనలు కాస్తా అగ్నిగుండంగా మారాయి. హింసాత్మకంగా మారాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబాటుతోనే ఇలా జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్నది పక్కన పెడితే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ అల్లరి మూక ఇంట్లోకి చొరబడి మరీ ఇద్దర్ని నరికి చంపింది. మరోవైపు భద్రతా దళాల కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడు. మొత్తంగా మ్యాటర్ హైటెన్షన్ గా మారిపోయింది. మాల్దా జిల్లాలో పింకీదాస్ ఇంట్లో ఇద్దరు చనిపోయారు. ఓవైపు భర్త, ఇంకోవైపు మామను అల్లరి మూక నరికి చంపేశారు. ఇండ్లల్లో చొరబడి లూటీ చేశారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. మహిళలను, పిల్లలనూ చంపేస్తామని బెదిరించారు. ఇంటిపైకప్పులో దాక్కోవడంతో ప్రాణాలు కాపాడుకున్నారు చాలా మంది.
ఈనెల 8 నుంచి అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం
రాష్ట్రపతి నోటిఫై చేయడంతో దేశంలో వక్ఫ్ చట్టం ఈనెల 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ నోటిఫికేషన్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అంటూ ఈనెల 11 నిరసనలు మొదలయ్యాయి. అవి కాస్తా ఉద్రిక్తతలకు దారి తీశాయి. హింసాత్మకంగా మారాయి. ఇవి ఒక చోటి నుంచి మరో చోటికి పాకాయి. ఈనెల 12న మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాస్, హుగ్లీ జిల్లాల్లో నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చట్టం నోటిఫై అయ్యాక ఆందోళనలు ఏంటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రొటెస్ట్ లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడ్డాయా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి.
ప్రాణభయంతో మహిళలు, పిల్లలు వలస
ఈనెల 11న జరిగిన హింసలో మరణించిన ముగ్గురిలో తండ్రి, కొడుకు ఉన్నారు. అల్లర్లలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. కోల్ కత్తా హైకోర్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర సాయుధ దళాలను మోహరించాలని ఆదేశించింది. ఇప్పటిదాకా 150 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. యధేచ్ఛగా లూటీలు జరిగాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు తగలబడ్డాయ్. bsf, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. బలగాలు పహారా కాస్తున్నాయి. అయితే ఎప్పుడు ఏ క్షణం ఆందోళనలు చుట్టుముడుతాయో తెలియదు. ఈ అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళలు చంటి పిల్లలతో సహా వందలాదిగా పడవల్లో ముర్షీదాబాద్ ను వీడి గంగానది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సో ఈ సిచ్యువేషన్ చూస్తే చాలు గ్రౌండ్ లో ఎలా సీన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అల్లర్లపై బీజేపీ, తృణమూల్ మధ్య డైలాగ్ వార్
400 మందికి పైగా హిందువులు ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సి వచ్చిందని బెంగాల్ బీజేపీ అంటోంది. కొన్ని పార్టీలు రాజకీయ లాభం కోసం మతపరంగా దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ అన్నారు. సో ఈ అల్లర్లు రాజకీయంగానూ బెంగాల్ లో పెను ప్రకంపనలకు దారి తీశాయి. పుకార్లు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడానికి పుకార్లు కూడా ఓ కారణమని పోలీసులు అంటున్నారు. ముర్షిదాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని BSF అధికారులు అంటున్నారు. బిఎస్‌ఎఫ్ దళాలపై పెట్రోల్ బాంబులు, రాళ్ళు, కర్రలతో దాడులు జరిగాయి. దీంతో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు.
బలగాల మోహరింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హింస ముర్షిదాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఉత్తర 24 పరగణాలు, హుగ్లీలోని చంపానీతో సహా ఇతర జిల్లాలకు కూడా వ్యాపించిందని కలకత్తా హైకోర్టు పేర్కొంది. పారామిలటరీ బలగాల మోహరింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింస వెనుక మమతా బెనర్జీ అసమర్థత, అలాగే ఆమె బుజ్జగింపు రాజకీయాలే ఉన్నాయని బెంగాల్ బీజేపీ చీఫ్ ఆరోపిస్తున్నారు. బెంగాల్ లో హిందువులకు సేఫ్టీ లేకుండా పోయిందన్నారు.
బెంగాల్ లో హిందువులకు సేఫ్టీ లేదంటున్న బీజేపీ
నిజానికి కేంద్ర బలగాల రాకను మమతా బెనర్జీ సర్కార్ తప్పు బట్టింది. ఒకవైపు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నా.. కంట్రోల్ చేయాల్సింది పోయి బలగాల రాకను వ్యతిరేకించడమేంటన్న ప్రశ్నలు వచ్చాయి. మ్యాటర్ హైకోర్టు దాకా వెళ్లింది. బెంగాల్లోని పలు జిల్లాల్లో జరుగుతున్న విధ్వంసంపై నివేదికలు అందాయని, వాటిని చూశాక కూడా కళ్లు మూసుకుని ఉండలేమని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. బలగాల రాకతో.. ప్రాణభయంతో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు ఇప్పుడిప్పుడే పోలీసుల భద్రత మధ్య తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
దీని వెనుక బంగ్లాదేశ్ చొరబాటుదారుల స్కెచ్ ఉందా?
శాంతియుత నిరసన అందరి హక్కు. కానీ చట్టాన్ని చేతులోకి తీసుకుంటేనే ముప్పు. బెంగాల్ లో సరిగ్గా ఇదే జరిగింది. ఆందోళన కారులు రెచ్చిపోయారు. వారి ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడ్డాయా అన్న డౌట్లను కేంద్ర నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. లేకపోతే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఇండ్లల్లో లూటీలు ఏంటి? పెట్రోల్ బాంబులు విసరడమేంటి? మనుషుల్ని నరికి చంపడమేంటి? భద్రతా బలగాలపైనే రాళ్లు రువ్వేంత ధైర్యం ఎవరికి వస్తుంది? దీని వెనుక బంగ్లాదేశ్ చొరబాటుదారుల స్కెచ్ ఉందా? దేశంలో అలజడికి కుట్రలు జరుగుతున్నాయా?
జేపీసీలో కీలక సవరణల తర్వాత పార్లమెంట్ లో ఆమోదం
వక్ఫ్ సవరణ చట్టం చాలా సంప్రదింపుల తర్వాతే వచ్చింది. పార్లమెంట్ కు ఈ బిల్లు రాగానే నిరసన వ్యక్తమైంది. చట్టసవరణలను విపక్షాలు సూచించాయి. దీంతో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును జేపీసికి పంపించింది. అక్కడ పూర్తిస్థాయి సంప్రదింపులు, చర్చల తర్వాత బిల్లు ఇటీవలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ, రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చ జరిగింది. రెండు సభల్లోనూ బిల్లుకు ఆమోదముద్ర పడింది. చివరగా రాష్ట్రపతి కూడా నోటిఫై చేయడంతో చట్టంగా మారింది. వక్ఫ్ బోర్డుల భూదందాలకు చెక్ పెట్టేలా, పేద ముస్లింలకు మేలు చేసేలా దీన్ని తెచ్చామని ప్రధాని మోడీ సహా బీజేపీ, కేంద్రమంత్రులు చెప్పుకొచ్చారు.
అల్లర్లను అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందా?
నిజానికి నిరసనలు ఈ బిల్లు జేపీసీ దగ్గర ఉండగా.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన టైంలో జరగాలి. కానీ ఇప్పుడు ఆందోళనలు ముసురుకుంటున్నాయి. రాష్ట్రపతి నోటిఫై చేశాక కూడా ఎక్కడా ఆందోళనలు జరగలేదు. దేశంలో ఎక్కడా వ్యతిరేకత రాకపోయినా బెంగాల్ లో మాత్రం కథ మరోలా టర్న్ తీసుకుంది. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ నిరసనలు ప్రారంభించారు. మొదట ముర్షిదాబాద్ జిల్లాలో మొదలైన ఆందోళనలు.. మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలకు వ్యాపించాయి. సీఎం మమతా బెనర్జీ ఈ బిల్లును బెంగాల్‌లో అమలు చేయబోమని, మతపరమైన విభజన రాజకీయాలను సహించబోమని ప్రకటించారు. ఇది ముస్లింల ఆందోళనలకు ఆజ్యం పోసినట్లయిందంటున్నారు.
ఏడు సరిహద్దు జిల్లాల్లో ఉగ్రసంస్థ ఉనికి
బెంగాల్లో ముస్లిం జనాభా చాలానే ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, బెంగాల్‌లో ముస్లింలు మొత్తం జనాభాలో సుమారు 27 శాతం మంది ఉన్నారు. తాజాగా ఇది 30 శాతానికి దాటి ఉంటుందన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారాయన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అటు మమతా సర్కార్ కూడా అల్లర్ల విషయంలో కట్టడి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదని బీజేపీ ఆరోపించింది. మరోవైపు బెంగాల్‌లో హింస వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బెంగాల్‌లో దాడులు చేసి, అలజడి సృష్టించిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అనే సంస్థకు ఉంది.
ఇండ్లల్లో లూటీలు, ఊచకోతలు, పెట్రోల్ బాంబులు
ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్‌పై పట్టు బిగిస్తోందని, ఏడు సరిహద్దు జిల్లాల్లో ఈ ఉగ్రసంస్థ ఉనికి ఉందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు జిల్లల్లోని యువకులను భారీగా జేఎమ్‌బీ రిక్రూట్ చేసుకుంటోందంటున్నారు. ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థేనని డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే శాంతియుత నిరసనలైతే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇండ్లల్లో లూటీలు, ఊచకోతలు, పెట్రోల్ బాంబులు, బలగాలపైనే ఎటాక్స్ ఇవన్నీ చాలా డౌట్లను తెరపైకి తెచ్చాయి.
మమత బుజ్జగింపు రాజకీయాలతోనే సమస్య: బీజేపీ
వక్ఫ్ ఆందోళనల పేరుతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించే కుట్రలకు తెరలేపుతున్నారన్న డౌట్లను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో బిఎస్‌ఎఫ్ కు చెందిన 8కంపెనీల జవాన్లు, వెయ్యిమంది పోలీసులను మోహరించారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు.. కీలక పోలీసు అధికారులు పరిస్థితులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలనే బెంగాల్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని బీజేపీ లీడర్ సువేందు అధికారి ఆరోపిస్తున్నారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ లేఖ రాశారు. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని అవాంఛనీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడుతున్నారు.
వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగమయ్యాయన్న మోడీ
వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని, వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని తాము చట్టంగా గుర్తించడం లేదంటున్నారు మమత. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టమని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా వక్ఫ్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురయ్యాయన్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైరస్ ను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ పేరుతో లక్షల హెక్టార్ల భూమి ఉందని, ఇవన్నీ పేదలకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉందని, కానీ ఈ భూముల నుంచి భూ మాఫియా ప్రయోజనం పొందిందన్నారు.
బెంగాల్ లో మాత్రం కథ మరోలా టర్న్ తీసుకుంది.
నిజానికి వక్ఫ్ బిల్లుపై చాలా పెద్ద చర్చ జరిగింది. ఇందులో ప్రతిపాదించిన అంశాల్లో కొన్నింటిపై కేంద్రం వెనక్కి తగ్గింది. సూచనలు సలహాలు తీసుకున్నారు. వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డులే అన్యాక్రాంతం చేయడంతో ఈ చట్టంపై ముస్లిం వర్గాలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వక్ఫ్ ఆస్తులను లాక్కునే ఉద్దేశమే లేదని, ఆ ఆస్తులు పరాధీనం కాకుండా కాపాడటానికే బిల్లు తెచ్చామని కేంద్రం చెప్పింది. అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అందుకే ఎక్కడా పెద్దగా నిరసనలు రాలేదు. బెంగాల్ లో మాత్రం కథ మరోలా టర్న్ తీసుకుంది.