Indian Railways: భారతీయ రైల్వే ఓ సముద్రం లాంటిది. ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిన సందర్బాలున్నాయి. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సాధారణంగా రైలు ముందుకు కదలాలంటే కచ్చితంగా లోకో పైలెట్ ఉండాలి. ఆయనకు సాయంగా అసిస్టెంట్ లోకో పైలెట్ కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి సమన్వయంతో రైలును గమ్యస్థానానికి తీసుకెళ్తారు. కానీ, ఓ రైలు లోకో పైలెట్స్ లేకుండానే ఏకంగా 70 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. ఈ ఆశ్చర్యకర ఘటన జమ్మూకాశ్మీర్ లో జరిగింది.
లోకో పైలెట్ లేకుండా 70 కి.మీ ప్రయాణించిన గూడ్స్ రైలు
గత ఏడాది ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగింది. లోకో పైలెట్లు మారేందుకు జమ్మూలోని కథువా రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలును ఆపారు. జమ్మూ-జలంధర్ సెక్షన్ లో ట్రాక్ కాస్త వాలుగా ఉండటంతో రైలు ముందుకు కదిలింది. నెమ్మదిగా వేగం అందుకుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు సుమారు 70 కిలో మీటర్లు లోకో పైలెట్ లేకుండానే రైలు ప్రయాణించింది. ఉదయం 7.25 గంటలకు కథువా స్టేషన్ నుంచి ముందుకు కదలడం మొదలు పెట్టిన రైలు 9 గంటలకు పంజాబ్ కు చేరుకుంది. కంకర రాళ్లతో కూడిన 53 వ్యాగన్ల గూడ్స్ రైలు జమ్మూ నుండి పంజాబ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రైలు ముందుకు ఎలా కదిలింది?
ఈ గూడ్స్ రైలుకు సంబంధించిన లోకో పైలెట్లు కథువా స్టేషన్ లో రైలు ఆపి, డ్యూటీ దిగారు. వారి స్థానంలో మరో ఇద్దరు లోకో పైలెట్లు రావాల్సి ఉంది. కానీ, జమ్మూ-జలంధర్ సెక్షన్ లోని ట్రాక్ కాస్త వాలుగా ఉండటంతో రైలు నెమ్మదిగా ముందుకు కదిలింది. చివరికి పంజాబ్ లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ సమీపంలోని నిటారుగా ఉన్న వాలుపైకి వెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
Read Also: రైళ్లలో రింగ్ మార్పిడి పద్దతి గురించి తెలుసా? ఒకప్పుడు ఇది చాలా ఫేమస్!
అలర్ట్ చేసిన కథువా స్టేషన్ అధికారులు
అటు కథువా నుంచి రైలు ముందుకు కదిలిన విషయం వెంటనే స్టేషన్ అధికారులు జలంధర్- పఠాన్ కోట్ సెక్షన్ లోని అన్ని రైలు- రోడ్డు క్రాసింగ్ లకు సమాచారం అందించారు. అన్ని చోట్ల రైల్వే గేట్లు వేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ రైలును ఆపేందుకు ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ అధికారులు ఇసుక బస్తాలు అడ్డుగా వేసి ఆపినట్లు వెల్లడించారు. కథువాలో రైలు నిలిపినప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఇండియన్ రైల్వేను షాక్ కు గురి చేసింది.
Read Also: ఇండియాలో రైల్వేకు పునాది పడింది ఎప్పుడు? దానికి కారణం ఎవరు?