Pakistan Train Hijack: పెద్ద భూభాగం.. తక్కువ జనాభా.. విలువైన ఖనిజ సంపద.. ఇలాంటి ప్రాంతం ఎలా ఉండాలి? అమెరికా, యూరప్ దేశాల్లా వెలిగిపోవాలి. కానీ, అలా లేదు. నిత్యం తీవ్రవాదంతో రక్తసిక్తంగా మారింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బాంబ్ పేలుతుందో తెలియక నిత్యం భయంతో బతకాలి అక్కడి జనం. నా అనుకున్న పాలకులే పచ్చిగా మోసం చేసిన తర్వాత వచ్చిన కోపం అది. పాకిస్తాన్ ద్రోహంతో రగిలిపోతున్న బలూచిస్తాన్ కథ ఇది. బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్‌ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు..? పాక్ పితామహుడు జిన్నా ద్రోహం చేశాడని ఎందుకు అంటారు..? రైలు హైజాక్ వెనుక కారణం ఇదేనా..? పాకిస్తాన్ ద్రోహానికి బలూచిస్తాన్ బలయ్యిందా..?
పాకిస్తాన్ నుండి విడిపోవడానికి పోరాడుతున్న BLA
పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులలో అతిపెద్దది.. అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతం బలూచిస్తాన్. ఆ భూభాగంలో ఎంతో ఖనిజ సంపద ఉంది. అక్కడి ప్రజలు చాలా రిచ్‌గా బతికే అవకాశమూ ఉంది. కానీ.. కొందరి స్వార్థం వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదూ… శాంతి అంతకంటే లేదు. నిజానికి, ఈ పదాలు అక్కడి ప్రజలు చాలా అరుదుగా చూసేవి. ఇదే పరిస్థితి.. మార్చి 11న, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ-BLA ఉగ్రవాదులు ఒక రైలును హైజాక్ చేయడానికి కారణం అయ్యింది.
ముహమ్మద్ అలీ జిన్నా బలూచ్ ప్రజలకు చేసిన ద్రోహం
పాకిస్తాన్ నుండి విడిపోవడానికి పోరాడుతున్న ఈ గ్రూపు, భద్రతా సిబ్బందితో సహా 100 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్ వ్యవస్థాపక పితామహుడు ముహమ్మద్ అలీ జిన్నా బలూచ్ ప్రజలకు చేసిన ద్రోహమే ఈ తిరుగుబాటుకు మూలకారణమన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
పాకిస్తాన్ రాజ్యానికి వ్యతిరేకంగా 1948 నుండి పోరాటం
నిజానికి, బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ రాజ్యానికి వ్యతిరేకంగా 1948 నుండి పోరాటం సాగిస్తున్నారు. 1958-59, 1962-63, 1973-77లో హింసాత్మక స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలకు బలూచిస్తాన్ సాక్ష్యంగా నలిచింది. మధ్య మధ్యలో ఈ ఉద్యమ ప్రభావం కనిపించినప్పటికీ.. తాజా ఉద్యమం మాత్రం 2003 నుండి ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. మార్చి 11న, BLA ఉగ్రవాదులు క్వెట్టా-పెషావర్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించి.. వందలాది మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గన్ పాయింట్‌లో వణికిపోతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితులకు.. ఇంతటి పోరాటానికి కారణం పాకిస్తాన్ పాలకుల స్వార్థపూరిత, నిరంకుశ వైఖరే కారమని బలూచిస్తాన్ ప్రజలు చెబుతారు.
పంజాబ్ ఆధిపత్య రాజకీయాలతో విస్మరించబడిన బలూచ్
బలూచిస్తాన్ ప్రాంతం శుష్కమైనదే కానీ ఖనిజ సంపదతో కూడిన ప్రావిన్స్. అక్కడి ప్రజలు చారిత్రాత్మకంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ఆధిపత్య రాజకీయాలతో విస్మరించబడుతున్నారనే భావనలో ఉన్నారు. నిజానికి, బలూచ్ ప్రజలు ఆర్థికంగా అణచివేయబడిన జనంగా బతుకుతున్నారు. వాళ్ల భూమిలోని ఖనిజ సంపదను పాకిస్తాన్ ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి దోచుకుంటున్నారని ఎప్పటి నుండో ఆందోళనలు ఉన్నాయి. బలూచ్ ప్రజల ఆగ్రహానికి గురైన సందర్భాల్లో ఒకటి.. పాకిస్తాన్ చైనా సహాయంతో అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ ఓడరేవు.
గ్వాదర్ ఓడరేవు చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో భాగం
అందుకే, గతంలో బలూచ్ మిలిటెంట్ గ్రూపులు.. ఓడరేవు పనుల్లో ఉన్న చైనా ఇంజనీర్లపై దాడి కూడా చేశాయి. ఈ గ్వాదర్ ఓడరేవు చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా ఉంది. అయితే, ఇంతగా వీళ్లు పోరాడుతున్నప్పటికీ.. బలూచ్ జాతీయవాద ఉద్యమ నాయకత్వం చాలా విచ్ఛిన్నంగా ఉందనే అభిప్రాయలు ఉన్నాయి. ఫలితంగా, బలూచ్ జాతీయవాద ఉద్యమం దాని లక్ష్యాలలో.. దాని వ్యూహాలలో ఏకీకృతం కాలేదని విశ్లేషణలు ఉన్నాయి.
2004లో ప్రారంభమైన తాజా సాయుధ తిరుగుబాటు
అయితే, 2004లో ప్రారంభమైన తాజా సాయుధ తిరుగుబాటు తర్వాత.. 2006లో పాకిస్తాన్ దళాలు.. బలూచ్ గిరిజన పవర్‌ఫుల్ నాయకుడు అక్బర్ ఖాన్ బుగ్టిని హత్య చేశారు. ఈ ఘటన తర్వాత బలూచ్ ఉద్యమం మరింత ఊపందుకుంది. బలూచిస్తాన్‌లోని సహజ వాయువు ఆదాయంలో ఎక్కువ స్వయంప్రతిపత్తి, వనరుల నియంత్రణ, న్యాయమైన వాటా కావాలని బుగ్టి… పాకిస్తాన్‌ని డిమాండ్ చేశాడు. అయితే, దీనికి ముందు కూడా 1970లలో బలూచ్ మిలిటెన్సీ చర్యలు అత్యంత రక్తపాతాన్ని సృష్టించిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఎక్కువ కాలం కొనసాగిన పోరాటాల్లో అది కూడా ఒకటి. నిజానికి, 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బలూచిస్తాన్‌లోని నేషనల్ అవామి పార్టీ నాయకుల నుండి ఎక్కువ స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లు పెరిగాయి.
1977 వరకు నాలుగేళ్లు పూర్తి స్థాయి సాయుధ తిరుగుబాటు
అయితే, నాటి ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ఈ డిమాండ్లను తోసిపుచ్చడంతో నిరసనలు పెరిగాయి. 1973లో భుట్టో అక్బర్ ఖాన్ బుగ్టి నేతృత్వంలోని బలూచిస్తాన్ ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇరాక్ రాయబార కార్యాలయంలో బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల కోసం ఉద్దేశించిన ఆయుధాల నిల్వ దొరికిందనే కుట్రతో పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రకటించాడు. దీని ఫలితంగా 1977 వరకు నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయి సాయుధ తిరుగుబాటు కొనసాగింది. దీనిని నాల్గవ బలూచిస్తాన్ వివాదంగా పిలుస్తారు.
దాదాపు 55 వేల మంది బలూచ్ గిరిజనులు
నివేదికల ప్రకారం, మర్రి, మెంగల్, బుగ్టి అనే గిరిజన నాయకుల నాయకత్వంలో దాదాపు 55 వేల మంది బలూచ్ గిరిజనులు.. 80 వేల మంది పాకిస్తాన్ సైనిక సిబ్బందిపై పోరాటం సాగించారు. ఇది ప్రపంచ చరిత్రలో చాలా సంచలన పోరాటం కూడా. అయితే, పాకిస్తాన్ వైమానిక దళం బలూచిస్తాన్ గ్రామాలపై బాంబు దాడి చేసి వేలాది మంది బలూచ్ పౌరులను చంపింది. ఈ వివాదం ఎంతగా పెరిగిందంటే, బలూచ్ జాతీయవాదం తన సొంత బలూచ్ ప్రాంతంలోకి వ్యాపిస్తుందని భయపడి.. ఇరాన్ కూడా పాకిస్తాన్‌కు సైనిక సహాయం అందించింది.
1977లో సైనిక తిరుగుబాటులో భుట్టో తొలగింపు
దీనితో.. 1977లో, జనరల్ జియా-ఉల్-హక్ సైనిక తిరుగుబాటులో భుట్టోను తొలగించాడు. గిరిజనులకు క్షమాభిక్ష మంజూరు అయ్యింది. ఇక, బలూచిస్తాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత సాయుధ పోరాటం ముగిసింది. అయితే, దీని తర్వాత.. మరో రెండు బలూచిస్తాన్ సంఘర్షణలు జరిగాయి.
భారత్ సహకరిస్తే.. బలూచ్ బయటపడేదా..?
ఇంతకీ, బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ ఎలా మోసం చేసింది..? దీని వెనుక, పాక్ పితామహుడి పాత్ర ఎంతుంది..? అసలు, బలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఎలా విలీనం చేశారు..? అప్పుడు, బలూచ్ పాలకుల పరిస్థితి ఏంటీ..? ముహమ్మద్ అలీ జిన్నా ఎలాంటి కుయుక్తులను పన్నారు..? భారత్ సహకరిస్తే.. బలూచ్ బయటపడేదా..?
1954లో పాకిస్తాన్ వన్ యూనిట్ పథకం ప్రారంభం
1954లో, పాకిస్తాన్ వన్ యూనిట్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దాని ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా.. బలూచిస్తాన్‌ను ఇతర ప్రావిన్సులతో ఒక యూనిట్ కింద విలీనం చేయడం వలన.. దాని స్వయంప్రతిపత్తి తగ్గింది. ఇది బలూచ్ నాయకులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ క్రమంలోనే, కలాత్ ఖాన్ అయిన నవాబ్ నౌరోజ్ ఖాన్ 1958లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ దళాలపై గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాడు.
1959లో పాకిస్తాన్ హామీలతో లొంగిపోయేలా మోసం
అయితే, 1959లో, పాకిస్తాన్ నౌరోజ్ ఖాన్‌ను దయతో కూడిన హామీలతో లొంగిపోయేలా మోసం చేసింది. బదులుగా, నౌరోజ్, అతని కుమారులు అరెస్టు అయ్యారు. అతని ఐదుగురు బంధువులను ఉరితీశారు. పాకిస్తాన్ చేసిన ఈ ద్రోహం బలూచ్‌లో ఆగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత బలంగా మార్చింది.
వన్ యూనిట్ సూత్రాన్ని అంగీకరించని బలూచిస్తాన్
నిజానికి, బలూచ్ ఎప్పుడూ వన్ యూనిట్ సూత్రాన్ని అంగీకరించలేదు. ఐదు సంవత్సరాల పాటు అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రావిన్స్ 1963లో మూడవ బలూచిస్తాన్ సంఘర్షణను ఎదుర్కుంది. షేర్ ముహమ్మద్ బిజ్రానీ మర్రి నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు లక్ష్యం పాకిస్తాన్ బలూచిస్తాన్‌లోని గ్యాస్ నిల్వల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలనే. అలాగే, వన్ యూనిట్ పథకాన్ని రద్దు చేయాలని, బలూచ్ తిరుగుబాటుదారులను విడుదల చేయాలని బలవంతం చేశారు.
1970లో వన్ యూనిట్ విధానం రద్దు
ఈ తిరుగుబాటు 1969లో సాధారణ క్షమాభిక్ష, బలూచ్ వేర్పాటువాదులను విడుదల చేయడంతో ముగిసింది. ఇక, 1970లో, వన్ యూనిట్ విధానాన్ని రద్దు చేసిన తర్వాత బలూచిస్తాన్ నాలుగు ప్రావిన్సులలో ఒకటిగా గుర్తించబడింది. అయినా.. బలూచిస్తాన్ ప్రజలకు ఎలాంటి శాంతీ రాలేదు. ఏ ప్రయోజనం దక్కలేదు.
నాలుగు రాచరిక రాష్ట్రాలుగా బలూచిస్తాన్
అయితే, 1947లో పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయినప్పుడు బలూచిస్తాన్ తిరుగుబాటుకు మూలం ప్రారంభమైంది. బలూచిస్తాన్ ప్రాంతం నాలుగు రాచరిక రాష్ట్రాలుగా ఉనికిలో ఉంది. వాటి పేర్లు కలత్, ఖరన్, లాస్ బేలా, మకరన్‌లు. అయితే, వీళ్లకు ఆ టైమ్‌లో మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భారతదేశంలో చేరడం.. రెండు, పాకిస్తాన్‌లో విలీనం కావడం.. లేదంటే, చివరి ఆప్షన్ వారికున్న స్వాతంత్ర్యాన్ని కొనసాగించడం. అయితే, ఇక్కడే పాకిస్తాన్ పితామహుడు ముహమ్మద్ అలీ జిన్నా మడతపెట్టారు. ఆయన ప్రభావంతో మూడు రాష్ట్రాలు పాకిస్తాన్‌లో విలీనం అయ్యాలే చేశారు.
పూర్తి బలూచిస్తాన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం
అయితే, ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ నేతృత్వంలోని కలాత్ ఖాన్ స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారు. కలాత్ ఖాన్ 1946లో ముహమ్మద్ అలీ జిన్నాను బ్రిటిష్ క్రౌన్ ముందు తన కేసును వాదించడానికి తన న్యాయ సలహాదారుగా నియమించుకున్నాడు. ఆగస్టు 4, 1947న ఢిల్లీలో జరిగిన సమావేశంలో, లార్డ్ మౌంట్‌బాటెన్, కలాత్ ఖాన్, జవహర్‌లాల్ నెహ్రూ హాజరైనప్పుడు, కలాత్ ఖాన్ స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాన్ని జిన్నా సమర్థించారు. జిన్నా పట్టుబట్టడంతో, ఖరన్, లాస్ బేలను కలాత్‌లో విలీనం చేసి, పూర్తి బలూచిస్తాన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఆగస్టు 15, 1947న కలాత్ స్వాతంత్య్రం ప్రకటించింది.
1947 అక్టోబర్ సమావేశంలో కలాత్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేసే..
అయితే, అది స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 12న బ్రిటిష్ మెమోరాండం ప్రకారం.. కలాత్ స్వతంత్ర రాజ్యంలో అంతర్జాతీయ బాధ్యతలను చేపట్టలేమని పేర్కొన్నారు. 1947 అక్టోబర్‌లో జరిగిన వారి సమావేశంలో.. కలాత్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఖాన్‌ను జిన్నా కోరాడు. అయితే జిన్నా వాదనను కలాత్ ఖాన్ తిరస్కరించారు. వెంటనే భారతదేశంతో సహా అనేక వర్గాల నుండి ఖాన్ సహాయం కోరారు. అయితే, ఎక్కడి నుండీ సహాయం అందకపోవడంతో.. చివరకి కలాత్ ఖాన్ లొంగిపోవాల్సి వచ్చింది. అదే ఏడాది మార్చి 26న, పాకిస్తాన్ సైన్యం బలూచ్ తీర ప్రాంతంలోకి ప్రవేశించింది. ప్రాణ భయంతో కలాత్ ఖాన్.. ముహమ్మద్ అలీ జిన్నా నిబంధనలకు అంగీకరించాల్సి వచ్చింది.
1948లో పాకిస్తాన్‌పై మొదటి సాయుధ తిరుగుబాటు
కలాత్ ఖాన్ పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి సంతకం చేసినప్పటికీ.. ఖాన్ సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం, 1948లో పాకిస్తాన్‌పై మొదటి సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అయితే, ఆ తిరుగుబాటును కొద్దిసేపటికే పాకిస్తాన్ అణచివేసినప్పటికీ, అది బలూచ్ జాతీయవాదానికి బలమైన బీజాలు వేసింది. కాబట్టి, 226 రోజుల పాటు స్వతంత్రంగా ఉన్న తర్వాత, బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో విలీనం అయినప్పటికీ.. ఇప్పటికీ అక్కడ శాంతి నెలకొనలేదు.
75 సంవత్సరాల క్రితం జరిగిన ద్రోహం
ఎందుకంటే, ఆ విలీనం ప్రజల సంకల్పంతో కాదు, జిన్నా చేసిన ద్రోహం, పాకిస్తాన్ సైనిక శక్తి ద్వారా లాక్కోబడింది. 75 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ద్రోహం.. అక్కడి ప్రజలను, ఆ ప్రాంత వనరులను ఇప్పటికీ దోపిడీ చేయడం.. బలూచ్ ప్రజల సాయుధ ప్రతిఘటనకు బలమైన మూలాలుగా ఉన్నాయి. మోసపోయిన్ బలూచిస్తాన్ ఇంకా రగులుతూనే ఉంది.