Iran-Israel Leaders: పశ్చిమాసియా.. ఇప్పుడొక అగ్నిపర్వతంలా బద్దలవుతోంది. మిసైళ్ల మోత, బాంబు పేలుళ్లు, డ్రోన్ల బ్లాస్ట్‌లతో.. ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఏ దేశాధినేతలైనా వార్ రూమ్స్‌లో కనిపిస్తుంటారు. సైన్యంలోనూ, ప్రజల్లోనూ ధైర్యం నింపుతుంటారు. కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. రెండు దేశాల కీలక నేతలు అదృశ్యం కావడం.. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడిదే అంశంపై హాట్ డిబేట్ నడుస్తోంది. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ ఉన్నారు? ఈ అదృశ్యం వెనుక ఉన్న వ్యూహాలేంటి? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత.. ఆయన వారసుడిగా, దేశ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. అయితే.. ఇజ్రాయెల్, అమెరికా మొజ్తబాని కూడా అంతం చేస్తామని ప్రకటించాయి. ఇంతలోనే.. మొజ్తబా ఖమేనీ ఒక్కసారిగా కనుమరుగవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, ఇజ్రాయెల్ దాడుల్లో.. మొజ్తబా గాయపడ్డారని, ఓ సురక్షిత ప్రదేశంలో ఆయనకు చికిత్స కొనసాగుతోందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని ఇరాన్ చెబుతోంది. కాకపోతే, ఇజ్రాయెల్, అమెరికా మొజ్తబా ఖమేనీని కూడా టార్గెట్ చేస్తాయనే ఆలోచనతో.. ఆయన్ని అత్యంత సురక్షితమైన, రహస్య ప్రాంతానికి తరలించినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. మొజ్తబాను సురక్షితంగా ఉంచడం ఇరాన్ మతగురువులకు అత్యంత కీలకం. యుద్ధం సమయంలో, ఆయనకు కూడా ఏమైనా జరిగితే.. దేశంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. మొజ్తబా కూడా తెరవెనుక నుంచి తమ సైన్యాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యాక మొజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్ యుద్ధంపై కీలకమైన ప్రకటన చేశారు. తమ దేశంపై, నాయకత్వంపై జరిగిన దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అమరవీరుల రక్తాన్ని వృథా పోనివ్వమని, శత్రువు పశ్చాత్తాపపడేలా చేస్తామని హెచ్చరించారు. ఇక, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని కూడా మూసేస్తామని చెప్పారు. దీని ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ సహా వారి మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా, తమ భూభాగంలోని అమెరికా మిలటరీ బేస్‌లను ఉపయోగించుకోవద్దని.. గల్ఫ్ దేశాలను కూడా కోరారు. లేనిపక్షంలో.. ఆ దేశాలు కూడా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కానీ, ఈ ప్రకటన తర్వాత మొజ్తబా ఎక్కడున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ చెబుతున్నట్లు.. ఆ దేశం చేసిన దాడిలో మొజ్తబా ఖమేనీ గాయపడ్డాడా? కోమాలా ఉన్నాడా? అనేది సస్పెన్స్‌గా మారింది. కానీ, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం.. అతన్ని కచ్చితంగా అంతం చేస్తామని హెచ్చరిస్తున్నాయ్.
మరోవైపు.. నిరంతరం మీడియా ముందు కనిపిస్తూ గంభీరమైన ప్రసంగాలు చేసే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కొన్నిరోజులుగా కనిపించడం లేదు. ఉన్నట్టుండి.. ఆయన కూడా అదృశ్యమైపోయారు. అయితే, ఆయన ఇరాన్ దాడుల్లో చనిపోయారనే ప్రచారం సాగింది. దీనిని, ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఆయన బతికే ఉన్నారని చెప్పింది. కానీ, ఇటీవలే నెతన్యాహు ప్రసంగిస్తూ రిలీజ్ చేసిన వీడియో.. అనేక ప్రశ్నలను, అనుమానాలను లేవనెత్తింది. ఈ వీడియోలో.. నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని, ఇది ఏఐ క్రియేటెడ్ వీడియో అని, నెతన్యాహు లేరనే వార్త బయటకు రాకుండా.. ఇజ్రాయెల్ జాగ్రత్త పడుతోందని.. రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారాలు సాగాయ్. ఈ రెండు వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. విషయమేంటో అర్థమవుతుంది. ఇందులో.. ఒకటి మార్చ్ 8న రిలీజ్ చేసిన వీడియో ఉంది. మార్చ్ 13న రిలీజైన వీడియో ఉంది. ఈ రెండింటికి చాలా తేడాలున్నాయ్. మార్చి 13న రిలీజ్ చేసిన వీడియోలో.. నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే.. అనేక డౌట్స్‌కి కారణమైంది. ఒకవేళ.. నిజంగానే నెతన్యాహు బతికి ఉంటే, ఏఐ వీడియో ఎందుకు రిలీజ్ చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది? పబ్లిక్‌లో బాగా తిరిగే నాయకుడు, అడపాదడపా మీడియా ముందు కనిపించే వ్యక్తి.. ఇప్పుడెందుకు అదృశ్యమైపోయారనే చర్చ మొదలైంది. లేక, ఇరాన్ టార్గెట్ చేసిందని.. నిజంగానే నెతన్యాహు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారా? ఇరాన్ చెబుతున్నట్లు.. దాడుల్లో ఏమైనా గాయపడ్డారా? అనేది కూడా మిస్టరీగా మారింది.
ఇటీవలే నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి జరగడంతో.. భద్రతా బలగాలు ఆయన కదలికలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నాయనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, శత్రువుకు తన తదుపరి అడుగు తెలియకూడదనే ఉద్దేశంతోనే నెతన్యాహు కావాలనే సైలెంట్ అయ్యారని, ఆయన మౌనం ఇరాన్‌కు ఒక రకమైన మైండ్ గేమ్ అని అంటున్నారు. నెతన్యాహు.. ప్రస్తుతం జెరూసలేంలోని అత్యంత అధునాతనమైన, అణుబాంబు దాడులను సైతం తట్టుకోగల అండర్‌గ్రౌండ్ బంకర్ నుంచి యుద్ధాన్ని నడిపిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయ్. ఏదేమైనా ఇజ్రాయెల్ మాత్రం.. తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఏమీ కాలేదని, బతికే ఉన్నాడని చెబుతోంది. ఇరాన్ కూడా నెతన్యాహు చనిపోకపోతే.. కచ్చితంగా చంపుతామని హెచ్చరిస్తోంది. యుద్ధంలో భీకరంగా తలపడుతున్న రెండు దేశాల నేతలు.. ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో రకరకాల చర్చలు మొదలయ్యాయ్. దాడుల్లో వాళ్లకేమైనా జరిగిందా? తెరవెనుక ఉండి అంతా వాళ్లే నడిపిస్తున్నారా? అనేది మాత్రం మిస్టరీగా మారింది.
ఇదే.. ఇప్పుడు గ్లోబ్ మొత్తం నడుస్తున్న డిబేట్. తాము సురక్షితంగా ఉంటేనే.. దేశం సేఫ్‌గా ఉంటుందనే ఆలోచనతోనే.. ఇద్దరు అధినేతలు అజ్ఞాతంలోకి వెళ్లారా? లేక నాయకత్వ శూన్యత ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అంతేకాదు.. శత్రువుకు చిక్కకుండా, సిగ్నల్ ఇంటలిజెన్స్ నుంచి తప్పించుకునేందుకు, లొకేషన్ ట్రేసింగ్ జరగకుండా ఉండటానికి కూడా ఇలా చేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయ్. పశ్చిమాసియా యుద్ధ రంగంలో.. ఈ మిస్సింగ్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఇప్పుడు అందరి కళ్లు.. వాళ్లిద్దరి మీదే ఉన్నాయ్. వీళ్లిద్దరూ.. ఎక్కడి నుంచి యుద్ధ తంత్రాన్ని నడిపిస్తున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇది వ్యూహాత్మక అదృశ్యమా? లేక ప్రాణభయమా? అనే చర్చ కూడా సాగుతోంది.
యుద్ధ సమయంలో.. శత్రువుల మెయిన్ టార్గెట్ ఎప్పుడూ.. ముఖ్య నేతలు, అగ్ర నేతల మీదే ఉంటుంది. ఇప్పటికే.. యుద్ధం మొదటి రోజే అయతుల్లా అలి ఖమేనీని ఇజ్రాయెల్-అమెరికా అంతం చేశాయ్. ప్రతీకారంగా.. ఇరాన్ కూడా తన మిసైళ్లతో.. నెతన్యాహు నివాసాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హెచ్చరించాయ్. అందుకే, ఆయన బంకర్ల నుంచే యుద్ధాన్ని, పాలనని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబా ఖమేనీని కూడా అంతం చేస్తామని అమెరికా హెచ్చరించింది. దాంతో.. పొంచి ఉన్న ముప్పు నుంచి తప్పించుకునేందుకు.. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కూడా ఇరాన్ సురక్షిత ప్రాంతానికి తరలించిందనే వార్తలు వస్తున్నాయ్.
భూమిపై జరుగుతున్న యుద్ధరంగంలో అనుసరించాల్సిన వ్యూహాలను.. ఇప్పుడు రెండు దేశాల అధినేతలు భూమి గర్భంలో ఉండి డిసైడ్ చేస్తున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే.. అన్నీ నడిపిస్తున్నారని చెబుతున్నారు. యుద్ధ సమయాల్లో.. దేశాధినేతలు ఎక్కువగా బయటకు కనిపించకపోవడం కూడా యుద్ధంలో భాగమే అంటున్నారు. కీలక నేతలు ఎక్కడున్నారో తెలియనప్పుడు, శత్రువు ఎక్కడ దాడిచేయాలో, ఎవరిపై దాడి చేయాలో తెలియక అమోయమయంలో పడతారు. నెతన్యాహు గానీ, మొజ్తాబా గానీ బయటకు రావడం లేదంటే.. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారనే సంకేతం బయటకు వెళ్తుంది. ఇది.. శత్రుసైన్యంపై ప్రెజర్ పెంచుతుంది. ఇప్పుడు.. రెండు దేశాల అధినేతల అదృశ్యం వెనుక కొన్ని కీలక అంశాలు కనిపిస్తున్నాయ్.
ఇరాన్ భారీ మిసైల్ దాడులకు సిద్ధమవుతుంటే, ఇజ్రాయెల్.. ఇరాన్‌లో అణు కేంద్రాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక, కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని సురక్షితంగా ఉంచడం.. ఇరాన్‌కు అత్యవసరం. తెరవెనుక అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిపేందుకు, రహస్యంగా రాయబారాలు నడిపేందుకు కూడా ఈ అజ్ఞాతం పనికొస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అగ్రనేతలు కనిపించనంత మాత్రాన యుద్ధం ఆగిపోతుందని కాదు.. ఇదంతా రాబోయే తుపాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. వాళ్లు అజ్ఞాతంలో ఉన్నారంటే.. యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు, వీలైనంత త్వరగా ముగించేందుకు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అయితే, ఈ అజ్ఞాతం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
Also Read: అగ్రరాజ్యానికే చుక్కలు చూపిస్తున్న ఆ ఒక్కడు.. ఎవరీ అలీ జఫారీ? ఏంటా మాస్టర్ ప్లాన్?
Story by: Anup, Big Tv