తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగానే కేసీఆర్ పాత్రను చిత్రీకరించాడు ది ప్యారడైజ్ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తన స్టోరీ కోసం కేసీఆర్ కల్పిత పాత్రను క్రియేట్ చేసి.. ప్రియదర్శికి అచ్చం అదే రూపునిచ్చి అదే మ్యానరిజంలో తెలంగాణ డైలాగులను చెప్పించాడు బాగానే ఉంది.
అందులో ఉద్యమ డైలాగులెందుకు? చావు నోట్లో తలపెట్టైనా నిన్ను కాపాడుతానని కేసీఆర్ పాత్ర హీరో నానితో అనే డైలాగును.. అదీ సిగరెట్టు తాగుతూ.. మొత్తంగా ఇది కేసీఆర్‌ను పూర్తిగా నెగిటివ్‌గా చూపలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే .. ఆయన పాత్రను పూర్తి కామెడీగా తీసి నవ్వులు పూయించేందుకు వాడుకున్నట్టుంది.
ఆ సీరియస్ సన్నివేశంలో కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి కనిపించగానే ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఈలలు వేశారు. ఆ పాత్రకు అంత హుందాతనం ఆపాదించలేదు డైరెక్టర్. అచ్చు గుద్దినట్టు కేసీఆర్ నే చూపాలనుకున్నప్పుడు.. కొంచెం సీరియస్ పాత్రగా చిత్రీకరించినా బాగుండేది. కానీ కామెడీ కోసం వాడుకుని..అందులో తెలంగాణ ఉద్యమ సమయం నాటి చావు నోట్లో తలపెట్టి అనే డైలాగును హీరోకు అభయం ఇచ్చేందుకు వాడుకున్నా..అది పేరడి కామెడీనే తలపించింది తప్ప..ఆ పాత్రకు సరిపోలేదు. ఆ సినిమా స్టోరీకి బూస్టింగ్ ఇవ్వలేదు. హీరోయిజాన్ని మరింత డ్యామేజీ చేసే విధంగా దాన్ని వాడుకున్నట్టనిపించింది.
ప్రియదర్శి.. కేసీఆర్ పాత్ర చివరకు హీరోకు సాయం చేసే పాత్రే. కానీ మధ్యలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రగా వచ్చి.. కేసీఆర్ మ్యానరిజాన్ని ప్రదర్శించడం మూలంగా ఇది కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, చావు నోట్లో తలకాయ పెట్టి అనే డైలాగు వాడటం వల్ల తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినట్టే ఉందంటున్నారు.
అక్కడ హీరో ఐదు వేల మంది ఉనికి కోసం పోరాడే పాత్ర.. తెలంగాణ ఉద్యమం నాలుగు కోట్ల ప్రజల ఆత్మభిమానంతో కూడుకున్న సందర్భం. కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక్కడే చేసినా.. అతని వెనుక యావత్ తెలంగాణ సబ్బండవర్గాలున్నాయి. ఒక్క కేసీఆర్ ముందుండి ఆత్మార్పణానికి తెగించాడు కావొచ్చు… కానీ అతనికి వెయ్యి ఏనుగుల బలంగా వెన్నుదన్నుగా నిలిచింది తెలంగాణ జనం.
మరి చరిత్ర మీద అవగాహన లేకనా..? ఆ పాత్ర వాడుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందనే లాభాపేక్షా? ప్రియదర్శి అచ్చంగా కేసీఆర్ పాత్రకు సరిపోతాడు.. ఓ ప్రయోగం చేసి వదలుదామనే తుంటరితనమా తెలియదు..! కానీ డైరెక్టర్, నాని ఇద్దరూ ఈ పాత్ర ద్వారా తెలంగాణ భాషను వాడుకుని, పాటలను విరివిగా జొప్పించుకుని, దానికి పాన్ ఇండియా అని ట్యాగ్ తగిలించి.. ఇక్కడ మూలకేంద్రంగా ఉన్న తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ మీద మంటపెట్టినట్టుగా చేశారనే భావన వ్యక్తమవుతోంది.
అయితే ఏం చేద్దమంటావ్..? అనే కేసీఆర్ పాపులర్ కామెంట్ ఒకటి ఉంది. ఇంకొన్ని ఆయన చికాకు పడ్డప్పుడు పలికే మాటలున్నాయి. వీటన్నింటినీ మీమ్స్‌కే వాడుతున్నారంతా. ఇప్పుడు డైరెక్టర్ ఓదెల ప్రియదర్శి పాత్ర ద్వారా చేపించింది కూడా అచ్చంగా ఇదే. అంతకుమించి అవమానించి వదిలేశాడు కూడా.
ఉద్యమ సమయంలో .. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో .. పవన్, పూరీ కలిసి కేసీఆర్ కుటుంబంపై దాడి చేశారు. విజయశాంతి పాత్రను గుట్కాలు తినే లేడీ లీడర్ పాత్రగా చిత్రీకరించారు అందులో. ఇది అచ్చంగా తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు కేసీఆర్ టార్గెటెడ్‌గా వచ్చిన సినిమా. ఆ సినిమా చూసిన వారెవరికైనా అందులో పవన్ పైత్యమే కనిపించింది. పూరీ తన సినియారిటీ వలవలన్నీ విప్పేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అవుతుందని వారిద్దరికీ తెలుసు. ఇప్పుడు ప్యారడైజ్‌లో కేసీఆర్ పాత్ర ప్రయోగం కూడా అంతే.