చిరంజీవి ఠాగూర్ సిన్మాల ఓ ఫేమస్ డయిలాగ్ ఉంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం… అని. ఇదే డయిలాగుని కేసీఆర్ సార్ను చెప్పమంటే ఎట్ల చెప్తడో తెలుసా? తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్ అని చెప్తుండొచ్చు.
ఇప్పుడీ ముచ్చటెందుకంటే.. ఒకప్పుడు ఫామ్‌హౌజ్ పేరు తీస్తేనే పెద్ద సారు కస్సున లేచెటోడు. బుస్సున ఆవేశం పొంగుకొస్తుండే. ఆ మాటన్నోడు మళ్లా ఆయన కండ్ల ముందుకు రావాలంటేనే జంకుతుండే.. రానీయకపోతుండననుకో అది వేరే ముచ్చట. ఇప్పుడు గీ ఫామ్‌హౌజ్ ముచ్చట ఎందుకొచ్చిదంటే.. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు.. నిత్తెం మీటింగులతో బిజీ బిజీ ఉండేటోడు. వరుసగా మీటింగులు వెట్టి వెట్టి బాగా అలిసిపోయినట్టు అనిపించినప్పుడు సక్కగా తన కారు కాన్వాయన్‌ను ఫామ్‌హౌజ్‌కు తిప్పమనేటోడు.
కొంచెం సేపు సేదతీరి.. మళ్లా మైండ్‌కు పదునువెట్టి.. కొత్త కొత్త ఆలోచనలను కైగట్టి.. దానికి కార్యరూపంల వెట్టి.. అట్ల జనంల ఇడిసి శభ్బాష్ అని అనిపించుకునుడు పెద్ద సారుకు లవ్‌పీర్తి. అట్ల బాగా అలసిపోయి సేద తీరుతున్న సమయంలో ఎవలూ డిస్టబు చేయొద్దు. చెయ్యరు కూడా. అటెంకల్ల ఎవలూ పోరు. గేటు దాటరు. పల్కరిచ్చే సాహసం జెయ్యరు.
అట్ల ఆయన అప్పటి సంధి అండ్ల మేదోమథనం చేసోటోడన్నమాట. మంచి మంచి పత్కాలన్నీ ఆయన మైండ్లకెళ్లి వచ్చినయంటే.. పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ పోయి.. హిట్ల సినిమాలకు కథలు రాసినట్టు.. ఫామ్‌హౌజ్ ప్రకృతిలోని ఆహ్లాదంలో కెళ్లి వచ్చే ఆలోచన్ల నుంచి వచ్చినవే ఇప్పటిదాన్కా ప్రవేశపెట్టిన పత్కాలన్నమాట.
ఇగ ఇట్లనే ఒగ రోజు ఆయన సాయంకాలం పూట అలిసిసొలిసి ఫామ్‌హౌజ్‌కు చేరిండంట. తెల్లారింది. పొద్దుగళ్ల పొద్దుగళ్ల పేపర్లన్నీ మడతబెట్టి తిర్గేసుడు బాపుకు బగ్గ అల్వాటేననుకో. గిప్పడైతే కేటీఆర్ సారు పేపర్లు సదువుడే బంజేసిండంట. ఓడగొట్టినందుకు జనాల మీద కోపమే అనుకున్నం.. గా పేపర్లు… ఆ రాతలు రాసే ఇలేకర్ల మీద గుడ్క బగ్గనే కోపం ఉన్నట్టుంది రామన్నకు.
సరే, గీ ముచ్చటిప్పుడెందుకు గానీ..! అగో అట్ల పేపర్లన్నీ తిరగేయ్యంగ లాస్టుకు నమస్తే తెలంగాణల ఓ మూలకు ఓ చిన్న వార్త కనిపించింది సారుకు. ఒక్కసార్గా ఆయన కండ్లు అక్కడ కొంచెం సేపు ఆగినయంట. అదేం పెద్ద ఇంపార్టెంటు వార్త కాదు.. కొంపలు మున్గిపోయే న్యూసు అసలే కాదు. మరింకేందనుకుంటున్నరా?
ఫామ్‌హౌజ్‌కు చేరుకున్న కేసీఆర్.. ఇదీ ఆ వార్త హెడ్డింగు. ఇంకేందిగ… సారుకు బీపీ సర్రున లేసింది. ఎవడ్రా ఈ వార్త రాసింది.. అని ఆ పేపర్ను ఇసిరి నూకిండు. అది ముడతలు ముడతలు పడి లుంగలు సుట్కవోయి ఆ రూమ్ల ఓ మూలకు వోయి వడ్డది. అక్కడున్నోళ్లకు విషయం దెల్వక ఆగమాగమయ్యిండ్రంట. గత్తరబిత్తరయి బిత్తిరిచూపులు చూసిండ్రంట.
ఇక్కడి వార్తలు రాసే ఆ ఇలేకరిగాడెవడ్రా..? అని అడిగిండంట. అయినా ఆళ్లకు అర్థంగాలే. గానికి ఫోన్‌గల్పు అన్నడంట.. ఆ పేపర్ల పెద్దసారుకన్నమాట. వెంటనే ఆ ఫోన్లనే ఆదేశాలు రప్పారప్పా ఇచ్చేసిండంట. ఆ ఇలేకరికి ఇచ్చిపడేసిండంట. అర్థంకాలే. రేపట్నుంచి ఆడు వార్తలు రాయొద్దు… ఇదీ సర్కార్ కీ హుకుం!
మరి అసొంటి సారుకు ఇప్పుడు దినాం లేచిన కాడ్నుంచి అవే వార్తలు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో అన్ని పేపర్ల బర్రబర్ర రాయవట్టె. ఆ సర్కార్ లోలోపల్నే ఎంత మదనవడుతుండొచ్చు. బయటకైతే రానీబిడ్డ.. ఒక్కొక్కోని అంతుచూస్తా అని శపథం కూడా జేస్కున్నడు కావొచ్చు. అంటే ఎవలెవలి అంతు జూస్తడో.. ఎవలెవలి ఉద్యోగాలు పీకేస్తడో..! అనే బుగలైతే ఉందట అందర్లా.