Delhi Crime: దేశ రాజధానిలో జరుగుతున్న వరుస ఘటనలు.. మహిళలు, బాలికల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం రాత్రి కల్కాజీ ఆలయం సమీపంలోని పార్కులో.. 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా.. ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి వారిని అడ్డుకున్నారు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో.. ఆసిఫ్, హేమంత్, ముఖేశ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సోమవారం రోజు ఢిల్లీలోని దేశ్‌బంధు గుప్తా రోడ్ సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గత వారం సదర్ బజార్‌లో స్టేషనరీ కొనేందుకు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థినిపై ఆ దుకాణం యజమాని షాపులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నెల 10న.. స్వరూప్ నగర్‌లో 17 ఏళ్ల బాలిక తనకు తెలిసిన వ్యక్తిని కలిసేందుకు వెళ్లగా.. కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత.. ఆ బాలిక శవమై కనిపించింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. బాధిత బాలికలంతా మైనర్లే కావడంతో.. అన్ని కేసుల్లోనూ పోక్సో చట్టం వర్తిస్తుంది.
Also read: ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!
ఈ వరుస ఘటనలు చూశాక.. ఢిల్లీలో మహిళలకు భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. NCRB రిపోర్ట్ ప్రకారం.. 2023, 204లో.. ఢిల్లీలో వెయ్యికి పైనే అత్యాచార కేసులు నమోదయ్యాయ్. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం.. మహిళలపై నేరాలు 5 నుంచి 8 శాతం తగ్గినట్లు, కేసుల పరిష్కారం రేటు 95 శాతానికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల గస్తీ, భద్రతా ఏర్పాట్లు, వేగవంతమైన దర్యాప్తు లాంటి అంశాలపై.. దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. బాలికల భద్రతకు హామీ ఎప్పుడు దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
Also read: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!