AP Mega DSC: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా మెగా డిఎస్సీ నిర్వహించింది. దీని ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అయితే ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. ప్రత్యేకించి 370పైచిలుకు స్పోర్ట్స్ కోటాలో చేసిన నియామకాల్లో అనర్హులకు,ఫేక్ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. చాలా మటుకు ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు.
అభ్యర్ధులతో ఫోన్లో జరిగాయని చెబుతోన్న బేరసారాల ఆడియో సంభాషణలు విడుదల చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరికి గోల్డ్ మెడల్స్ వచ్చినా ఉద్యోగం రాకపోవడాన్ని బాధితులు బహిర్గతం చేశారు. అయితే ఎక్కడా ఎలాంటి అవకతవక జరగనే లేదని చంద్రబాబు అంటున్నారు. కష్టపడి చదివి ఉపాధ్యాయులైన యువతను అవమానించేలా వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండి పడుతున్నారు. ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్ధులు తాము పేర్కొన్న క్రీడాంశాల్లో పాల్గొననే లేదని సంబంధిత స్పోర్ట్స్ అసోసియేషన్లు స్పష్టం చేయడంతో ఈ కుంభకోణంపై విమర్శలు పెరిగాయి. దమ్ముంటే కోర్టులో సవాల్ చేసుకోండని చంద్రబాబు ప్రతిపక్షానికి సవాల్ విసురుతున్నారు.
Also read: ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!
ఎవరి వాదనలు వారివి. ఎవరి ఆరోపణలు వారివి. మరి అసలు నిజం ఏంటి? డిఎస్సీ అంతా సజావుగానే జరిగిందా? ఎక్కడా ఎలాంటి అక్రమాలూ జరగలేదా? అనర్హులకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదా? అర్హులకు అన్యాయం జరగలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. బాధిత యువత అదే డిమాండ్ చేస్తోంది. మరి చంద్రబాబు చెబుతోన్నట్లు నిజంగానే అక్రమాలు జరక్కపోతే విపక్షం డిమాండ్ చేస్తోన్నట్లు దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించ వచ్చు కదా.? వైసీపీ చేసినవి అసత్య ఆరోపణలయితే నిజాల నిగ్గు తేల్చి తమ నిజాయితీ చాటుకోవచ్చు కదా. ఆధారాలు బయట పెట్టి వైసీపీ నోరు మూయించవచ్చు కదా.? విద్యావేత్తలు,వామపక్ష మేథావులు ఇపుడీ ప్రశ్నలే సంధిస్తున్నారు. మరి కూటమి ముఖ్యమంత్రి వీటికి సమాధానాలు చెప్తారా? సిబిఐ దర్యాప్తుతో తమ నిజాయితీ నిరూపించుకుంటారా?
Also read: ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!