ఆ నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న పట్టు చీరల తయారీతో సిల్క్ టౌన్‌గా పేరుగాంచింది … రాజకీయంగా కూడా ఆ సెగ్మెంటుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.. అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నాయకుడికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది… ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ ఉండే వారంటే అర్థం చేసుకోవచ్చు.. అంత యాక్టివ్‌గా ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.. ఆయన అంత వెనక్కి తగ్గటానికి కారణమేంటి?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది…. ఇటు రాజకీయంగా అటు సిల్క్ సిటీ గా రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది .. గతంలో ధర్మవరం నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు గెలిచి, ఓడారు… కొంతమంది మంత్రులు కూడా అయ్యారు … కానీ ఎప్పుడూ లేనంతగా 1999 -2024 మధ్యకాలంలో ధర్మవరం నియోజకవర్గం సోషల్ మీడియాలో ఫోకస్ అయింది.. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంత పాపులర్ అయ్యారు… ఎంతలా అంటే గుడ్ మార్నింగ్ అంటే చాలు కేతిరెడ్డి గుర్తువచ్చేలా ఆయనకు పబ్లిసిటీ లభించింది.
2024 ఎన్నికల్లో ధర్మవరం స్థానం నుంచి పక్కాగా వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి …. కానీ సీన్ రివర్స్ అయ్యింది… గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారో .. ఆ క్రమంపై సోషల్ మీడియాలో అన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.. ఖాళీ జాగాలు వెతుక్కుని, కబ్జా చేయడం కోసమే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో నియోజకవర్గంలో హడావుడి చేసేవారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించేవారు.. దానికి తగ్గట్లే అధికారం కోల్పోయాక కేతిరెడ్డి అక్రమాలపై ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
తన విజయంపై ఎంతో ధీమాగా కనిపించిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేతిరెడ్డిపై 3,734 ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు… ఇక సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది…. సత్య కుమార్ మంత్రి కూడా అయ్యారు… ఇప్పటి వరకు కేతిరెడ్డి నాలుగు ఎన్నికలు చూశారు. ఇందులో రెండు సార్లు గెలిస్తే.. రెండు సార్లు ఓటమి ఎదురైంది. వాస్తవంగా ఇంత జర్నీ చేసిన వారు ఎవరికైనా గెలుపోటములను ఈజీగా తీసుకుంటారు. అయితే కేతిరెడ్డి మాత్రం తాజాగా ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారంట.
ధర్మవరం నియోజకవర్గంలో అసలు బీజేపీ ఉనికే కనిపించడదు.. గట్టిగా లెక్క పెట్టినా 20 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండరు. ఇక ఓటు బ్యాంక్ అంటారా .. కాషాయపార్టీకి అక్కడ ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా ఉండేది కారు. ఒక్కోసారి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి. అలాంటి చోట ధర్మవరం వాసులకు అసలు పరిచయం లేని సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి కేతిరెడ్డిని ఓడించారు. . ధర్మవరంలో బీజేపీ విజయంలో టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటికే ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్.. పొత్తుల లెక్కలతో సీటు దక్కకపోయినప్పటికీ… చంద్రబాబునాయుడు నిర్ణయానికి కట్టుబడి.. ఎన్నికల్లో తానే క్యాండెట్‌ని అన్నట్లు సత్యకుమార్ కోసం ప్రచారం చేశారు.
అదలా ఉంటే కమలం గుర్తు.. నియోజకవర్గం వాసులకు అసలు ఎవరో తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోవడాన్ని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారంట. అందుకే ఓటమి తరువాత వరుసగా ఆయన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఆవేదనను పంచుకుంటున్నారు. మొదటి రెండు వీడియోల్లో ఎక్కువగా తన ఓటమికి తన వ్యక్తిగత తప్పిదాల గురించి చెప్పారు… పనిలో పనిగా వైసీపీ అధ్యక్షుడ జగన్ పై ఘాటుగా స్పందించారు… జగన్ అనవసరంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వేలు పెట్టి మొత్తం ఇండస్ట్రీ వారికి దూరమయ్యారని విమర్శించారు.
సినీ ఇండస్ట్రీ జోలికి వెళ్లడం వలన జగన్ కు వచ్చిన లాభం ఏంటని కేతిరెడ్డి ప్రశ్నించారు.. అలాగే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని వల్లె వేసి … మిగిలిన వర్గాలకి జగన్ దూరమయ్యారని కేతిరెడ్డి విశ్లేషించారు.. పోనీ ఆ వర్గాలు నీ తోనే ఉన్నాయా అదీ లేదని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు … ఇక ఒక 6 నెలలు చంద్రబాబు టైం ఇవ్వాలని అంతవరకు సైలెంట్ గా ఉండాలని కొన్ని నెలల క్రితం జగన్ కు ఘాటుగానే సూచించారు
అంతవరకు బాగానే ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల కాలంలో కేతిరెడ్డి ఒకటి రెండుసార్లు మినహా ధర్మవరం నియోజకవర్గంలో బయటెక్కడా కనిపించడం లేదు. దాంతో ఆయన్ని అంత పాపులర్ చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు… ఆయన తీర్థయాత్రలు, హిమాలయాలు వంటి టూర్స్‌కు వెళ్తూ టైం పాస్ చేస్తున్నారంట … చాలా రోజుల తర్వాత ఇటీవల కరెంట్ చార్జీల ధర్నా లో మాత్రమే ఆయన కనిపించారు …అంతకు మినహా ఎక్కడ బయట కనిపించింది లేదు.
Also Read: కూటమి సర్కార్ యూ-టర్న్.. ప్రమాదకర సంకేతాలు దేనికి?
ఇక సత్య సాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌తో కేతిరెడ్డికి పోసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది… ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేతిరెడ్డి ఇటీవల కొన్ని విషయాల్లో మాత్రమే ఆచితూచి స్పందిస్తున్నారు…. ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరులో ఉంటున్నారని, లేక పోతే యాత్రలకు పోతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.. ఇటీవల కేతిరెడ్డి పక్క జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం గురించి ప్రస్తావన వచ్చిందంట … గుడ్ మార్నింగ్ వల్ల నాకు పెద్దగా ఒరిగిందేమి లేదు అని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారంట …. ఆ క్రమంలో ఇప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఉండకపోవచ్చని ధర్మవరం వాసులు చర్చించుకుంటున్నారు .. .చూడాలి మరి కేతిరెడ్డి ఏం చేస్తారో.